దానగుణం

దానం ఓ మహత్తర కార్యం. ప్రతిఫలాపేక్ష లేని త్యాగం. కీర్తి కండూతి లేకుండా చేసేదే దానం. యజ్ఞం, దానం, తపస్సుల ద్వారా మోక్షం సాధించవచ్చునని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కలియుగంలో యజ్ఞం, తపస్సు సాధ్యం కావు.

Published : 12 Feb 2024 00:44 IST

దానం ఓ మహత్తర కార్యం. ప్రతిఫలాపేక్ష లేని త్యాగం. కీర్తి కండూతి లేకుండా చేసేదే దానం. యజ్ఞం, దానం, తపస్సుల ద్వారా మోక్షం సాధించవచ్చునని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కలియుగంలో యజ్ఞం, తపస్సు సాధ్యం కావు. కనుక దానమనే త్యాగగుణం మాత్రమే మానవులను పునీతుల్ని చేస్తుందని భగవద్గీత చెబుతోంది. కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో జ్ఞానం వల్ల, ద్వాపరయుగంలో యజ్ఞ యాగాదుల వల్ల, కలియుగంలో కేవలం దానం వల్లనే కీర్తిమంతులు అవుతారని రుషులు చెప్పారు. కన్యాదానం వల్ల మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. గోదాన, భూదానాల వల్ల కుటుంబ పోషణకు అవసరమైన పాడిపంటలు వృద్ధి చెందుతాయి. విద్యాదానం వల్ల అజ్ఞానం అంతరించి విజ్ఞానం వికసిస్తుంది. విజ్ఞాన సముపార్జనతో ఉపాధి లభిస్తుంది. ఈ నాలుగు దానాలు విశిష్టమైనవని పెద్దలు చెబుతారు. భూదానం, గోదానం, తిలదానం, హిరణ్యదానం, వెండి దానం, ఆజ్య దానం, వస్త్ర దానం, ధాన్య దానం, గుడదానం, లవణ దానం అనేవి దశ దానాలు. వీటికి విద్య, కన్య, గృహ, శయ్య, దాసి, అగ్రహార దానాలను కూడా జత చేర్చి షోడశ దానాలు అన్నారు.

భారతంలో బృహస్పతి ధర్మరాజుకు అన్నదాన విశిష్టతను వివరించాడు. ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చే అన్నదానానికి సమమైన దానం మరొకటి లేదు. వేమన, చాణక్యుడు అన్నదానం గురించి చెప్పారు. అన్నదానం చేయకుండా మిగిలిన ఎన్ని దానాలు చేసినా నిరూపయోగమే. అన్నదానం, ఉదక దానం కన్నతల్లితో సమమైనవి. ఆకలి దప్పులను తీర్చగలిగే అన్నదానమే అత్యుత్తమమైనదని చాణక్యుడు అన్నాడు.

భగవద్గీతలో సాత్విక, రాజస, తామస దానాల గురించి చెప్పారు. కరవు కాటకాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో ప్రతి ఫలాపేక్ష రహితంగా చేసేది సాత్విక దానం. ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేది రాజస దానం. ఇది ఒత్తిళ్లకు లొంగి, ప్రతిఫలాన్ని ఆశించి చేసేది. మనస్ఫూర్తిగా ఇవ్వకుండా బాధపడుతూ ఇచ్చేది.

అయోగ్యమైన ప్రదేశంలో అపాత్రమైనవారికి, యోగ్యం కాని కాలంలో ఇచ్చేది తామస దానం. ఇది స్వీకరించేవారిని చులకనగా చూస్తూ ఇచ్చే దానం. దానం ఇచ్చేవాడిని దాత అని, పుచ్చుకొనేవాడిని గ్రహీత అనీ అంటారు. ఎప్పుడో ఒకసారి అవసరానికి దానం అడిగేవాడు యాచకుడు కాడు. ఒకటో అరో దానాలు చేసినవాడు దాత అనిపించుకోడు. అడిగేవాడు అర్థి అనిపించుకోకపోయినా, నిత్యం దానం చేసేవాడు మాత్రమే దాత అనిపించుకుంటాడు. కర్ణుడు సహజ కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు. శరణార్థిగా వచ్చిన పావురాన్ని రక్షించడానికి తన శరీరం నుంచి సమమైన మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు శిబి చక్రవర్తి. ఇచ్చిన మాట తప్పక వామనుడు అడిగిన మూడు అడుగుల భూమిని దానం చేశాడు బలి చక్రవర్తి. వృత్రుడు అనే రాక్షసుణ్ని సంహరించడం కోసం  ఆత్మత్యాగం చేసి తన వెన్నెముకను సమర్పించాడు దధీచి. వీరంతా దాతలు.

‘నేను’ చుట్టూ బంధాలన్నీ పరిభ్రమిస్తున్న నేటి కాలంలోనూ ఎంతోమంది మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రక్తదానం, మరణానంతరం నేత్రదానం, అవయవదానం చేస్తున్నారు. మరణపుటంచుల్లో ఉన్నవారికి అవయవదానం పునర్జన్మనిస్తుంటే, నేత్రదానం వల్ల మరణించినవారి కళ్లకు పునఃదృష్టి భాగ్యం కలుగుతోంది. మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ‘మరణించిన వారికి చుట్టం ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు. ‘చేసిన ధర్మం, అనగా దానం’ అని ధర్మజుడు బదులిస్తాడు.

 ఎం.వెంకటేశ్వర రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు