పరకామణిలో చోరీ కేసు రాజీ.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 06:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కౌంటర్లు వేయాలని రవికుమార్, ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ తదితరులకు ఆదేశం
లోక్‌అదాలత్‌లో రాజీ చట్టబద్ధతను తేల్చేందుకు ధర్మాసనం విచారణ
తదుపరి విచారణ 17కు వాయిదా

ఈనాడు, అమరావతి: తితిదే పరకామణిలో చోరీ కేసును రాజీ చేస్తూ లోక్‌ అదాలత్‌ ఇచ్చిన ఉత్తర్వుల (అవార్డు) చట్టబద్ధతను తేల్చేందుకు సుమోటో వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీ రవికుమార్‌తోపాటు ప్రతివాదులైన పరకామణి అప్పటి అసిస్టెంట్‌ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్‌వో) వై.సతీష్‌కుమార్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, తిరుపతి మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్,  సీఐడీ డీజీ, తితిదే ఈవో, సీవీఎస్వో, తిరుమల మొదటి పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ సుభేందు సామంతతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులిచ్చింది. 

2023లో వైకాపా హయాంలో తితిదే పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్‌ ఎం.శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సీవీ రవికుమార్‌ పెద్ద ఎత్తున డాలర్లు, బంగారం అపహరించారన్నారు. దీనిపై 2023 ఏప్రిల్‌ 29న తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌.. తర్వాత అనూహ్యంగా నిందితుడు రవికుమార్‌తో స్వచ్ఛందంగా లోక్‌ అదాలత్‌ (తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌) వద్ద రాజీ చేసుకున్నారన్నారు.

చట్టబద్ధతను తేల్చేందుకు ధర్మాసనానికి..

గత నెల 27న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌.. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించారు. చోరీకి పాల్పడిన రవికుమార్, ఆయన కుటుంబసభ్యులు కూడబెట్టిన  స్థిర, చరాస్తులతోపాటు బ్యాంక్‌ ఖాతాలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. రవికుమార్, ఆయన కుటుంబసభ్యులు విక్రయించిన, ఇతరులకు బదలాయించిన ఆస్తులపైనా దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ లోక్‌ అదాలత్‌ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం తీర్పు ప్రతిని సీజే వద్ద ఉంచాలని ఆదేశించారు. దీంతో సీజే ఈ వ్యవహారాన్ని జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ సుభేందు సామంతలతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని