పీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ వైద్యం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆర్టీసీ ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలకు అవకాశం

ఈనాడు, అమరావతి: పదవీవిరమణ పొందిన, మున్ముందు రిటైర్‌ కానున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులు.. ఉద్యోగి ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద వైద్యం పొందేందుకు అవకాశం కల్పించేలా ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనమయ్యారు. వీరికి పింఛను సదుపాయం లేదు. పదవీవిరమణ అనంతరం ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ఈహెచ్‌ఎస్‌ వైద్యం, అటు ఆర్టీసీ ఆసుపత్రుల్లోనూ వైద్యం దక్కడం లేదు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేయడంతో పీటీడీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ వైద్యసదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 6న ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలు పేర్కొంటూ శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  • 2020 జనవరి నుంచి రిటైరయిన పీటీడీ ఉద్యోగులు, ఇకపై రిటైర్‌ అయ్యేవారిలో ఈహెచ్‌ఎస్‌ సదుపాయం కావాలనుకునేవారు సూపరింటెండెంట్‌ కేడర్‌ వరకు ఒకేసారి రూ.38,572 చెల్లించాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ కేడర్‌ నుంచి ఆపై స్థాయి అధికారులు రూ.51,429 చెల్లించాలి. 
  • ఈ డబ్బులు ఎలా చెల్లించాలి, ఏయే వివరాలు అప్‌లోడ్‌ చేయాలనే వివరాలను ఆర్టీసీ ఐటీ విభాగం త్వరలో ప్రకటించనుంది.
  • ఈ మొత్తం చెల్లించిన ఉద్యోగి దంపతులకు జీవితాంతం ఆర్టీసీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో వైద్య సదుపాయం, మందులు లభిస్తాయి. 
  • ఈహెచ్‌ఎస్‌ రిఫరల్‌ ఆసుపత్రుల్లోనూ వైద్యం పొందేందుకు అవకాశం కల్పిస్తారు.
  • అత్యవసరంగా ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే, ఆ ఖర్చులను రీయింబర్స్‌ చేస్తారు.

ఆర్టీసీ ఉద్యోగ సంఘాల హర్షం

2020 తర్వాత రిటైరయిన ఉద్యోగులు వైద్యం అందక ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని, వీరికి ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేయడంపై ప్రభుత్వానికి, ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు వేల మంది విశ్రాంత ఉద్యోగుల వైద్య కష్టాలు తొలగించే ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య పేర్కొన్నారు. ఇటీవల సీఎంను కలిసి విజ్ఞప్తి అందజేయగా, స్పందించి ఆదేశాలివ్వడంపై ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కార్మిక పరిషత్‌ అధ్యక్షులు ఎస్వీ శేషగిరిరావు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు