Andhra News: పదవీ విరమణ చేసినా మళ్లీ కొనసాగింపు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 02 Nov 2025 06:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జలవనరులశాఖ ఈఎన్‌సీకి మరో ఏడాది గడువు పెంపు
ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అనుభవం లేకున్నా అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కె.నరసింహమూర్తికి శుక్రవారం పదవీ విరమణ ఉండగా ఆయనకు మరో ఏడాది పాటు అదే పోస్టులో కొనసాగే అవకాశం లభించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలవరం చీఫ్‌ ఇంజినీరుగానూ ఇంతకాలం ఆయనే వ్యవహరించారు. రెండు పోస్టుల్లోనూ ఉన్నారు. ప్రస్తుతం పోలవరం సీఈ పోస్టుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎక్కువ కాలం పని చేసిన అనుభవం నరసింహమూర్తికి లేదు. పైగా ఆయన మెకానికల్‌ ఇంజినీరు. ఎక్కువ కాలం వాలంతరీలో.. అంటే ఇంజినీర్ల శిక్షణ సంస్థలో, ఆ తర్వాత ఆయకట్టు అభివృద్ధి సంస్థలో పని చేశారు. సర్వీసులో సింహభాగం ఆయన ఆఫీసు కార్యకలాపాల్లోనే ఉన్నారని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కీలకమైన స్థానం ఇది. అలాంటి పోస్టులో ప్రాజెక్టుల్లో ఎక్కువ కాలం పని చేయని అధికారిని నియమించడం సాధారణంగా వాంఛనీయం కాదు. కానీ సర్వీసు నిబంధనల్లో అలాంటివి ఏమీ లేవని.. కీలక స్థానాల్లో పోస్టింగ్‌ ఇచ్చే క్రమంలో ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గతంలో ఈఎన్సీ (పాలన)గా పని చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఆయన ఈఎన్సీగా ఇంతకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మెకానికల్‌ ఇంజినీర్‌ను ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పోస్టులో ఏడాది పాటు మళ్లీ కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది చర్చనీయాంశమవుతోంది. ఈ అంశాన్ని ప్రస్తుతం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పాలన) ప్రతిపాదిస్తే.. ఆ ఫైలును స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి సానుకూలంగా సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలోని లోపాలను ఆ కమిటీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనేది ప్రశ్నార్థకమవుతోంది.

పదవీ విరమణ చేసిన మరో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు పోస్టు 

ఈనాడు, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (కమిషనర్‌ ఆఫ్‌ టెండర్లు) పోస్టులో ఉన్న ఎస్‌.కె.వెంకటాచార్యులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఆయనను జలవనరుల శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులో ఏడాది పాటు నియమిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శనివారం ఆదేశాలిచ్చారు. ఆయన సేవలను ప్రస్తుతం జాయింట్‌ సెక్రటరీ (టెక్నికల్‌)గా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. స్క్రీనింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags :
Published : 02 Nov 2025 04:51 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు