Andhra news: 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 04:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పాలనకు సాంకేతికత జోడింపు
డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఆర్టీజీఎస్‌ కేంద్రం నమూనా

మొంథా తుపాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి.. ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతికత కీలకంగా మారింది. భారీ విపత్తులోనూ ప్రాణనష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్‌ సాంకేతికత ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఈనాడు, అమరావతి: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకే నమూనాలో పనిచేసే 13 ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. రాజధానిలోని ప్రధాన కేంద్రానికి వాటిని అనుసంధానం చేయనుంది. వాటి ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించి, అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అక్కడి ఆర్టీజీఎస్‌ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. జిల్లాల్లో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనుంది.

రాజధానిలో ఆధునిక హంగులతో కేంద్రం

రాష్ట్ర ఆర్టీజీఎస్‌ కేంద్రాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సచివాలయం దగ్గర మల్టీపర్పస్‌ భవనాన్ని నిర్మిస్తోంది. ఆర్టీజీఎస్‌ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 750 సేవలను అందిస్తోంది. అవేర్‌ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో శాటిలైట్‌ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖల సమాచారం ఒకేచోట ఉండేలా డేటా లేక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆర్టీజీఎస్‌ కేంద్రం అవుతుంది.

రాష్ట్రస్థాయి భవనాల్లో ప్రత్యేకతలు ఇవీ

  • రాష్ట్రస్థాయి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
  • 264 మంది ఆపరేటర్లు పనిచేసేలా వర్క్‌స్టేషన్‌ టేబుళ్లు
  • 338 మందితో సమావేశం నిర్వహించేలా పెద్ద సమావేశ మందిరం
  • 14 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌
  • సీఎం, ఆర్టీజీఎస్‌ డైరెక్టర్‌ కార్యాలయాలు

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించింది. వైకాపా ప్రభుత్వం పనులను పక్కన పెట్టేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ఏడాది ఆఖరుకు రాష్ట్రస్థాయి కేంద్రంతో పాటు.. 13 జిల్లా ప్రాజెక్టులనూ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్‌సీసీ-మ్యాట్రిక్స్‌ ప్రాజెక్టు అమలు బాధ్యతలు నిర్వహిస్తోంది. థర్డ్‌పార్టీ ఆడిట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(పీఎంసీ)గా కాలేజ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహరిస్తోంది. 

జిల్లా ఆర్టీజీఎస్‌ కేంద్రాల్లో ఇలా.. 

  • ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
  • జిల్లా రియల్‌టైమ్‌ గవర్నెన్స్, సీసీటీవీ డేటా సెంటర్‌
  • ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ జిల్లాస్థాయి నెట్‌వర్క్‌ సెంటర్‌
  • కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు