ప్రేమ... బ్రేకప్‌... పెళ్లి గప్‌చుప్‌!

ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీలో చేరిన రోజులవి. కొత్త మొహాలు... అంతా కొత్త వాతావరణం. నెల గడిస్తేగానీ అడ్జస్ట్‌ కాలేకపోయా....

Published : 27 May 2017 01:33 IST

ప్రేమ... బ్రేకప్‌... పెళ్లి గప్‌చుప్‌!

ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీలో చేరిన రోజులవి. కొత్త మొహాలు... అంతా కొత్త వాతావరణం. నెల గడిస్తేగానీ అడ్జస్ట్‌ కాలేకపోయా.

మొదటి సెమిస్టర్‌ పరీక్షలు. మొదలవ్వడానికింకా పదినిమిషాల టైముంది. ఏమీ తోచక చుట్టుపక్కల తిరిగిచూశా. చారడేసి కళ్లున్న ఓ అమ్మాయి చూపులు ఫ్లాష్‌లా నన్నాకట్టుకున్నాయి. మెల్లిగా మాట కలిపా. ‘నేనూ మీ కాలేజీనే’ అనడంతో నాకాశ్చర్యం. తననెప్పుడూ చూడలేదు. బహుశా వేరే సెక్షన్‌ అయ్యుంటుందేమో! పరీక్షలయ్యాక సెలవులిచ్చారు. కళ్లు మూసినా, తెరిచినా ఆ అమ్మాయి కళ్లే గుర్తొచ్చేవి.

సెకండ్‌ సెమిస్టర్‌లో అన్ని సెక్షన్లని కలిపి జంబ్లింగ్‌ చేశారు. నా ఇనీషియల్‌ ఎం., తనది పి. ఇద్దరం ఒకే క్లాసుకొచ్చాం. అదృష్టం అంటే నాదేననుకున్నా. కొద్దిరోజులకు కంప్యూటర్‌ ల్యాబ్‌లో కనిపించింది. లేట్‌ చేస్తే నా ఫేట్‌ మారిపోతుందని వెంటనే వెళ్లి పలకరించా. ఆరోజు నుంచి చాలా విచిత్రాలు జరిగేవి. నేను తనవైపు చూడటానికి తలెత్తగానే చిత్రంగా తనూ అప్పుడే నావైపు చూసేది. చూపులతోనే గుసగుసలాడుకునేవాళ్లం. ఓరోజు తన ఫేస్‌బుక్‌ ఖాతా గురించి అడుగుదాం అనుకుంటుండగానే ‘నీ ఎఫ్‌బీ ఐడీ చెప్పు’ అంది. పదిరోజులయ్యాక ఫోన్‌నెంబర్‌ అడుగుదాం అనుకుంటుంటే ఈలోపే ‘నీ వాట్సాప్‌ నెంబర్‌ చెప్పవా’ తన వేడుకోలు. వేళ్లు నొప్పులు పుట్టేంతగా సాగేది మా చాటింగ్‌.

మనం ఒకర్ని ఇష్టపడితే వాళ్లలో ప్రతీదీ అబ్బురంగా, ఇష్టంగానే కనిపిస్తుందట. హేమ ఆప్యాయంగా మాట్లాడినా, కోపంతో కసిరినా అమ్మే గుర్తొచ్చేది. రాన్రాను తనంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోతూనే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మనసులో మాట చెప్పేయాలనుకున్నా. ‘సోమవారం నీకో ముఖ్యమైన విషయం చెబుతా. ఫ్రీగా ఉన్నపుడు కాలేజీలో కలువ్‌’ అన్నా. సరేనంది. మండే కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నా. ఇంతలో ఆదివారం పొద్దునే తన నుంచి ఫోన్‌. ‘నేను మీ వూరి సెంటర్‌లో ఉన్నా. ఇక్కడికొచ్చెయ్‌’మంటూ. బైక్‌ తీసుకొని కంగారుగా బయల్దేరా. సెంటర్‌లో ఉన్న తనని బైక్‌పై ఎక్కించుకొని వూరవతలికి తీస్కెళ్తున్నా. ‘జీవితంలో ఇదే మొదటిసారి ఓ అబ్బాయి బైక్‌ ఎక్కడం’ అని హేమ అంటుంటే నా ఛాతీ రెండింతలైంది. ఆపై నా గుండెలోని ప్రేమనంతా మూటగట్టి తనకి ప్రపోజ్‌ చేశా. నన్ను కొరకొరా చూసి ‘నో.. మనం ఒట్టి ఫ్రెండ్సే’ అంది. నా శరీరం కొయ్యబారిపోయింది. కన్నీళ్లు పెల్లుబికాయి. ఓ ఐదునిమిషాలు అలాగే గడిచాక గట్టిగా వూపిరి పీల్చుకొని ‘హే.. జోక్‌ చేశా.. ఐలవ్యూ టూ రా’ అని గుండెలకు హత్తుకుంది. తననలాగే ఎత్తుకొని గిరగిరా తిప్పా.

సాఫీగా సాగిపోతున్న మా ప్రేమాయణంలో ఓ కలత. మా ఇద్దరి మధ్యకి ఓ అమ్మాయి వచ్చింది. హేమకి నాపై అనుమానం మొదలైంది. నేనెంత చెప్పినా వినదే. ముందూవెనకా ఆలోచించకుండా బ్రేకప్‌ అంది. నాతో మాట కలిపితే ఒట్టు. తనవైపు బేలగా చూసేవాణ్ని. తల తిప్పుకునేది. తన కళ్లలో నాపై ఇష్టం తగ్గలేదని అర్థమవుతూనే ఉండేది. అయినా కావాలనే నాపై అయిష్టత ప్రదర్శించేది. ఒకటికాదు రెండు కాదు.. ఇలా దాదాపు ఏడెనిమిది నెలలు గడిచాయి. ఓరోజు ఏమైందో తెలియదు సడెన్‌గా నా ముందు ప్రత్యక్షమైంది. ‘సారీ.. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఇకపై ఎప్పటికీ నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు ఆరాధన నిండిన కళ్లతో చెప్పింది. అప్పుడు నన్ను నేను గిల్లి చూసుకున్నా. అన్నట్టు ఆరోజు మార్చి 28. సరిగ్గా ఏడాది కిందట అదేరోజు నేను తనకి ప్రపోజ్‌ చేసిన రోజు.

మబ్బులు కరిగాయి. మామధ్య అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇంకోసారి ఇలా జరగొద్దు అనుకున్నాం. అమ్మానాన్నలకు నేనంటే ప్రాణం. నాకు హేమంటే ప్రాణం. నా ప్రేమ విషయం వాళ్లకు చెప్పేశా. ఓసారి హేమని ఇంటికి తీస్కెళ్లా. వాళ్లకీ తను బాగా నచ్చింది. ఇప్పుడు వాళ్లింట్లో కూడా మా విషయం చెప్పాలనుకుంటున్నాం. ఓవైపు ఎలా స్పందిస్తారో అనే భయం ఉంది. మరోవైపు మేం అన్నిరకాలుగా స్థిరపడ్డాం.. తప్పకుండా ఒప్పుకుంటారనే నమ్మకమూ ఉంది. అంతా మేం అనుకున్నట్టే జరగాలని కోరుకుంటున్నా. మీరూ ఆశీర్వదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని