జీవితమే వరం

జీవితం నీటి బుడగ. ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణ వాయువు పంచ భూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత, భవిష్యత్‌ కాలాలు మనవి కావు. శరీరం, జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైనా, సత్యవంతుడైనా, దానకర్ణుడైనా మరణించడం అనివార్యం.

Published : 10 Feb 2024 01:50 IST

జీవితం నీటి బుడగ. ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణ వాయువు పంచ భూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత, భవిష్యత్‌ కాలాలు మనవి కావు. శరీరం, జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైనా, సత్యవంతుడైనా, దానకర్ణుడైనా మరణించడం అనివార్యం. దుష్కర్ముడు చనిపోతే, చెడు అంతరిస్తుంది. మనుషులు ప్రశాంత మనస్కులవుతారు. ధర్మాత్ముడు మరణిస్తే, మనసులు రోదిస్తాయి. మంచి సజీవమవుతుంది. మనకు ఉపకరిస్తుందంటే కొంత స్వార్థం ఉన్నా ఫర్వాలేదు కాని, అదే నరనరాన జీర్ణించుకుపోయి ఎవరికీ మేలు చేయని, వ్యక్తిత్వం లేని మనిషిగా జీవించడం వింతే మరి.

సొంతలాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్‌ అని శతకకారుడు చెప్పినట్టు- ఎవరికీ అపకారం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండటం తప్పుకాదు. బంగారంలో ఒకింత రాగి కలిస్తేనే ఆభరణం అవుతుంది. ధరించిన మనిషి విలువను ఇనుమడింపజేస్తుంది. రాగిపాళ్లు ఎక్కువైతే బంగారం విలువ కోల్పోతుంది. నాసిరకానికి నమూనా అవుతుంది. స్వార్థజీవి ముద్ర కళంకిత వ్యక్తిత్వ సూచన. లేమిని చిన్నచూపు చూడటం, అవయవలోటును అపహాస్యం చేయడం, స్థాయీభేదాలను ప్రదర్శించడం, ఒక స్థాయికి చేరగానే తనను మించినవారు లేరని విర్రవీగడం... ఇవి మానవత్వ భావాలకు వ్యతిరేకమని తెలియనివారు ఉండరు. అయినా, మాయలో పడిన మనిషి విపరీత ప్రవర్తనకు అలవాటు పడతాడు. లౌకిక ఆకర్షణలకు లోబడి కొట్టుమిట్టాడుతుంటాడు. అదే జీవితమన్న భ్రమలో కాలం గడుపుతాడు.

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు కూడా మాయను ఛేదించలేకపోవడం విచిత్రం. మనిషి రూపంలో దైవం ఉంటాడని, మానవుడికి చేసే సేవ మాధవుడికి చేసే పూజతో సమానమని తెలిసి కూడా తమ చుట్టూ పరిధి గీసుకుంటారు.  సమాజంలో గొప్ప కీర్తి గడించకపోయినా ఫర్వాలేదు. అపకీర్తి మూట కట్టుకోకూడదు. కర్మ, జ్ఞాన ఇంద్రియాలను ఉత్తమ సంస్కారాలకు వినియోగించాలి. మనసును కట్టడి చేయగలగాలి. బుద్ధి వినియోగాన్ని పెంచుకోవాలి. మనిషి చేసే మంచైనా, చెడైనా తరవాతి తరాలకు పునాది అవుతుంది. భవనం వాతావరణ మార్పులకు చెక్కు చెదరని, పటిష్ఠమైన నిర్మాణమని పదుగురు చెప్పుకోవాలా లేక, పగుళ్లతో విచ్చుకుపోయి అందులో నివాసం ఉండేవాళ్లు ఎప్పుడు కూలిపోతుందో అన్న చింతతో క్షణం క్షణం కాలం గడపాలా అన్నది కర్మచింతన. అందుకే, మానవులకు సత్ప్రవర్తనతో కూడిన ముందుచూపు ఉండాలి.

ఏ ఒక్క తరంలోనన్నా గురువుంటే, పండితుడుంటే, విద్వాంసుడుంటే, లోకానికి మేలు చేసిన మహానుభావుడుంటే- ఆ కుటుంబంలోని ప్రతి తరమూ సంఘం గుర్తింపునకు నోచుకుంటుంది. గౌరవం పొందుతుంది. వికసించిన పువ్వు పరిమళాలను వెదజల్లినా, జంతువు విశ్వాసం కనబరచినా, చెట్టు అవసరాలు తీర్చినా వాటికో పుస్తకం, పుట ఉండవు. మనిషి ఒక్కడే గుణంతో, కర్మతో శ్లాఘనీయుడు అవుతాడు. వరంగా పొందిన ఈ జన్మకు విలువ తెచ్చుకోవాలి. మరణించాక స్వర్గం పొందాలని, మరో జన్మ ఉత్తమమైనది కావాలని ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోవడం ఎంతమాత్రం తగదు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని