నీ ఫ్రెండ్‌ని ప్రేమించడమే తప్పా!

చెల్లంటే నాకు ఎంత ఇష్టమంటే... స్కూల్‌కి క్యారియర్‌ తేవడం అయిదు నిమిషాలు ఆలస్యమైనా అమ్మపైనా అరిచేస్తాను. నా కోసం కాదు... చెల్లి ఆకలితో ఉండలేదన్న కోపంతో...! ‘‘అబ్బో సరేలేరా ఇంకెప్పుడూ నీ చెల్లికి కష్టం కలగనివ్వను’’ అని చెప్పేదాకా అమ్మను ఏదో ఒకటి అంటూనే ఉంటాను....

Published : 12 May 2018 01:27 IST

మనసులో మాట
నీ ఫ్రెండ్‌ని ప్రేమించడమే తప్పా!
చెల్లీ నాతో మాట్లాడు

చెల్లంటే నాకు ఎంత ఇష్టమంటే... స్కూల్‌కి క్యారియర్‌ తేవడం అయిదు నిమిషాలు ఆలస్యమైనా అమ్మపైనా అరిచేస్తాను. నా కోసం కాదు... చెల్లి ఆకలితో ఉండలేదన్న కోపంతో...! ‘‘అబ్బో సరేలేరా ఇంకెప్పుడూ నీ చెల్లికి కష్టం కలగనివ్వను’’ అని చెప్పేదాకా అమ్మను ఏదో ఒకటి అంటూనే ఉంటాను. అది తొమ్మిదో తరగతి అనుకుంటా... చెల్లికి ఆరోగ్యం బాగాలేక హోంవర్క్‌ చేయలేకపోయింది. స్కూల్‌లో టీచర్‌ కొట్టాడు. లంచ్‌ టైంలో చెల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. నాకు ఒళ్లు మండిపోయింది. నేరుగా వెళ్లి వాళ్ల టీచర్‌తో గొడవేసుకున్నాను. పెద్దగా అరిచేశాను. కారణం తెలుసుకోకుండా ఎలా కొడతారని నిలదీశాను. చెల్లికూడా అంతే నాకేం కావాలన్నా అమ్మను, నాన్నను ఒప్పించేది తనే. తనకిచ్చిన ప్యాకెట్‌ మనీనీ నా కోసం ఎన్నోసార్లు ఇచ్చేసింది. మేమిద్దరం ఉన్నామంటే సరదానే సరదా. అన్నాచెల్లి అంటే ఇలా ఉండాలిరా అనుకునే వారంతా! సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌కు నేను దిల్లీలో ఉంటే అక్కడికి వచ్చింది రాఖీ కట్టడానికి... అప్పుడే తన ఫ్రెండ్‌ నీరజను పరిచయం చేసింది. తనని చూడగానే ఏదో మనసులో గిలిగింత. ఆరోజు రాత్రంతా నిద్రపట్ట లేదు. వెంటనే తన పేరుతో ఫేస్‌బుక్‌ చెక్‌ చేశాను. తన వివరాలు తెలుసుకున్నాను. తనది దిల్లీనే. మన తెలుగువారే. ఇక్కడ వచ్చి సెటిలయ్యారని అర్థమైంది. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాను. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. తెల్లారి 7 గంటలకు లేచాను. తను నా రిక్వెస్ట్‌ ఓకే చేసింది. అలా మా మధ్య స్నేహం.. ఫేస్‌బుక్‌ నుంచి వాట్సప్‌కి... అక్కడి నుంచి ఫోన్‌కీ మారింది. ఈ విషయం నేను మా చెల్లికి చెప్పలేదు. తను ఏమనుకుంటుందోనని వెనుకడగువేశాను. నీరజ మాత్రం ఈ విషయాలన్నీ మా చెల్లికి చెప్పేదని నాకు తెలియదు. ఇలా 6 నెలల తర్వాత ప్రపోజ్‌ చేశాను. తను నిర్మొహమాటంగా తిరస్కరించింది. నేనంటే ఇష్టం లేదని చెప్పేసింది. ఈ విషయం మా చెల్లికీ చెప్పింది. చెల్లి నాకు చాలా సార్లు ఫోన్‌ చేసింది. నేను ఆ బాధలో ఉండి రిసీవ్‌ చేసుకోలేకపోయాను. ‘ఇంకెప్పుడూ నాతో మాట్లాడొద్ద’ని చెల్లి ఫోన్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. దాన్నీ నేను రెండు రోజుల తర్వాత చదివాను. వెంటనే ఫోన్‌ చేశాను. ఎత్తలేదు. మెసేజ్‌ చేశాను. స్పందించలేదు. అమ్మకు ఫోన్‌ చేసి తనకివ్వమని అడిగాను. నాతో మాట్లాడనని చెప్పేసింది. ఏదోలే కొన్ని రోజులనుకున్నాను. మొన్న నేను హైదరాబాద్‌ వెళ్లినా మాట్లాడలేదు. నన్ను చూస్తే దూరంగా వెళ్లిపోతోంది. నేను ఈ గదిలో ఉంటే తను ఆ గదిలో ఉంటోంది. ఎంతగా బతిమాలినా కరగలేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది. తను స్నేహితురాలి పట్ల నేను వ్యవహరించిన తీరు తనని తీవ్రంగా బాధ పెట్టిందని తెలుసుకున్నాను. వెంటనే నీరజకు ఫోన్‌ చేసి క్షమించమని అడిగాను. నా చెల్లికి ఈ విషయం చెప్పమని చెప్పాను. ఇది జరిగి నాలుగు నెలలవుతోంది. ఇంకా చెల్లి నాతో మాట్లాడటం లేదు. నీరజ నా ప్రేమను తిరస్కరించినప్పుడూ నేను ఇంత బాధ పడలేదు. చెల్లి నాతో మాట్లాడకపోతే చచ్చిపోవాలనిపిస్తోంది. చెల్లీ నన్ను క్షమించు... విషయం చెప్పకపోవడం నా మొదటి తప్పు. నీ ఫ్రెండ్‌తో నేను అలా బిహేవ్‌ చేయడం మరింత పెద్ద తప్పు. అందుకు నాకు ఇంత శిక్షా? అసలు చదువుమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. కుడికన్ను ఎడమకన్నును పొడిచేస్తే.. ఇక దిక్కెవరు? తట్టుకోలేకపోతున్నాను. విలవిలలాడిపోతున్నాను. దయచేసి నాతో ముందులా ఉండు చెల్లి. ప్లీజ్‌!

- ఇట్లు నీ అన్న రాజేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని