తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 03 Nov 2025 05:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జానమద్ది సాహితీపీఠం రూపొందించిన సీడీని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు, జస్టిస్‌ వెంకట జ్మోతిర్మయి ప్రతాప. చిత్రంలో ఎస్‌బీఐ డీజీఎం హేమ, అవధాని మేడసాని మోహన్, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్, రేవూరి అనంత పద్మనాభరావు, సంగీత దర్శకుడు బాబు ప్రసాద్, యలమర్తి మధుసూదన, యోగివేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్, జానమద్ది విజయభాస్కర్, చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, అంకేగౌడ

ఈనాడు, కడప: తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కడప పర్యటనలో భాగంగా ఆదివారం సీపీ బ్రౌన్‌ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాపతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో బ్రౌన్‌ గ్రంథాలయంలో నిర్వహించిన హనుమచ్ఛాస్త్రి శత జయంత్యుత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విదేశీయుడైన సీపీ బ్రౌన్‌ రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషకు చేసిన కృషిని కొనియాడారు. ప్రతి ఊళ్లో ఒక దేవాలయం, విద్యాలయం, సేవాలయం, గ్రంథాలయం నెలకొల్పేలా సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మాతృభాషలో పరిపాలన ఉత్తర్వులు సాగాలని, న్యాయమూర్తులు తీర్పులను తెలుగులోనే ఇవ్వాలని సూచించారు.

సామాజిక మాధ్యమాలు, సాంకేతిక విద్య స్వదేశీ భాషలోనే అందించాలంటూ.. ఈ కోణంలోనూ ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వివరించారు. బ్రౌన్‌ గ్రంథాలయ అభివృద్ధికి తన కుమార్తె నిర్వహించే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీపీ బ్రౌన్‌ స్మారక గ్రంథాలయంలో 50 వేలకు పైగా పుస్తకాలతో పాటు 200 తాళపత్ర గ్రంథాలను సేకరించి శుద్ధి చేసి.. వాటిని స్కాన్‌ చేసి భద్రపర్చడం అభినందనీయమన్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మాట్లాడుతూ యువతరం, తెలుగు భాషా ప్రేమికులు సీపీ బ్రౌన్‌ గ్రంథాలయాన్ని సందర్శించాలని సూచించారు.

హనుమచ్ఛాస్త్రి శతజయంతి సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాని మేడసాని మోహన్, గ్రంథాల సంరక్షకులు ఎం.అంకేగౌడ, సాహితీవేత్త రేవూరు అనంత పద్మనాభరావుకు పురస్కారాలు ప్రదానం చేశారు. జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్‌ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్‌ సేవలను అతిథులు ప్రశంసించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో పుస్తకాలను పరిశీలిస్తున్న వెంకయ్యనాయుడు 

Tags :
Published : 03 Nov 2025 04:32 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని