అత్తతో పెళ్లికి అనర్హుడినా?

నేను, ఒకబ్బాయి ప్రేమించుకుంటున్నాం. వరుసకు అత్తాఅల్లుళ్లం. ఈమధ్యే మాలాంటి బంధుత్వంతో ఓ జంట పెళ్లి చేసుకున్నారు. అది చూశాక ధైర్యం చేసి మా ప్రేమ విషయం పెద్దలకి చెప్పాం...

Published : 14 Jan 2016 15:48 IST

 అత్తతో పెళ్లికి అనర్హుడినా?


 నేను, ఒకబ్బాయి ప్రేమించుకుంటున్నాం. వరుసకు అత్తాఅల్లుళ్లం. ఈమధ్యే మాలాంటి బంధుత్వంతో ఓ జంట పెళ్లి చేసుకున్నారు. అది చూశాక ధైర్యం చేసి మా ప్రేమ విషయం పెద్దలకి చెప్పాం. ఉద్యోగంలో స్థిరపడ్డాక చూద్దామన్నారు. అన్నట్టే చదువైపోగానే ఇద్దరం మంచి ఉద్యోగాలు సంపాదించాం. ఇప్పుడేమో ‘తను వరుసకు అల్లుడవుతాడు కదా మేం ఒప్పుకోం’ అంటున్నారు. వాళ్లు మొండిపట్టు వీడకపోతే మేం జీవితాంతం పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాం. అలాగైనా వాళ్లకి కనువిప్పు కలగాలి. మీరేమంటారు?

- ఓ పాఠకురాలు, హైదరాబాద్‌

మీ తల్లిదండ్రులు మీ పెళ్లికి అభ్యంతరం తెలపడంలో అర్థం లేదు. బంధువును ప్రేమించడం సమాజ పద్ధతులను చులక½న చేసినట్టేం కాదు. నిజమే, సంఘ విలువల్ని పాటించడమూ ముఖ్యమే. కానీ సైన్స్‌ పరిశోధనలు ఈ విలువలు నిజమని నిరూపిస్తేనే సంఘ జీవనంలో ఉండిపోతాయి. నిజం కాదంటే మరుగున పడిపోతాయి. మేనరిక వివాహాలే అందుకు ఉదాహరణ. పాతకాలంలో ఈ పెళ్లిళ్లకు పెద్దపీట వేసేవాళ్లు. మరదలికి సంబంధం వెదికితే ఎందుకు మేనబావకిచ్చి చేయడం లేదని ప్రశ్నించేవారు. సైన్స్‌ పరిశోధనల్లో మేనరిక వివాహాలతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువనీ, పుట్టబోయే పిల్లల్లో అనేక అవకతవకలు రావచ్చని తేలింది. అప్పటినుంచి మేనరిక వివాహాలు తగ్గుతూ వస్తున్నాయి. దూరపు వరుస అల్లుడిని పెళ్లాడటం సరికాదని, ఆరోగ్య సమస్యలు వస్తాయని సైన్స్‌ ఎక్కడా రుజువు చేయలేదు. అలాగే విలువలను చిన్నచూపు చూడకపోయినా వాటి కోసం మన జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం లేదంటాడు కోల్‌మ్యాన్‌ అనే సైకాలజిస్ట్‌. పైగా మీ బంధుత్వం బీరకాయ పీచులాంటిది. ఒక స్పానిష్‌ మహాశయుడి ఉద్దేశంలో విలువలంటే కేవలం సరైన ప్రవర్తనతో, సరైన దిశలో పయనిస్తూ, సరైన కోరికలను సంతృప్తి పరుచుకోవడమే తప్ప మరొకటి కాదు. ఈ విషయాలు గమనిస్తే మీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పడం సవ్యం కాదు. ఒకవేళ ఈ బంధుత్వం సమస్య కాకుండా వాళ్లు కాదనడానికి వేరే కారణం ఉందేమో! రెండు కుటుంబాల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయేమో. ఒకవేళ ఉన్నా మీ పెళ్లితో ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికినట్టే. ప్రఖ్యాత సైంటిస్ట్‌ ఐజాక్‌ న్యూటన్‌ మనుషులు తన చుట్టూ తాను అడ్డుగోడలు కట్టుకోవడం కాదు ఇతరుల మనసులు గెలవడానికి వంతెనలు నిర్మించాలి అంటాడు. మీ అమ్మానాన్నలు ఇవి గమనించి మీ కోరిక మన్నించాలని కోరుకుందాం. మీ స్నేహితుల పెళ్లిలాగే మీ వివాహం ఘనంగా చేస్తారని ఆశిద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని