ప్రేమను క్యాన్సర్‌ ఏం చేయగలదు?

ప్రేమలో ఉంటే వాట్సప్‌ మెసేజ్‌లకు ఎంత జీబీ ఖర్చవుతుందో లెక్కపెట్టలేం. జీబీల కొద్దీ డేటా కేబీల్లా కరిగిపోతుంటుంది...

Published : 13 Jan 2018 02:26 IST

మనసులో మాట
ప్రేమను క్యాన్సర్‌ ఏం చేయగలదు?

ప్రేమలో ఉంటే వాట్సప్‌ మెసేజ్‌లకు ఎంత జీబీ ఖర్చవుతుందో లెక్కపెట్టలేం. జీబీల కొద్దీ డేటా కేబీల్లా కరిగిపోతుంటుంది. సమయం వీటికి పోటీ పడుతుంటుంది. ఎంత ఖర్చైనా, ఎంత కరిగిపోయినా తియ్యగానే ఉంటుంది ప్రేమ. తేనేలాంటి ప్రేమలో తాను నేను మునిగిపోయే వాళ్లం. కాలేజీలో కలిసిన మేం స్నేహితులమై... ప్రేమికులమై... పెళ్లి చేసుకోబోతున్నామని.. కొందరు సంతోషించే వారు. మరికొందరు ఈర్ష్యపడే వారు. ప్రేమలో ఉండి చదువును నిర్లక్ష్యం చేయలేదు. మంచి ఉద్యోగాలు సంపాదించాం. ఇరువైపుల అమ్మానాన్నలనూ ఒప్పించాం. సెలయేటిలా సాగుతున్న మా జీవితంలో తుపాను రేగింది. 2012 ఫిబ్రవరి 11, సాయంత్రం ఇద్దరం అలా పార్కులో తిరుగుతుంటే ఉన్నట్టుండి వినయ్‌ పడిపోయాడు. ఏం జరిగిందో తెలియలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. అతనికి బోన్‌ క్యాన్సర్‌ అని డాక్టర్లు చెప్పారు. మెదడులో భూకంపం. మా తల్లిదండ్రులు వచ్చారు. బంధువులు చుట్టుముట్టారు. స్నేహితులు తోడుగా నిలిచారు. ఒక కాలు తీసేస్తే ఫలితం ఉండొచ్చన్నారు. సరే అనుకున్నాం. మా నాన్న మొదటి సారి నా ప్రేమ విషయంలో ఆలోచన చేశారు. ‘ఒక సారి ఆలోచించమ్మా... ఇక అతని గురించి మరిచిపో..., నీ జీవితం మాకు ముఖ్యం’ అన్నారు. నేను వినలేదు. ప్రేమ ఆకాశం లాంటిది నాన్న... ఎన్ని భూకంపాలు, ఎన్ని తుపానులు, ఎన్ని ప్రళయాలు వచ్చినా స్థిరంగా ఉంటుందన్నాను కరాఖండిగా. ఆరు నెలలు భారంగా గడిచింది. వినయ్‌ని ఓదార్చాను. క్యాన్సర్‌ రెండో కాలికీ సోకింది. అదీ తీసేశారు. ఈసారి నాన్నతోపాటు బంధువులు, స్నేహితులూ వద్దన్నారు. వినయ్‌ని మరిచిపొమ్మన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు. ‘నేను అతని నడక చూసి ప్రేమించలేదు. నడత చూశాను. అది ఇప్పటికీ అలానే ఉంద’ని గట్టిగా చెప్పాను. ఈసారి వినయ్‌ బాగా కుంగిపోయాడు. ఎవరేమనుకున్నా నేను ఆఫీసులో పని అయిపోయిన వెంటనే వాళ్లింటికి వెళ్లేదాన్ని వినయ్‌కి దగ్గరుండి అన్నీ చూసుకొనేదాన్ని. చాలాసార్లు వినయ్‌ వెళ్లిపొమ్మని ఏడ్చాడు. నన్ను వదిలేయమని చెప్పాడు. కసురుకున్నాడు. కోప్పడ్డాడు... అలా అయినా నేను వెళతానని. నేను వినలేదు. ‘ఏదీ ఏమైనా నేను నిన్ను వదలనని కఠినంగా చెప్పాను. ఎవరేమన్నా నేను నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటాను అంతే’ అన్నాను. రోజులు మౌనంగా గడుస్తున్నాయి. నా ప్రేమ సంకల్పం చేతిలో ఓడిపోవడం... విధికి ఇష్టం లేదు. అందుకే ఈసారి క్యాన్సర్‌ వినయ్‌ని మొత్తం చుట్టేసింది. 2013 ఏప్రిల్‌ 4... నీ శ్వాసలా ఉంటానని చెప్పిన వినయ్‌ మాట నిలబెట్టుకోవడానికి గాలిలో కలిసిపోయాడు. గుండె పగిలిపోయింది. నా జీవితంలో నేను తాగిన నీళ్లకంటే నేను కార్చిన కన్నీళ్లే ఎక్కువయ్యాయి. నాకు నేను ధైర్యం చెప్పుకొన్నా. నా నుంచి వినయ్‌ని దూరం చేయగలదు క్యాన్సర్‌... నా పట్ల అతని ప్రేమను కాదు. నా ప్రేమ శాశ్వతం. అందుకే బతుకుతున్నా..! ప్రేమించిన వారు కాదన్నారని, పెద్దలు వద్దన్నారని, ప్రేమించిన వాళ్లకి పెళ్లైపోయిందని... ప్రాణాలు తీసుకొనే వారందరికీ చెబుతున్నా. బతకండి. మనం బతికితేనే... మన ప్రేమ బతికున్నట్లు.

- సౌజి, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని