వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తిరుమల కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్టు
సామర్థ్యం లేని డెయిరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు  

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే- తిరుపతి (నేరవిభాగం): వైకాపా రాజ్యసభ సభ్యుడు, తితిదే మాజీ ఛైర్మన్, జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బుధవారం రాత్రి అరెస్టు చేసింది. వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఇదే తొలి రాజకీయ సంబంధిత అరెస్ట్‌. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసేవరకు ఆయన పీఏగా కొనసాగారు. దిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు.. జగన్‌ పాలనలో దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రొటోకాల్‌ ఓఎస్డీగానూ అప్పన్న బాధ్యతలు నిర్వహించారు.  

సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడే ఉత్తరాఖండ్‌ కేంద్రంగా ఉన్న భోలేబాబా డెయిరీ తితిదేకు నెయ్యి సరఫరా చేసింది. నెయ్యి నాణ్యత సరిగా లేదని కొంతకాలానికి గుర్తించి ఆ సంస్థను తితిదే బ్లాక్‌లిస్టులో పెట్టింది. అయినా కూడా భోలేబాబా డైరెక్టర్లు ఏదో ఒక డెయిరీని ముందుపెట్టి తిరుమలకు నెయ్యి సరఫరా చేసేవారు. అప్పటి తితిదే పెద్దలకు ఇదంతా తెలిసినా కమీషన్లు అందుతున్నందున మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. వైకాపా హయాంలో చివరగా తమిళనాడులోని ఏఆర్‌ డెయిరీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ డెయిరీకి కూడా ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా సంస్థే కల్తీ నెయ్యి పంపింది. మధ్యవర్తిగా తిరుపతి జిల్లాలోని శ్రీ వైష్ణవి డెయిరీని ఉంచింది. ఈ రెండు కంపెనీల్లోని ప్రతినిధులకు కమీషన్లు ఇచ్చి కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో తితిదే ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్‌ ఆరా తీసింది. 

విచారణను తప్పుపడుతూ హైకోర్టుకు

సుబ్బారెడ్డి తరఫున చక్రం తిప్పిన అప్పన్న.. సామర్థ్యం లేని డెయిరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారని సిట్‌ అనుమానించింది. ఈ ఏడాది జూన్‌లో రెండు రోజులపాటు ఆయన్ను తిరుపతిలోని సిట్‌ కార్యాలయంలో విచారించింది. దీనిపై అప్పన్న హైకోర్టుకెళ్లారు. జులై 10న హైకోర్టు సిట్‌ దర్యాప్తుపై స్టే విధించింది. సెప్టెంబరు చివరి వారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తును పునఃప్రారంభించారు. రెండు రోజులుగా అప్పన్నను సిట్‌ విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి అరెస్టు చేసి, నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తితిదేలో కీలకంగా ఉన్న జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డినీ విచారణకు పిలుస్తారా అన్న చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు