మళ్లీ పెళ్లి చేసుకుంటే ఏమిటి?

మళ్లీ కనిపిస్తుందనుకోలేదు. ఆ రూపం నా కళ్లలో పరావర్తనం చెంది.. మెదడు పొరల్లో ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాల తుట్టెను కదిపింది. మా ఊరు అనంతపురం. తను రాణి(పేరుమార్చాం). డిగ్రీ మొదటి సంవత్సరం...

Published : 19 May 2018 01:46 IST

మనసులో మాట
మళ్లీ పెళ్లి చేసుకుంటే ఏమిటి?

ళ్లీ కనిపిస్తుందనుకోలేదు. ఆ రూపం నా కళ్లలో పరావర్తనం చెంది.. మెదడు పొరల్లో ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాల తుట్టెను కదిపింది. మా ఊరు అనంతపురం. తను రాణి(పేరుమార్చాం). డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి తరగతికి కాస్త ఆలస్యంగా వచ్చిన అమ్మాయి. అందరి కళ్లతో పాటు నా కళ్లూ తనను గుర్తించాయి. ఏమంత పెద్ద అందగత్తె కాదు. సాధారణ అమ్మాయే. తెలుగు క్లాస్‌కు హాజరయ్యే కొద్దిమందిలో తనూ ఒకరు. నాకు కవితలు రాయాలని ఇష్టం ఉండటంతో నేనూ వచ్చేవాణ్ని. తన ఒద్దిక తనం, మాటతీరు నచ్చాయి. ఒకసారి నా ఫ్రెండ్‌ నేను బైక్‌మీద వెళ్తూ పడిపోయాం. ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ఆసుపత్రికి వెళ్తే కట్టుకట్టారు. బిల్లు రూ.2వేలైంది. మా దగ్గర రూ.500 ఉంది. ఆ ఆసుపత్రికి తన ఇల్లు దగ్గరే... వెంటనే తనకు ఫోన్‌ చేశాను. హాస్పిటల్‌కు వచ్చి బిల్లు కట్టింది. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా వాళ్లింటికి తీసుకెళ్లింది. అప్పుడు మాపై చూపిన అభిమానం ఇప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి తను ఎంతో అందంగా కన్పించడం మొదలైంది. తనని చూడాలని, మాట్లాడాలని ప్రయత్నించేవాడిని. పుస్తకంలోని అక్షరాల్లో రా.. ణి... ఎక్కడున్నాయో పెన్నుతో రౌండ్‌ చేసేవాణ్ని. డిగ్రీ ఫైనలియర్లో నా మనసులో మాట తనతో చెప్పాను. సారీ చెప్పింది. ‘‘నేను నిన్ను ఎప్పుడూ అలా ఊహించలేదు. ఈ పరీక్షలు అయిపోయిన వెంటనే నాకు మా బావతో పెళ్లి నిశ్చయించారు. దయచేసి పిచ్చిపిచ్చి ఆలోచనలు మాని, బాగా చదువుకో’’ అంది. ఇక అంతే తనకు ముఖం చూపించ లేకపోయాను. పరీక్షలు ముగిశాయి. చివరి రోజు నాతో మాట్లాడటానికి ప్రయత్నించింది. నేను కలవలేదు.
మళ్లీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 2017 అక్టోబర్‌ 3 వతేదీ హైదరాబాద్‌లో కన్పించింది. తనతో మాట్లాడాలనిపించింది. పలకరించాను. తను ఎంతో సంతోషంగా ‘హలో రమేశ్‌’ అంటూ చేయి కలిపింది. నేను తన ముఖాన్నే చూస్తూ ఉండిపోయాను. తన భర్త పెళ్లైన మూడేళ్లకే ప్రమాదంలో చనిపోయారని, తనకు ఒక పాప అని చెప్పింది. ఇక్కడే ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తున్నాని, బాగున్నానని చెప్పింది. ‘‘ఎన్నేళ్లైంది. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? పెళ్లి కబుర్లేంటి..’’ గలగలా ప్రశ్నలు వేసింది. ‘నేనూ ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. పెళ్లి చేసుకోలేదు. రాణి ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాను. తను అక్కడి నుంచి బయలుదేరింది. వెంట పడ్డాను. బతిమాలాను తన ఇంటికి వెళ్లాను. ఫోన్‌ చేశాను. మెసేజ్‌లు పెట్టాను. స్పందన లేదు. ‘అది తప్ప వేరే విషయాలు మాట్లాడు’ అంటుంది. ‘అది తప్ప వేరే విషయం నాకు అక్కర్లేదు’ అంటాను. ‘నాకు ఒక కూతురుంది. సమాజం ఏమనుకుంటుంది? మీ అమ్మా నాన్నలు ఏమనుకుంటారు? మా ఇంట్లో అంగీకరించరు.’ అంటుంది. ఇప్పుటికి 8 నెలల నుంచి బతిమాలుతున్నాను. తనలో ఏ మార్పు లేదు. ‘‘రాణీ ప్లీజ్‌ నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. సమాజం, ఇల్లు అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. దయచేసి ఒప్పుకో.’’

- నీ రమేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని