అది పాపమే

టెన్త్‌లో ప్రపోజ్‌ చేశావు. నాకు ఎంత భయమేసిందో తెలుసా? నేను ఏడుస్తుంటే.. ఇష్టం లేదాని అడిగావు. నేనేం చెప్పాలి. నాకంతా ఆయోమయం. రెండేళ్లు అవుతున్నా అదే కన్ఫ్యూజన్‌....

Published : 10 Feb 2018 01:35 IST

మనసులో మాట!
అది పాపమే

  టెన్త్‌లో ప్రపోజ్‌ చేశావు. నాకు ఎంత భయమేసిందో తెలుసా? నేను ఏడుస్తుంటే.. ఇష్టం లేదాని అడిగావు. నేనేం చెప్పాలి. నాకంతా ఆయోమయం. రెండేళ్లు అవుతున్నా అదే కన్ఫ్యూజన్‌. నువ్వు మాత్రం నేను ప్రేమిస్తున్నా అని వెంటపడుతున్నావు. నువ్వంటే నాకూ ఇష్టమని కరెక్ట్‌గా చెప్పగలను. కానీ, అది ప్రేమో కాదో నాకు తెలియడం లేదు. అందుకే నువ్వు ఎన్నిసార్లు ప్రేమిస్తున్నా అని చెప్పినా సరే అనలేకపోతున్నా. ఐ టూ అని చెప్పలేకపోతున్నా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించింది లేదు. నో అని చెప్పడానికి ఒక్క కారణం కూడా చూపలేను. కానీ, ఇప్పుడు నేనేం చెప్పలేను. అర్థం చేసుకో. ‘ఓకే’ అని ఒక్కమాట చెప్పమని ఎప్పుడూ అంటుంటావ్‌. నాకున్న మనస్థత్వానికి నేను ఒక్కసారి కమిట్‌ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోలేను. నువ్వే జీవితం అవుతావ్‌. నాకేమో నమ్మకం కలగట్లే. ఒక్కసారి ఆలోచించు. ఇద్దరం ఇంటర్‌ పూర్తి చేస్తున్నాం. ఇంజినీరింగ్‌ చేయాలి. జీవితంలో స్థిరపడాలి. సుమారు ఐదేళ్లయినా పడుతుంది. ఇప్పుడే మనం ప్రేమని అని తొందరపడితే అన్నేళ్లు మన ప్రేమని నిలబెట్టుకోగలమా? నేను నమ్మకంగా లేను. నువ్వు ఉన్నావా? మనకు ఈ వయస్సులో పుట్టేది ఆకర్షణే.. ప్రేమ కాదని నా భావన. నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పక ముందు నీతో మాట్లాడేప్పుడు భలే సరదాగా ఉంటేది. నువ్వు పక్కన ఉంటే భలే సంతోషంగా ఉంటుంది. నీ మాటల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. కానీ, ఇప్పుడు.. మౌనంగా నేనేదో తప్పు చేసినట్టు చూస్తావు. నాకు కష్టంగా ఉంటుంది. నువ్వు కనబడగానే ఏదో తెలియని ఫీలింగ్‌. అది భయం అని చెప్పలేను. ఎందుకంటే నిన్ను చూస్తే ఎప్పుడూ ఏదో తెలియని ఆనందం. ఇప్పుడు ఆనందం పక్కనే ఆందోళన వచ్చి చేరింది. నువ్వూ బాగా చదువుతావ్‌. భవిష్యత్తుపై దృష్టి పెట్టు.. శీను! నేను ఆడపిల్లని. ఇదంతా ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం లేదు. అందుకే ఇలా. నేనున్న ఈ పరిస్థితిలో ప్రేమ నాకు ఆకర్షణలానే అనిపిస్తోంది. నిజంగా నీది ప్రేమే  అయ్యుండొచ్చు. నువ్వు నా కోసం ఎదురుచూస్తావు కూడా. కానీ, భవిష్యత్‌ ఏంటో నేను చెప్పలేను. నీ చేత సంవత్సరాలు ఎదురుచూసేలా చేయడం, ఆ తర్వాత నీకు అందకుండా పోతే అది మహాపాపం. ఆ పాపం నేను చేయలేను. అందుకే... ఇప్పటికీ నేను నీకు మంచి ఫ్రెండ్‌ని. అంతే... అర్థం చేసుకో!!

 - పండు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని