Swamitwa: ఇళ్లు, స్థలాలు ఇక మీ సొంతమే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 06:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు
వచ్చే మార్చిలో ‘ప్రాపర్టీ కార్డుల’ పంపిణీకి సన్నాహాలు
‘స్వామిత్వ’ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ అధికారచిహ్నంతో ముద్రించిన స్వామిత్వ ప్రాపర్టీ కార్డు

ఈనాడు, అమరావతి: గ్రామ కంఠాల్లో ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీచేయనుంది. డిసెంబరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తిచేస్తారు. ప్రస్తుతం 6వేల గ్రామాల్లో ‘ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌’ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు.

గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ యాజమాన్య హక్కుల్లేవు. వీటిని విక్రయించినా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్టర్‌ చేయరు. ఆస్తులు గ్రామకంఠాల్లో ఉండటమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఐదేళ్లలో 1,300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు.  

వాటిపైనా గత సీఎం జగన్‌ ఫొటో ముద్రించడంతో ఎక్కువమంది తీసుకోడానికి నిరాకరించారు. వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికారచిహ్నంతో కొత్త కార్డులను ఇస్తోంది.

  • స్వామిత్వ కార్యక్రమం అమలులో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ చివరి స్థానానికి పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రస్థాయి యూనిట్‌ని బలోపేతం చేయడంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. గ్రామ సచివాలయాల సిబ్బందిని భాగస్వాములను చేసింది.
  • 6వేల గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. వీటిలో ప్రతి ఇల్లు, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నిక్షిప్తమయ్యాయి. వీటి నిర్ధారణకు రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తికీ కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో మిగిలినవీ పూర్తి చేయనున్నారు.
  • ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్‌ 9(2) ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులిచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు సెక్షన్‌ 13 కింద ప్రకటిస్తారు. 
  • రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాలు సచివాలయాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. పేర్లు మారినా, ఇతర లోపాలు గమనించినా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయొచ్చు. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో వాటిని సవరిస్తారు. 
  • మరోదశలో ఇంకో 6వేల గ్రామాల్లో 45 లక్షల ఇళ్లు, స్థలాలకు యజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం 2026 మార్చి తర్వాత ప్రారంభం కానుంది.

కార్డుతో లాభాలివి

  • ప్రజల అవసరాల మేరకు ఇళ్లు, ఖాళీస్థలాలు విక్రయించొచ్చు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇలాంటి క్రయవిక్రయాలను రిజిస్టర్‌ చేస్తారు. ఈ మేరకు రెవెన్యూ చట్ట సవరణ చేశారు.
  • కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు రుణాలిస్తాయి. వారసులకు ఆస్తులు బదిలీ చేయొచ్చు.
Tags :
Published : 01 Nov 2025 05:05 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు