విఫలమైన ప్రేమకు.. భారమైన వీడ్కోలు!

డిగ్రీ మొదటి రోజు. రవీ... పిలుపుతో నాతో పాటూ ఇంకో అబ్బాయీ ‘ప్రెజెంట్‌ మేడమ్‌’ అన్నాడు. తనదీ నా పేరే. సాయంత్రం మాట కలిపా.

Published : 06 Aug 2016 00:56 IST

విఫలమైన ప్రేమకు.. భారమైన వీడ్కోలు!

డిగ్రీ మొదటి రోజు. రవీ... పిలుపుతో నాతో పాటూ ఇంకో అబ్బాయీ ‘ప్రెజెంట్‌ మేడమ్‌’ అన్నాడు. తనదీ నా పేరే. సాయంత్రం మాట కలిపా. తొందర్లోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం.

ఫస్టియర్‌లో రవి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చాడు. నేను థర్డ్‌. నాకు మూడోస్థానం వచ్చిందని వాడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఇలాంటి ఫ్రెండ్‌ దొరికినందుకు నేను సంతోషించా. నా విషయంలోనే కాదు... తను అందరూ బాగుండాలనుకుంటాడు. తన వల్ల ఎవరు బాధపడ్డా తట్టుకోలేడు.

రవి మంచివాడు, పైగా తెలివైనోడు. సహజంగానే అమ్మాయిల దృష్టిలో పడ్డాడు. అలా ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ‘రేయ్‌... నీలాంటోడు ప్రేమలో పడొద్దు... తేడా వస్తే దేవదాసువైపోతావ్‌’ సరదాగా మందలించేవాణ్ని. నవ్వేవాడు. తను ప్రేమించిన అమ్మాయికి ఏం గిఫ్ట్‌ ఇవ్వాలి? ఎక్కడికి తీస్కెళ్లాలి? ప్రేమని ఎలా వ్యక్తం చేయాలి? ప్రతీదీ అడిగేవాడు. తోచింది చెప్పేవాణ్ని.

సెకండియర్‌లో నా మార్కులు పెరిగితే, రవివి తగ్గాయి. పైగా క్లాస్‌ బంక్‌లూ ఎక్కువయ్యాయి. ప్రేమలో పడితే ఇవన్నీ 

మామూలేగా అనుకున్నా. చివరి ఏడాదిలో అయితే వాడి నెంబరే గల్లంతైంది. అడిగితే ‘బాగా రాయలేదు... అందుకే ఫెయిలయ్యా’ తేలిగ్గా చెప్పేశాడు. జీవితంలో మొదటిసారి రవిపై విపరీతమైన కోపమొచ్చింది. ప్రేమలో పడి చదువును నిర్లక్ష్యం చేశావని బాగా తిట్టా. తర్వాత ముభావంగా ఉండేవాడు. నాతో మాట్లాడ్డం తగ్గించాడు. గతంలోలాగా ఏ విషయం షేర్‌ చేసుకోవడం లేదు. తిట్టినందుకు నొచ్చుకున్నాడేమోనని సారీ చెప్పా. ‘ఛఛ అదేం లేదురా. నన్ను తిట్టే అధికారం నీకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది?’ అన్నాడు. ‘మరెందుకు నీ ప్రవర్తన మారింది. అసలేం జరిగిందో చెప్పమ’ని నిలదీశా. నోరు విప్పాడు.

‘లవ్‌లో ఫెయిలైన నా స్కూల్‌ ఫ్రెండ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. అందరం కలిసి కాపాడాం. అయినా చస్తానని బెదిరిస్తున్నాడు. వాడేమైపోతాడో అని బాధగా ఉందిరా’ అంటూ అసలు విషయం చెప్పాడు. వీడి బాధ చూడలేక ‘చచ్చేవాడు చెప్పి చావడు, బెదిరించడు. చావాలంటే చాలా ధైర్యం కావాలి. తన గురించి ఆలోచించడం మానెయ్‌’ అన్నా. ఆ క్షణం వాడి మొహంలో బాధ మాయమైంది. ‘థాంక్యూరా. నా ఫ్రెండ్‌ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. వాడికిక ఏ బాధా ఉండదు’ అంటూ నన్ను గుండెలకు హత్తుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత రవి మొహంలో ఆనందం చూశా.

‘మీ కాలేజీ స్టూడెంట్‌ ఎవరో లారీ కిందపడి చనిపోయారటగా’ వూరి నుంచి ఫోన్‌ వస్తే ఆదుర్దాగా టీవీ ఆన్‌ చేశా. ఆ విద్యార్థి ఎవరో కాదు నా ప్రాణనేస్తం రవీనే. ఏడుస్తూ బయటికి పరుగెత్తా. వాడు పోయిన నాలుగోరోజు నాకో ఉత్తరం వచ్చింది. ఎలా పంపాడో, ఎప్పుడు పంపాడో తెలియదుగానీ అది రవి నుంచే. ‘నన్ను క్షమించరా! ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను ఉండకపోవచ్చు. నువ్వు ఎంత చెబుతున్నా వినకుండా ప్రేమలో పడ్డా. నాకంటే అందగాడు, ఆస్తిపరుడు తనకు దొరకగానే నన్ను మర్చిపో అంది. ప్రాణం, జీవితం అనుకున్న అమ్మాయిని మర్చిపోవడం ఎలారా? ఇంకోసారి మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసు కంప్లైంట్‌ ఇస్తానంది. ఆ క్షణం నుంచే చస్తూ బతుకుతున్నా. ఇవన్నీ నీతో చెబితే డిస్ట్రబ్‌ అవుతావని చెప్పలేదు. అన్నట్టు నీకు నా ఫ్రెండ్‌ గురించి చెప్పాను కదా... అది నేనే. నన్ను ఓదార్చడానికి నువ్వు ఇచ్చిన సలహా నాకు నచ్చింది. ఇందులో నీ తప్పేం లేదు. ఒక స్వార్థపరురాలి చేతిలో దారుణంగా మోసపోయినందుకు నాకు నేను విధించుకుంటున్న శిక్ష. కడదాకా నీతో స్నేహితుడిగా ఉండలేకపోయినందుకు నన్ను క్షమించరా. ఇట్లు నీ రవి’ చదవడం పూర్తయ్యేసరికి ఉత్తరం కన్నీళ్లతో తడిసిపోయింది.

‘నువ్వు పోతే నిన్ను వంచించిన అమ్మాయి ఇంకో అబ్బాయిని వెతుక్కుంటుంది. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు చెట్టంత కొడుకు తిరిగిరాలేడు’ ఎక్కడో చదివినట్టు గుర్తు. రవి ఈ విషయం తెలుసుకోలేక వాళ్లకి దుఃఖమే మిగిల్చి వెళ్లాడు. వాడిలా వైఫల్యాన్ని తట్టుకోలేని పిరికివాళ్లు ప్రేమ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అర్ధిస్తున్నా.

- రవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని