ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పలు రాష్ట్రాలకు ప్రధాని మోదీ కూడా.. 

దిల్లీ: అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పంజాబ్, దిల్లీ, అండమాన్‌ నికోబార్, పుదుచ్చేరిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సేవల్ని కొనియాడారు. ఈ రాష్ట్రాల్లోని  ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అభివృద్ధి ప్రస్థానంలో సరికొత్త మైలురాళ్లను ఈ రాష్ట్రాలు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌ 25వ అవతరణ ఉత్సవాలకు హాజరైన ప్రధాని మోదీ.. పలు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షల సందేశాలు ఇస్తూ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో స్ఫూర్తి, నైపుణ్యం కనిపిస్తాయని.. సంస్కృతి, సాహిత్యం, సంగీతాలకు అది కాణాచి అని కొనియాడారు. సృజనాత్మకత, నవకల్పనలకు కేరళ నిలయమని అన్నారు. దేశానికి గుండె వంటి మధ్యప్రదేశ్‌ ఇప్పుడు అభివృద్ధి పథంలో కొత్తపుంతలు తొక్కుతూ అందరి కలల్ని నెరవేర్చేందుకు సిద్ధమవుతోందన్నారు. రైతుల కఠోరశ్రమ, సైనికుల ధైర్యసాహసాలకు హరియాణా ప్రసిద్ధి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఎంతో ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని