Fake reviews: 5స్టార్‌ అయినా.. పై పై మెరుగులే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 19:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

నకిలీ రివ్యూలతో నష్టాలపాలు

మనీశ్‌ ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ సైట్‌లో ట్రిమ్మర్‌ కొనుగోలు చేశారు. చాలా కంపెనీల ట్రిమ్మర్ల రేటింగ్‌లు, రివ్యూలు పరిశీలించాకే దాన్ని ఎంపిక చేశారు. తీరా డెలివరీ అయ్యాక దాని పనితీరు పేలవంగా ఉంది.

మీరు ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాపో, మొబైల్‌ ఫోనో కొనాలనుకున్నారు. లేకపోతే ఓ హోటల్‌లో రూం బుక్‌ చేయాలనుకున్నారు. నగరంలో మంచి రెస్టారెంట్‌ ఏదో తెలుసుకోవాలనుకున్నారు. వెంటనే ఏం చేస్తారు? ఆన్‌లైన్‌లోకి వెళ్లి వెబ్‌సైట్‌లోనో, సంబంధిత యాప్‌లోనో దాని గురించి అన్వేషిస్తారు. రేటింగ్‌లు, రివ్యూలు వెతుకుతారు. దేనికి, ఎవరు, ఎన్ని మంచి రివ్యూలు రాశారో, ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారో తెలుసుకుంటారు. ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కనిపిస్తే.. ఆ ఉత్పత్తి మీద నమ్మకం కుదిరాక బుక్‌ చేస్తారు. తీరా డెలివరీ అయ్యాక నిరాశ మిగిలిందనుకోండి... దీనికి కారణం ఫేక్‌ రివ్యూలు, రేటింగ్‌లేనని అంటున్నారు నిపుణులు. నిర్ణయాలపై ప్రభావం..

  • వర్చువల్‌గా సాగే ఆన్‌లైన్‌ వ్యాపారంలో వినియోగదారులు వస్తువుల్ని ప్రత్యక్షంగా చూసి, తెలుసుకొనే అవకాశం లేదు. 
  • చాలామంది వెబ్‌సైట్లు, యాప్‌లలో  ఆయా ఉత్పత్తుల గురించి పోస్టు చేస్తున్న రివ్యూలు, అభిప్రాయాలు చదివి... గతంలో వాటిని వాడిన వినియోగదారుల అనుభవాలపై ఆధారపడి కొనుగోలు చేస్తున్నారు. 
  • ఎక్కువ మంది వినియోగదారులను ఈ రివ్యూలు, రేటింగ్‌లే ప్రభావితం చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి 
  • దీంతో కొన్ని కంపెనీలు,  ఈ-కామర్స్‌ సైట్లు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసుకోవడానికి తప్పుడు రివ్యూలు రాయిస్తున్నాయి. స్టార్‌ రేటింగ్‌లు వచ్చేలా చేసుకుంటున్నాయి.

రివ్యూకు ఇంత...

  • ఈ రివ్యూలు రాయడానికి, రేటింగ్‌ ఇవ్వడానికి కొంతమందిని నియమించుకుంటున్నారు. 
  • ఒక్కో రివ్యూకు ఇంత మొత్తం అని కమీషన్‌గా ఇస్తున్నారు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి వారితో పని చేయించుకుంటున్నారు. 
  • ఇందుకోసం కొన్ని ప్రైవేటు ఫేస్‌బుక్‌ ఖాతాలు, వాట్సప్, టెలిగ్రామ్‌ సహా సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు నడుపుతున్నారు. 
  • వర్క్‌ ఫ్రం హోం, పార్ట్‌ టైం వర్క్‌ కావడంతో చాలామంది ఆయా గ్రూపుల్లో చేరుతున్నారు.
  • ఇటీవల విశాఖపట్నంలో హోటల్‌ రివ్యూల పేరుతో ఓ సైబర్‌ క్రైం బయటపడింది.

నివేదికలేం చెబుతున్నాయి...

  • స్టార్‌ రేటింగులు, రివ్యూల్లో నకిలీవే ఎక్కువ ఉంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తేల్చింది 
  • ఓ సర్వే ప్రకారం.. ప్రపంచంలోని ప్రముఖ ఈ కామర్స్‌ సైట్లలో ఉన్నవాటిలో సుమారు 4 శాతం ఫేక్‌ రివ్యూలేనని తేలింది 
  • యూరోపియన్‌ కమిషన్‌ వివరాల ప్రకారం బ్రిటన్‌లో పరిశీలించిన 223 ఈ-కామర్స్‌ సైట్లలో సగం కంటే ఎక్కువ వినియోగదారులకు నిజాయతీతో కూడిన సమాచారం లభించడం లేదు.
  • బ్రిటన్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రివ్యూలతో ప్రభావితమవుతూ.. అక్కడ ఏటా ఒక్కో కుటుంబం రూ.90 వేల మేర నష్టపోతోంది 
  • మన దేశంలో కూడా ఇలాంటి ఉదంతాలు పెరుగుతున్నాయి. రివ్యూలపై ఆధారపడి కొనుగోలు చేసి మోసపోతున్నారు.
  • ఇలాంటి రివ్యూలు ప్రచురించడం అంటే 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే 
  • వీటి నియంత్రణకు త్వరలో ఓ ప్రత్యేక వ్యవస్థ తేనున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది.

కట్టడికి సిద్ధం...

  • ప్రజల్లో తమ విశ్వసనీయత పెంచుకోవడానికి కొన్ని ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్లు ఈ ఫేక్‌ రివ్యూల కట్టడికి సన్నద్ధమయ్యాయి 
  • 2024లో సుమారు 27.50 కోట్లు, 2022లో 20 కోట్ల తప్పుడు రివ్యూల్ని అమెజాన్‌ తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ, కొంతమంది నిపుణుల ద్వారా ఈ పనిచేస్తోంది 
  • ప్రముఖ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ‘ట్రిప్‌ అడ్వయిజర్‌’ 2024లో 27 లక్షలు, 2023లో 20 లక్షల తప్పుడు రివ్యూల్ని ఫ్రాడ్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ ద్వారా తొలగించినట్లు పేర్కొంది. 

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని