ASHA: నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సమ్మె విరమణ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఎన్టీఆర్‌ వైద్యసేవలు పునఃప్రారంభిస్తామని ‘ఆశా’ ప్రకటన

ఆశా ప్రతినిధులతో చర్చిస్తున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఈనాడు, అమరావతి: అక్టోబరు 10 నుంచి చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు పునరుద్ధరిస్తామని శుక్రవారం తెలిపింది. బకాయిలన్నీ వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు అంగీకరించాయి. గురువారం ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు సీఈఓ ఇతర అధికారులతో సమావేశమైన ఆశా ప్రతినిధులు.. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకెళ్లామని, బ్యాంకుల రుణాలతో బకాయిలన్నీ ఒకేసారి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమ్మె ప్రారంభించాక ప్రభుత్వం రెండు విడతలుగా రూ.488 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరో రూ.250 కోట్లు చెల్లిస్తుందన్నారు. పెండింగు బిల్లుల పరిశీలనలో జాప్యం లేకుండా 50 మంది వైద్యులను నియమిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆశా ప్రతినిధులు పేర్కొన్నారు. 

‘‘మా అనుమానాలు మంత్రి నివృత్తి చేశారు. ప్రభుత్వం స్పందించిన తీరు సంతృప్తినివ్వడంతో సమ్మె విరమించాం. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తాం. యూనివర్సల్‌ ఆరోగ్య బీమా అమలుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు బిడ్డింగ్‌ ప్రక్రియలో మమ్మల్నీ భాగస్వాములను చేస్తామన్నారు. ఆరోగ్య బీమా అమలుతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు’’ అని ఆశా అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు