ఒక నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌

ఈనాడు, అమరావతి: ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా చూస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. ఉదాహరణకు ఉదయగిరి నియోజకవర్గం మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉందని, అంతా ఒకే డివిజన్‌లో ఉంటే పరిపాలనా సౌలభ్యంగా ఉంటుందని.. అందుకు వీలుగా రాష్ట్రమంతా మార్పుచేర్పులు చేస్తామని వివరించారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటలపాటు వివిధ అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రి అనగాని విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా, అశాస్త్రీయంగా, రాజకీయ నాయకుల వెసులుబాటు కోసం జిల్లాల పునర్విభజన చేశారని విమర్శించారు. ఆ తప్పులన్నీ సరిచేస్తామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ జిల్లాల్లో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన నివేదికపై  సీఎం చర్చించారన్నారు. ఆయన చేసిన సూచనలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించి, కొలిక్కి తీసుకొచ్చామని చెప్పారు. సోమ, మంగళవారాల్లో మరోసారి సమావేశమై తుది నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. కొత్త జిల్లాలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని, గతంలో తామిచ్చిన హామీలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కేంద్రం జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టేలోపే పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. త్వరలో సీఎం, క్యాబినెట్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు