ఒంగోలులో ముంపు.. ఒక్కరోజులో తొలగింపు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

యంత్రాంగం పకడ్బందీ చర్యల ఫలితం
నేడు కమిషనర్‌ను సత్కరించనున్న సీఎం

ఒంగోలు నగరంలో బుధవారం ఉదయం సహాయక చర్యలు

ఈనాడు, ఒంగోలు: మొంథా తుపాను తీరం దాటే సమయం.. ఒంగోలులో రికార్డు స్థాయిలో వర్షపాతం.. ఒక్కరోజులోనే 29.5 సెం.మీ వర్షం.. ఫలితంగా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధానంగా నగరాన్ని ఆనుకొని ఉన్న చెరువులు పొంగడం, ఇక్కడి నుంచి వరద నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే కాలవల్లో సామర్థ్యానికి మించి ఐదారు రెట్ల ప్రవాహం కొనసాగడంతో భారీ వరద నీరు ఒంగోలును ముంచేసింది. మంగళవారం ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురవడంతో బుధవారం తెల్లారేసరికి 50 కాలనీలు నీట మునిగాయి. అయినా.. పకడ్బందీ చర్యలతో నగరపాలక సంస్థ యంత్రాంగం వరద నిర్వహణను మెరుగ్గా చేపట్టి ఒక్కరోజులోనే నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చింది. ముంపు పరిస్థితులను త్వరితగతిన ఎలా చక్కదిద్దారంటూ ఆర్టీజీఎస్‌ అధికారులు ఆరా తీయడంతో నగరపాలక సంస్థ దీనిపై నివేదికను పంపించింది. 

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందునుంచే 24 గంటలూ సేవలందించేలా ప్రత్యేక బృందాలను, 8 జేసీబీలను, రంపపు కోత యంత్రాలు, ట్రాక్టర్లను యంత్రాంగం సిద్ధం చేసింది. వరద నీరు ఏయే ప్రాంతాలకు చేరవచ్చో అంచనా వేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం నుంచి వర్షాలు మొదలుకాగా, పొడవైన ఎక్స్‌కవేటర్ల సాయంతో కాలువల్లో వంతెనల వద్ద పేరుకుంటున్న చెత్తను నిరంతరాయంగా తొలగించే ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లారేసరికి నగరం నీట మునగడంతో తమ చర్యలను ఉద్ధృతం చేశారు. ఎక్కడికక్కడ జేసీబీలను ఏర్పాటు చేసి పూడిక తొలగింపు, కచ్చా కాలువలు తవ్వి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చేశారు.  జాతీయ రహదారులపైకి నీరు చేరడంతో డివైడర్లను పగలగొట్టడంతో పాటు ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించి వరద నీరు పోయేలా చూశారు. బుధవారం సాయంత్రమే విద్యుత్తు సిబ్బంది వెంటవెంటనే స్తంభాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే సరఫరా పునరుద్ధరించి చీకట్లు లేకుండా చేశారు. 

ఒంగోలులో గురువారం ఉదయం రోడ్లను శుభ్రం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

వరద తొలగిన గంటలోనే సహాయక చర్యలు: వరద తొలగిన ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచే వీధుల్లో ఫైరింజన్ల సాయంతో రోడ్లను శుభ్రం చేయించారు. ప్రత్యేక బృందాలు పారిశుద్ధ్య పనులు చేపట్టి వీధుల్లో చెత్తను తొలగించి, బ్లీచింగ్‌ చల్లించారు. ప్రజలకు సురక్షిత జలాన్ని, బాధితులకు నిత్యావసరాలు అందించారు. ఈ విషయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అధికారులు వరద నివారణ చర్యలపై ఆరా తీయడంతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వరరావును శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించనున్నట్లు వర్తమానం పంపారు. జిల్లా కలెక్టర్‌ రాజాబాబు, సిబ్బంది చురుగ్గా స్పందించిన ఫలితంగానే వరద ముప్పును  తగ్గించగలిగినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని