Kasibugga Stampede: అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు రావడంతోనే తొక్కిసలాట

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.17 లక్షల చొప్పున ఆర్థికసాయం
తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ.3.50 లక్షలు
ప్రైవేటు ఆలయాలపై నిరంతర పర్యవేక్షణ
తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేశ్‌

ఆసుపత్రిలో క్షతగాత్రురాలిని పరామర్శిస్తున్న మంత్రి లోకేశ్, చిత్రంలో రామ్మోహన్‌నాయుడు, పల్లా శ్రీనివాస్, అనిత, శిరీష

ఈనాడు, శ్రీకాకుళం: ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతోనే తొక్కిసలాట జరిగిందని మంత్రి  లోకేశ్‌ తెలిపారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస సీహెచ్‌సీకి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. తర్వాత అక్కడే విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఈ దేవాలయాన్ని 92 ఏళ్ల పండా సొంత నిధులతో నిర్మించారు. స్థానిక అధికారులు, పోలీసులకు ఇంతమంది వస్తారని తెలియదు. సాధారణంగా ఉదయం 6-12, మధ్యాహ్నం 3గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం వెళ్లాల్సిన భక్తులు ప్రవేశమార్గంలో వెళ్లారు. రద్దీ అనూహ్యంగా పెరగడంతో 11.30కు గుడి లోపలకు వెళ్లే మార్గం మూసేశారు. లోపల ఉన్న భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా, బయట ఉన్నవారిలో కొందరు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండడంతో తోపులాట జరిగింది. పై మెట్లమీద ఉన్నవారు కిందకు పడిపోయారు’ అని తెలిపారు. 

అందర్నీ అప్రమత్తం చేశాం

‘‘భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయాల్లో బ్యారికేడ్ల ఫౌండేషన్‌ ఆరు అంగుళాల వరకు వేస్తారు. కానీ, ఇక్కడ రెండున్నర అంగుళాలే వేశారు. బ్యారికేడ్ల తర్వాత నేరుగా కాంక్రీట్‌ ఉంది. అటువైపు పడినవారు ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు. నాకు విషయం తెలియగానే మొదట ఎమ్మెల్యే శిరీష, తర్వాత మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేశాను. అధికారులతో మాట్లాడాను. అందరూ యుద్ధప్రాతిపదికన ప్రాంగణానికి వచ్చి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగినప్పుడు సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో ఉన్నారు. కదిరిలో ల్యాండ్‌ అవ్వగానే ఆయనతో మాట్లాడాను. అప్పట్నుంచి సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశాం’’ అని వెల్లడించారు.

ఘటన వివరాలు లోకేశ్‌కు వివరిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, చిత్రంలో రామ్మోహన్‌నాయుడు, అనిత, కలిశెట్టి అప్పలనాయుడు, గౌతు శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కేంద్ర సాయంతో కలిపి రూ.17లక్షల పరిహారం:‘‘తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు కలిపి రూ.17 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు, కేంద్రం ఇచ్చే రూ.50 వేలు కలిపి రూ.3.50 లక్షలు ఇస్తాం. మృతుల కుటుంబాలకు మట్టిఖర్చుల కింద రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. చనిపోయిన వారిలో ముగ్గురు తెదేపా సభ్యులున్నారు. వీరికి అదనంగా ప్రమాద బీమా కింద పార్టీ తరఫున రూ.5లక్షల చొప్పున ఇస్తాం’’ అని తెలిపారు.

ప్రైవేటు ఆలయాల నిర్వహణకు ఎస్‌ఓపీ

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటి కార్యక్రమాలు, గతంలో ఎంతమంది భక్తులు వచ్చారు, రాబోయే రోజుల్లో ఎంతమంది వస్తారో ముందే వివరాలు సేకరించాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయశాఖ కింద ఉన్న ఆలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రైవేటు ఆలయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది. గుడిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఘటన జరిగినప్పుడు లోపల ఎంతమంది ఉన్నారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, ఉచిత బస్సుప్రయాణంతోనూ భక్తులు ఎక్కువగా వచ్చారు’’ అని వెల్లడించారు.

పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు


ఆ ఆలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు: కలెక్టర్‌

తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ ఆలయానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారికంగా ప్రకటించారు. ఓ వ్యక్తి సొంత నిధులతో ఆ ఆలయాన్ని నిర్మించి నిర్వహిస్తున్నారని వెల్లడించారు.


తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాశీబుగ్గ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌లను విచారణాధికారులుగా నియమించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. తొక్కిసలాట జరిగి 9 మంది భక్తుల మృతికి నిర్లక్ష్యమే కారణమని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఆలయం వద్ద బాధిత కుటుంబ సభ్యురాలిని ఓదారుస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు