వంచన నాదే... వగచేదీ నేనే!

ఇంటర్లో మొదలయ్యాయి నాలో ప్రేమ వూసులు. అందుక్కారణం చంద్ర. నా క్లాస్‌మేట్‌. అందంగా, అణకువగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. క్లాసులో తనెక్కడున్నా నా కళ్లు వెతికేవి. మనసు మూగగా ఆరాధించేది. ‘ఈరోజైనా అతడితో నా ప్రేమ ...

Published : 14 Jan 2016 13:01 IST

వంచన నాదే... వగచేదీ నేనే!

 

ఇంటర్లో మొదలయ్యాయి నాలో ప్రేమ వూసులు. అందుక్కారణం చంద్ర. నా క్లాస్‌మేట్‌. అందంగా, అణకువగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. క్లాసులో తనెక్కడున్నా నా కళ్లు వెతికేవి. మనసు మూగగా ఆరాధించేది. ‘ఈరోజైనా అతడితో నా ప్రేమ విషయం చెప్పాలి’ ఇలా రోజూ అనుకునేదాన్ని. ఆగిపోయేదాన్ని. ఎందుకంటే తను ‘నో’ అంటే తట్టుకోలేను!

 

 సబ్జెక్టులో సందేహం ఇద్దర్నీ కలిపింది. తర్వాతే అర్థమైంది నేననుకున్నట్టు తను మరీ నెమ్మదేం కాదు! నోరు విప్పితే వసపిట్ట. కొత్త విషయాలెన్నో చెబుతుండేవాడు. చూస్తుండగానే కాలేజీ ముగింపుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయదల్చుకోలేదు నేను. ఓ శుభసమయాన ఆ మూడక్షరాల పదం పలికేశా. ‘నువ్వంటే నాకూ ఇష్టమే. కానీ మన ప్రేమ, పెళ్లి జరిగే పరిస్థితుల్లేవు’ ఒక్కమాటలో తేల్చేశాడు. ఏడుపాగలేదు. అయినా నేనేంటే ఇష్టమే అన్నాడుగా... ఎలాగైనా తను నా సొంతమవుతాడంది మనసు.

 

డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. మూడేళ్లలో ఒక్కరోజు విడిచి ఉండలేదు. కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడున్నాం. పెళ్లికాని భార్యాభర్తల్లా మెలిగాం. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగవేటలో పడిపోయాం. ఈలోపు అక్క పెళ్లి కుదిరింది. తనని పిలిచి ఇంట్లోవాళ్లకి పరిచయం చేద్దామనుకున్నా. కానీ ఎందుకో భయమేసి ఆగిపోయా.

 

నాకుద్యోగం వచ్చింది. తనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను కొలువులో చేరాక నాకో కొత్త ప్రపంచం కనపడింది. నాలాగే నలుగురైదుగురు కొలీగ్స్‌ ప్రేమలో ఉన్నారు. తర్వాత పెళ్లాడింది మాత్రం వేరే అబ్బాయిల్ని. తల్లిదండ్రుల్ని కష్టపెట్టలేమని.. కులం అడ్డొచ్చిందని.. అబ్బాయిది మంచి హోదా అని రకరకాల కారణాలు చెప్పారు. ఆ మాటలు నాపై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. చంద్రకి నాకు మధ్య చాలా అడ్డుగోడలు. వాట్ని నేను బద్ధలు కొడతానేమోగానీ పెద్దల అంగీకారం ఉండదేమో అనిపించింది. స్వార్థమో, భయమో నేనూ సహోద్యోగుల బాటలో వెళ్లాలనుకున్నా.

 

ఒకప్పుడు చంద్ర మాట కోసం తపించే నేను మీటింగ్‌, పని ఒత్తిడంటూ రకరకాల అబద్ధాలు చెప్పి తననుంచి తప్పించుకునేదాన్ని. అయితే ఓరోజు విడవకుండా ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. చిరాకుతో ఫోన్‌ ఎత్తా. ‘నాకుద్యోగం వచ్చింది. వెంటనే మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతా’ అన్నాడు సంతోషంగా. నా గుండెలదిరాయి. ఆ పూటకి ఏదోలా మేనేజ్‌ చేశా. తర్వాత ఏడాదిపాటు ఇదే తంతు. ఆఖరికి నువ్వంటే ప్రాణం అన్న నోటితోనే ‘నువ్వు నాకు నచ్చలేదు. మన పెళ్లి జరగద’ని తెగేసి చెప్పా.

 

కన్నవాళ్లు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి మంచి కూతురనిపించుకున్నా. మంచి భార్యగా సమాజం గౌరవిస్తోంది. కానీ నా మనసు సంద్రంలో రోజూ చెలరేగుతన్న లక్షల భావోద్వేగాలు నన్ను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త ప్రేమ చూపించినప్పుడల్లా చంద్ర గుర్తొచ్చి మనసు కకావికలమవుతోంది. భర్తనీ, ప్రియుడ్నీ మోసం చేశాననే అపరాధభావం అనుక్షణం వేధిస్తోంది. పైగా చంద్ర నాపై చూపిన పెద్దమనసు ముందు నేనెంత అల్పురాలినో తలచుకొని కుంగిపోతున్నా. ఆఖరిసారి తనకి ఫోన్‌ చేసినపుడు మరోసారి ఆలోచించమని కన్నీళ్లతో అర్థించాడేగానీ నాపై కోపం చూపించలేదు. మేం సన్నిహితంగా దిగిన ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయలేదు. ఇప్పటికీ తను నాపై అంతే ప్రేమతో ఉంటాడని తెలుసు.

 

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డా. నిర్ణయం తీసుకోవాల్సిన వయసులో పెద్దవాళ్లు గుర్తొచ్చారు. ఇప్పుడు నన్ను నేనే మోసం చేసుకున్నాననే భావనలో కొట్టుమిట్టాతున్నా. అందుకే పెద్దల్ని ఒప్పించే ధైర్యం ఉంటేనే ప్రేమలో పడండి. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో అయితే జీవితాంతం నాలాగే నటించాల్సి ఉంటుంది.

 

- ఓ సోదరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని