Weight Loss: జుంబారే.. బరువు తగ్గారే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 19:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బోరింగ్‌ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా..? బిజీలైఫ్, బద్ధకంతో.. వ్యాయామం చేయలేకపోతున్నారా..? అయితే.. మ్యూజిక్‌ వింటూ  ఓ స్టెప్పెయ్యండి.. సాంగ్స్‌  పెట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్‌ చేయండి. అటు ఆనందం, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసే ఈ విధానమే జుంబా!

  • లావణ్య గృహిణి. ఇంట్లోనే ఖాళీగా ఉండటం, టీవీ చూస్తూ మోతాదుకు మించి తినడం ద్వారా అధికంగా బరువు పెరిగి అనారోగ్యానికి గురైంది. వైద్యులు బరువు    తగ్గాలని సూచించారు. జుంబా సెంటర్‌లో చేరింది. ప్రత్యేకంగా  ఓ ట్రైనర్‌ను కూడా పెట్టుకుని మోతాదులో ఆహారం తీసుకుని వర్కవుట్లు చేయడం మొదలెట్టింది. ఎనిమిది నెలల్లో ఆరు కేజీల వరకు బరువు తగ్గింది. 

రోజూ జిమ్‌కు వెళ్లడం, వాకింగ్‌ చేయడాన్ని బోరింగ్‌గా ఫీలయ్యే వారెందరో. ఇలాంటివారు ఫన్‌గా.. ఫిట్‌గా మారేందుకు జుంబా సెంటర్లు మంచి వేదికలుగా మారుతున్నాయి. 12 ఏళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడీ, అధిక బరువు, తదితర ఇబ్బందులతో బాధపడే మహిళలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళలకే ప్రత్యేకమైన జుంబా సెంటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మహిళలు అధికంగా ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఫన్‌తో ఫిట్‌నెస్‌..

జుంబాలో ఫాస్ట్, స్లో డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవ కండరాన్ని ఈ వ్యాయామం కదిలిస్తుంది. కండరాలను పటిష్ఠం చేస్తుంది. రోజూ ఈ వ్యాయామం చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి, నిస్సత్తువ దూరమవుతుంది. ఈ డ్యాన్స్‌ సక్రమంగా చేయించేందుకు ఓ సర్టిఫైడ్‌ మహిళా ట్రైనర్‌ కూడా ఉంటారు. శరీరమంతా కదిలేలా,  విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ వ్యాయామం చేయిస్తారు. శరీరంలో ఎక్కడ అధిక మోతాదులో కొవ్వు ఉన్నా.. బాల్‌ వర్కవుట్‌ (కండరాల బలోపేతం), స్టెప్పర్‌ (తొడల బలోపేతం), కోర్‌ స్ట్రెంగ్త్‌ వంటి వ్యాయామాలు చేయిస్తారు. 


ప్రత్యేకంగా డైట్‌ ఛార్ట్‌

  • అరగంటపాటు జుంబా డ్యాన్స్‌ చేస్తే క్యాలరీలు కరుగుతాయి.  
  • వీటికి సరిపడా క్యాలరీలు  దొరికే డైట్‌ ఛార్ట్‌ను సెంటర్‌లోని న్యూట్రిషనిస్ట్‌ సూచిస్తారు. జుంబా చేసే సమయంలో కాస్త నీరసానికి గురయినా.. బీట్‌రూట్, క్యారెట్, కీరాతో చేసిన డ్రింక్‌లను తక్షణ శక్తి కింద ఇస్తారు. శరీర సామర్థ్యాన్ని బట్టి మిల్లెట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, బ్రౌన్‌ రైస్, సీడ్స్‌ వంటి ఆహారాన్నీ సూచిస్తారు. 
  • సెంటర్లలో సర్టిఫైడ్‌ న్యూట్రిషనిస్ట్‌ ఉంటారు. వారే డైట్‌ను సూచిస్తారు. కొన్ని సెంటర్లు ప్రత్యేక ఛార్జీలు తీసుకుని డైట్‌ అందిస్తున్నాయి.  

ఇవీ ప్రయోజనాలు..

  • జుంబా డ్యాన్స్‌తో శ్రమ పడినట్లు  తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది. 
  • శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజూగ్గా తయారవుతారు.
  • శరీరం దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. 
  • కండరాలు పటిష్ఠంగా తయారవుతాయి.
  • ఈ డ్యాన్స్‌తో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.   
  • పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గొచ్చు. 
  • మహిళలు థైరాయిడ్, పీసీఓడీ నుంచి బయటపడొచ్చు.

ఆహారనియంత్రణపై అవగాహన అవసరం..
- పి.దర్పిత, డైటీషియన్, ఎన్టీఆర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ (అనకాపల్లి)

జుంబా డ్యాన్స్‌ గుండె కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజుకు ఒక గంట జుంబా చేస్తే.. 300 నుంచి 600 క్యాలరీలను కరిగించవచ్చు. ఏరోబిక్స్‌ కంటే.. జుంబా ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్‌ అవుతాయి. సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందేలా చూసుకోవాలి. జుంబా చేసిన తర్వాత కూల్‌ డ్రింక్స్, మద్యం, హోం స్ట్రింగ్స్, జంక్‌ ఫుడ్‌ తీసుకోకూడదు. ఆహార నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో జుంబా చేయాలి.


-ఈనాడు డిజిటల్, అనకాపల్లి

Tags :
Published : 31 Oct 2025 19:23 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని