మద్యం కుంభకోణంలో ఏ-49గా అనిల్‌ చోఖ్రా

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముడుపుల సొమ్ము రూటింగ్‌కు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది ఆయనే 

ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు నిందితుల జాబితాలో మరొకరు చేరారు. ముడుపుల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్‌ కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ముంబయి వాసి అనిల్‌ చోఖ్రాను 49వ నిందితుడిగా చేరుస్తూ సిట్‌ అధికారులు తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్‌ సంస్థలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ11), క్రిపాటి ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ12), నైస్న మల్టీవెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ13), ట్రిఫెర్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ14), విక్సో ఎంటర్‌ప్రైజస్‌ (ఏ15) తదితర డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవి. అక్కడి నుంచి మరికొన్ని కంపెనీల ద్వారా రెండు, మూడు అంచెల్లో రూటింగ్‌ జరిగి, చివరిగా ముడుపుల సొమ్ము నగదు రూపంలో వైకాపా ముఠాకు, అంతిమ లబ్ధిదారుకు చేరేది. ఈ అక్రమ దందా కోసం పైన పేర్కొన్న డొల్ల కంపెనీలన్నీ అనిల్‌ చోఖ్రాయే ఏర్పాటు చేసినట్లు సిట్‌ గుర్తించింది. రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో అలాంటి కంపెనీలేవీ లేవని తేల్చింది. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు మూడు రోజులుగా సిట్‌ బృందాలు ముంబయిలో సోదాలు చేస్తున్నాయి. అనిల్‌ చోఖ్రాను ప్రశ్నిస్తున్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అనిల్‌ చోఖ్రాపై అనేక కేసులున్నాయి. గతంలో ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. ముంబయి విడిచిపెట్టి వెళ్లకూడదనే షరతుతో తర్వాత బెయిల్‌ లభించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు