Andhra News: 5.44 లక్షలమంది అన్నదాతలకు ‘సుఖీభవ’

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 28 Oct 2025 06:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వెబ్‌ల్యాండ్‌లోని ఆధార్‌ సీడింగ్‌లో తప్పుల దిద్దుబాటు  
రూ.2.72 కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం
ఈనాడు - అమరావతి 

వెబ్‌ల్యాండ్‌లో గతంలో పట్టాదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్‌ నంబర్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేయాల్సిన రూ.2.72 కోట్లకు మినహాయింపు ఇచ్చింది. తద్వారా వీరందరికి ‘అన్నదాతా సుఖీభవ’ ప్రయోజనాలు అందనున్నాయి. రాష్ట్రంలో 5.44 లక్షల మంది అర్హులైన రైతులు తొలివిడతలో ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. సర్వే నంబరు, విస్తీర్ణం, ఇతర వివరాలన్నీ సరిగానే ఉన్నా వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ నంబర్లు తప్పుగా నమోదు కావడమే దీనికి కారణం. కొందరికి రైతు పేరు, తండ్రి పేర్లలో అక్షర దోషాలున్నాయి. పాత సర్వే నంబర్లే కాకుండా.. రీసర్వే తర్వాత నమోదైన ఎల్‌పీఎం నంబర్లకు కూడా ఆధార్, మొబైల్‌ నంబర్లు, పేర్లు తప్పుగా నమోదయ్యాయి.

ఇలాంటి రైతుల జాబితా వ్యవసాయశాఖ నుంచి రెవెన్యూ శాఖకు చేరినా కొన్ని నెలలుగా పరిష్కారం కావడం లేదు. తహసీల్దారు లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటే మొబైల్‌ నంబర్, ఆధార్‌ సీడింగ్‌ కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సమస్య పరిష్కారంలో భాగంగా ఈ ఛార్జి వసూలు చేయకుండానే సర్వే నంబరు/ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)తో పట్టాదారు ఆధార్‌ నంబర్లు మ్యాపింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నదాతా సుఖీభవ పథకానికి వ్యవసాయశాఖ పరిశీలించిన 5.44 లక్షల మంది రైతులకు దీన్ని వర్తింపజేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు.  

అన్నదాతల సమస్యలివి 

  • ఆధార్‌ తప్పుగా లింక్‌ చేయడం 
  • ఒకే ఆధార్‌ నంబరు పలువురు పట్టాదారుల పేర్లతో నమోదు చేయడం 
  • పట్టాదారులకు ఆధార్‌ లింక్‌ చేయకపోవడం 

జిల్లాల వారీగా తహసీల్దారు లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న రికార్డులు 

శ్రీకాకుళం 76,060, విజయనగరం 74,155, తిరుపతి 58,557, ప్రకాశం 42,578, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 38,448, అన్నమయ్య 25,313, అనకాపల్లి 23,163, బాపట్ల 20,849, కృష్ణా 17,175, చిత్తూరు 16,608, పల్నాడు 16,268, కాకినాడ 15,955, వైఎస్సార్‌ కడప 15,438, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు 14,482, నంద్యాల 14,477, ఏలూరు 13,397, అల్లూరి సీతారామరాజు 11,519, ఎన్టీఆర్‌ 9,879, గుంటూరు 7,454, పార్వతీపురం మన్యం 7,000, శ్రీసత్యసాయి 6,274, అనంతపురం 4,278, కర్నూలు 4,189, తూర్పుగోదావరి 3989, పశ్చిమగోదావరి 3,630, విశాఖపట్నం 3,188.

Tags :
Published : 28 Oct 2025 03:26 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు