ఆర్సెలార్‌ మిత్తల్‌-నిప్పాన్‌ స్టీల్స్‌ పర్యావరణ అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్‌ మిత్తల్‌-నిప్పాన్‌ స్టీల్స్‌(ఏఎం/ఎన్‌ఎస్‌) సంస్థ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ) పర్యావరణ అనుమతికి శనివారం సిఫారసు చేసింది. దీంతో ఆ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి అన్ని అనుమతులూ వచ్చినట్టేనని, 14 నెలల రికార్డు సమయంలోనే దీన్ని సాధ్యం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.1.5 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఉక్కు కర్మాగారం దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ కర్మాగారంగా రికార్డు సృష్టించనుంది. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో ఆర్సెలార్‌ మిత్తల్‌ కర్మాగారానికి భూమి పూజ చేయనున్నారు. మొదటి దశలో 82 లక్షల టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపడతారు. చివరి దశలో దీన్ని 2.40 కోట్ల టన్నుల వరకు విస్తరించనున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు లోబడి అతితక్కువ కాలుష్య కారకాలు వచ్చేలా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. కర్మాగారం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఏపీ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో ప్రధాన పరిశ్రమగా నిలుస్తుంది.  

3 నెలల్లో భూ కేటాయింపు

2024 ఆగస్టులోనే మంత్రి లోకేశ్‌ ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో చర్చించారు. ఆ సమయంలో భూమి, విధానపరమైన మద్దతును సంస్థ కోరింది. ప్రభుత్వం 3 నెలల్లోనే భూమి కేటాయించి, ఏక గవాక్ష విధానంలో పూర్తి సహాయ, సహకారాలు అందించింది. ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారానికి 14 నెలల్లో అన్ని అనుమతులూ వచ్చేలా చేసి, శంకుస్థాపనకు సిద్ధం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’, పారదర్శక, పారిశ్రామిక అనుకూల విధానాలకు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం వేగం, పారదర్శకత, సమర్థత పరిపాలనను ఇది నిదర్శనమని మంత్రి లోకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పారిశ్రామిక సహాయక వ్యవస్థను అభివృద్ధి చేశాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని