సంక్షిప్త వార్తలు (12)

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Oct 2025 04:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

దెబ్బతిన్న రహదారుల్నివెంటనే పునరుద్ధరించండి
అధికారులకు చంద్రబాబు ఆదేశం 

ఈనాడు, అమరావతి: మొంథా తుపానుతో దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా, రహదారుల్ని తక్షణం పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీలను పటిష్ఠపరచాలని, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరిగేలా చూడాలన్నారు. బుధవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు.. తాజా పరిస్థితిపై ఆర్టీజీఎస్‌ ద్వారా సమీక్షించారు. సహాయక చర్యల తీరు తెన్నులు, నష్ట తీవ్రతను గణాంకాలతో అధికారులు ఆయనకు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.


1న లండన్‌కు సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు వచ్చే నెల 1న లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో నవంబర్‌ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేందుకు లండన్‌కు వెళుతున్నారు. పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు. 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.


నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి: ఏపీ రైతు సంఘం

ఈనాడు, అమరావతి: మొంథా తుపాన్‌ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ‘‘లక్ష హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, వైఎస్సార్‌ కడప, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. వరి, అరటి, కొబ్బరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్‌ చేశారు.


జగన్‌ ఫోన్‌ నంబరుపై సీబీఐ పిటిషన్‌ కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో నిందితుడైన ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి యూరప్‌ పర్యటనకు వెళ్లినప్పుడు సీబీఐకి సొంత ఫోన్‌ నంబరు ఇవ్వకపోవడంపై ఆ సంస్థ దాఖలు చేసిన మెమోను హైదరాబాద్‌ సీబీఐ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ నంబరులో నిందితుడు అందుబాటులోకి రాకపోతే తగిన చర్యలు తీసుకోవచ్చంది. ఇక్కడ ఆయన పేరుతో నంబరు లేదన్నది సరైన కారణం కాదంటూ న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేశారు.


రూ.3 వేల చొప్పున సాయం

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావం దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నట్లయితే రూ.1,000 ఇవ్వాలని చెప్పింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ మొత్తాన్ని అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


వేడి, క్లోరినేటెడ్‌ నీటినే తాగండి

విపత్తుల నిర్వహణ సంస్థ సూచన

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వేడి చేసిన/క్లోరినేటెడ్‌ నీటిని మాత్రమే తాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. ‘విరిగిన విద్యుత్తు స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు. దెబ్బతిన్న విద్యుత్తు పరికరాలు, వస్తువుల్ని వాడే ముందు వాటిని ఎలక్ట్రిషియన్‌తో తనిఖీ చేయించాలి’ అని పేర్కొన్నారు.


విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

ఈనాడు, అమరావతి: ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపేసిన ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు తనిఖీ చేసి అవకాశం ఉన్న చోట్ల సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై డిస్కంల సీఎండీలు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. సరఫరా పునరుద్ధరించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు. 

మంత్రి లోకేశ్‌ ఆరా

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మంత్రి లోకేశ్‌ సూచించారు. మంత్రి గొట్టిపాటికి ఫోన్‌ చేసి సమస్యలపై ఆరా తీశారు. 


రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్‌ జయంతి  

ఈనాడు, అమరావతి: తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన సీపీ బ్రౌన్‌ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా నవంబర్‌ 10న బ్రౌన్‌ జయంతిని నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రూ.10 కోట్ల మంజూరు

ఈనాడు, అమరావతి: పుట్టపర్తిలో వచ్చే నెల 23న నిర్వహించే సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్న ఈ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున తగు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ ఇందుకోసం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


సూక్ష్మసేద్యం అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ

ఈనాడు, అమరావతి: సూక్ష్మసేద్యం అమల్లో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ మైక్రో ఇరిగేషన్‌ సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్‌ బాడీ ఛైర్మన్‌గా సీఎస్‌/వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఉద్యానశాఖ డైరెక్టర్‌ వ్యవహరిస్తారని పేర్కొంది. 


చిక్కుకోలేదు.. చేజిక్కించుకునేందుకు వచ్చారు! 

ఈ చిత్రం చూస్తుంటే ఏ ఊరి వారో వరద నీటిలో చిక్కుకుని, తాడు సాయంతో ఒడ్డుకు చేరుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే, ఈ విషయంలో మీరు పొరపాటుపడినట్లే. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని గొడిపాలెం వద్ద పాలగెడ్డ జలాశయం రెండ్రోజులుగా పొంగి ప్రవహిస్తోంది. చేపల పెంపకానికి ఇక్కడి జలాశయం వద్ద గతంలో ఏర్పాటు చేసిన వలలను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు తొలగించారు. దీంతో జలాశయం వద్ద చేపలు పట్టేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలిరావడంతో బుధవారం ఇలా సందడి నెలకొంది.

న్యూస్‌టుడే, డెంకాడ


అతి పెద్ద చెరువు.. అలుగు పారింది

ఆసియాలోనే రెండో అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు తుపాను ధాటికి బుధవారం నిండిపోయి అలుగు పారిందిలా! 

Tags :
Published : 30 Oct 2025 03:48 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు