శ్రీరామ విజయం

సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు.

Published : 17 Apr 2024 01:24 IST

సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. శివకేశవ చైతన్యాన్ని తనలో సమ్మిళితం చేసుకున్న బీజాక్షర సంపుటి రామనామం. ర, అ, మ అనే మంత్రాక్షరాల మేలు కలయిక అయిన రామ శబ్దాన్ని సృష్టి, స్థితి, లయ కార్యకారణత్వాలకు ప్రతిఫలనంగా భావిస్తారు.

బాహ్యసౌందర్యం కన్నా, ఆత్మసౌందర్యం మిన్న అనే భావజాలాన్ని రామతత్వం అభివ్యక్తం చేస్తుంది. రాముడు పాటించిన ధర్మాల్ని గ్రహించి, వాటిని అనుసరిస్తే, అది ఆదర్శనీయం. రాముడిని దైవంగా ఆరాధిస్తే, అది ఆరాధనీయ సంవిధానం. ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామిగా భాసిల్లుతున్నాడు. ప్రతి అంతరంగంలో ఆనంద ధాముడై, ఆత్మారాముడై, మనోభిరాముడై తేజరిల్లుతున్నాడు. ‘రామ’ అంటే ఆకర్షణ అని అర్థం. మన కంటికి కనిపించే సమస్త ప్రకృతిలో ఉన్న ఆకర్షణ శక్తికి ప్రతిరూపమే- రాముడు. ఆకర్షణ వల్లే ప్రకృతి నిరంతరం జాగృతమవుతోంది. ఆ ఆకర్షణ శక్తి లేకపోతే ప్రకృతిలో నవ్యత్వం ఉండదు. ఆ నవ్యత్వానికి దివ్యత్వాన్ని, భవ్యత్వాన్ని ఆపాదించే పునీత చరితుడు- శ్రీరామచంద్రుడు. క్రియాత్మకమైన దేహం, ఆలోచనాత్మకమైన మనసు, సందేశాత్మకమైన వాక్‌ శక్తి- ఈ మూడింటి మిశ్రమమే రామావతారం. రాముడు ఎలా నడిచాడో రామాయణం అలా నడిచింది. వేదతుల్యంగా రామాయణాన్ని సంభావిస్తారు. సర్వ వేదార్థ సమ్మతంగా రామచరితాన్ని విశ్వసిస్తారు.

గాయత్రీ మంత్ర శక్తి, శ్రీ లలితా పరాభట్టారిక దివ్యత్వం శ్రీమద్రామాయణంలో వాల్మీకి నిక్షేపించాడంటారు. హనుమ రూపంలో రుద్రశక్తి, రామ రూపంలో విష్ణుశక్తి, సీత స్వరూపంలో మహాశక్తి రామాయణంలో సంలీనమై ఉన్నాయి. అందుకే రామాయణాన్ని యోగత్వసిద్ధిని, అమృతత్వలబ్ధిని చేకూర్చే మంత్రశాస్త్రంగా పేర్కొంటారు. నిస్సంగత్వం, నిర్మోహత్వాల్ని విడనాడటం ద్వారా దైవానికి చేరువ కావచ్చని రామాయణం నిరూపించింది. అయోధ్యా నగరపు భోగభాగ్యాల్ని విడనాడి, అగ్రజుడైన సోదరుడితో వనవాసానికి తరలివెళ్ళిన లక్ష్మణుడు, భర్త సన్నిధే తనకు పావనమైన పెన్నిధి అని భావించిన సీతామహాసాధ్వి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు. వ్యక్తిత్వ వికాస చరిత్ర. మనిషి మనుగడకు, శాంతి సౌఖ్యదాయక జీవన విధానాన్ని అవలంబించడానికి ఉపకరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతి పాత్ర వైవిధ్య గుణ సమాహారాన్ని వెలువరిస్తుంది. రావణుడు రజోగుణానికి, కుంభకర్ణుడు తమోగుణానికి, విభీషణుడు సత్త్వగుణానికి ప్రతీకలు. రజోగుణాన్ని, తమోగుణాన్ని అరికట్టి, సత్త్వగుణానికి పట్టం కట్టడానికి రాముడు చేసిన ప్రయాణమే- రామాయణం. చైత్రశుద్ధనవమి నాడు పునర్వసు నక్షత్రంలో గ్రహాలన్నీ ఉన్నత స్థితిలో ఉండగా రాముడు కౌసల్యాతనయుడై జన్మించాడని వాల్మీకి రామాయణం ప్రస్తావించింది. పరమాత్మ జన్మతిథి నాడే కల్యాణ క్రతువు జరిపించాలని బృహస్పతి సంహిత తెలియజేసింది. అందుకే లోక కల్యాణ కారకులైన సీతారాములకు ఆ నవమినాడే కల్యాణాన్ని ఏటేటా నిర్వహిస్తూ, అశేష భక్తకోటి, అలౌకిక ఆధ్యాత్మిక భావనా జగత్తులో విహరిస్తూ పులకిస్తోంది!

 డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని