ఏకాంత ఉపాసన

మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.

Published : 31 Mar 2024 01:17 IST

నిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. ఒంటరితనం, ఏకాంతవాసం ఒకటిగా కనిపించినా- రెండింటి నడుమ అగాధం ఉంది. పదిమంది మధ్యన ఉంటూనే తాను ఏకాకినని అనుకోవడం, బాధపడటం చాలామందికి అలవాటు. చుట్టూ బాజా బజంత్రీలు మోగుతున్నా ఆనందంగా ఉండే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ఒంటరితనానికి భయం, ఏకాంతానికి వైరాగ్యం మూలకారణాలు. ఏకాకిని చీకటి భయం, పగటి పూట అభద్రత వెంటాడుతూ ఉంటాయి. రేపు ఏమవుతుందో, ఉన్నది ఎవరు దోచుకుపోతారో అన్న ఆందోళన కంటికి కునుకు పట్టనివ్వదు. ఈ జగత్తు ఒక మాయాజాలం. ఈ భౌతిక జీవితంలో ఆనందం ఎండమావి అన్న ఎరుక మనిషిని ఏకాంతం వైపు ఆకర్షిస్తుంది. బయటి ప్రపంచం నుంచి తన లోపల ఉన్న మరో ప్రపంచం దిశగా ఆ మనిషి జీవన ప్రస్థానం మొదలవుతుంది.

నేనెవరు, ఈ జీవితం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, ఏం సాధించాలి, మరణం ఎలా ఉంటుంది, విధి ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ తరవాత ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆలోచనాపరుడైన మనిషిలో బుసలు కొడతాయి. సమాధానాలు వెదకడానికి సమాధిస్థితి కావాలి. అది ఏకాంతంలోనే కుదురుతుంది. యోగజీవికి పగలు రాత్రి అని, రాత్రి పగలని గీత చెబుతున్నది. భోగజీవికి పగలు యోగజీవికి రాత్రితో సమానం. ఆ భోగజీవికి ఏది రాత్రో యోగజీవికి అది పగలు. మేధావులు, కవులు, కళాకారులు, తమ చుట్టూ మరో లోకం నిర్మించుకుని అందులో ఏకాంతంగా జీవిస్తారు. పూర్వం రుషులు పర్ణశాలల్లో తలదాచుకుని అడవిలో తపస్సు చేసుకునేవారు. అలాంటి వెసులుబాటు లేని ఈ ఆధునిక యుగంలో తనువు సమాజంలో, తలను అరణ్యంలో ఉంచుకోవాలి. సంఘజీవి అయిన సామాన్యుడి కోసం ఆశ్రమధర్మాలు, పురుషార్థాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్తు ధర్మం, ఆ తరవాత వానప్రస్థం, చివర సన్యాసం పాటించాలని శాస్త్రాలు ఆదేశించాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ధర్మార్థకామాలను ఆచరిస్తూ పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అంచెలంచెల మోక్షం అంటే ఇదే! పాము కుబుసం విడిచినట్టుగా, సంసార బంధాల నుంచి విముక్తి పొందితే ఆ మనిషి మనీషి అవుతాడు. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే జీవిస్తూ, తోటివారికి సాయం చేస్తాడు.

ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం ఒక జాడ్యంగా మారింది. అనారోగ్యానికి చిరునామా అయింది. అనాదిగా భారతదేశం యోగభూమిగా పేరెన్నికగన్నది. ఆధునిక విజ్ఞానంపట్ల మోజు పెరిగి మూలాలను కోల్పోతున్నది. ధ్యానం యోగంలో ఒక భాగం. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును నియంత్రించి బుద్ధిని ఏకాగ్రం చేసి ఆత్మను ఉపాసించమని విపాసన లాంటి సంస్థలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రపంచ యోగాదినం ఘనంగా జరుపుతోంది. అన్నింటికన్నా మిన్న- ఆత్మ సంయమనం. అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మ అన్న భావన ఏకాంతానికి నిచ్చెన. నేను వేరు ఇవన్నీ వేరు అన్న తలపు ఒంటరితనపు తలుపు. ఏకాంతం కోరుకోవడం అంటే మానసిక స్వాతంత్య్రాన్ని స్వాగతించడం. మనసే బంధానికి, మోక్షానికి కారణం కాబట్టి మనోజయానికి కావలసిన వాతావరణాన్ని ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. ఏకమే అనేకం అన్న సత్య జ్ఞానం ఒంటరితనానికి ప్రాకారం, ఏకాంత జీవితానికి శ్రీకారం.

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని