పున్నమిలో ఉన్నవి ఎన్నో...

చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు.

Published : 23 Apr 2024 01:12 IST

చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ‘హనుమజ్జయంతి’ జరుపుకొంటారు. మధ్వమతస్థులకు ఇది ముఖ్యమైన పండుగ.

విశాఖ నక్షత్రంతో కూడిన పున్నమిని ‘వైశాఖి’ అంటారు. ‘మహా వైశాఖి’ అనీ పిలుస్తారు. ఈ పర్వదినాన సోమ వ్రతం చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి, నమ్మాళ్వారు, బుద్ధుడు జన్మించినది ఈరోజునే అని చెబుతారు. కూర్మావతారం ఆవిర్భావం ఇదే రోజున జరగడంతో ‘కూర్మ జయంతి’గా వ్యవహరిస్తారు. తులసి, అశ్వత్థ వృక్షాలను కూడా ఈరోజున పూజిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి చెందింది. ముత్తైదువులు ‘వటసావిత్రీ వ్రతం’ చేస్తారు. పద్మ పురాణ గ్రంథం, కృష్ణాజినం మొదలైనవి దానం చేస్తారు.

ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసుణ్ని ఆరాధిస్తారు. వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమగానూ దీన్ని వ్యవహరిస్తారు. ఈ రోజున కొందరు ‘శివ శయన వ్రతం’ చేస్తారు. ద్రుపదుడి భార్య కోకిలాదేవి పేరుతో కోకిలా వ్రతం చేస్తారు. శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ, రాఖీ పున్నమి, నార్లీ పున్నమి, రక్షాబంధనం, సౌవతి పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు. సోదరీమణులు ఈ రోజున సోదరులకు రాఖీ కట్టి కానుకలందుకుంటారు.  

భాద్రపద పూర్ణిమను ‘ఇంద్ర పౌర్ణమాసి’, ‘మహాభాద్రి’ అని పిలుస్తారు. దిక్పాల పూజ, ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, వరుణ వ్రతం, అశోక దాత్ర వ్రతం, సావిత్రీ వ్రతం ఈరోజున చేస్తారు.

ఆశ్వయుజ మాస పూర్ణిమను కుమార పౌర్ణమాసి, మహాశ్విని, కౌముదీ పూర్ణిమ, గొంతెమ్మ పండగ, కోజాగరీ పూర్ణిమ, అక్షక్రీడ పేర్లతో పిలుస్తారు.  

కృత్తికా నక్షత్రంతో వచ్చేది కార్తిక పౌర్ణమి. హరిహరులకు, సుబ్రహ్మణ్య స్వామికి, పార్వతికి, లలితా త్రిపుర సుందరికి అత్యంత ప్రీతికరమైన పర్వడి. శైవ వైష్ణవులకు పావనమైనది. సోమకాసుర సంహారం కోసం శ్రీహరి మత్స్య రూపం దాల్చింది ఈ రోజునే! త్రిపురాసుర వధ జరిగిన ఈ రోజున వనితలు 720 వత్తులతో దీపం వెలిగిస్తారు. జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఉసిరిక చెట్టు కింద దామోదరుడి (విష్ణువు) విగ్రహం ఉంచి ఆరాధిస్తారు.

మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి, నరక పూర్ణిమ, దత్తజయంతి అని పిలుస్తారు. పుష్యమీ నక్షత్రంతో కూడిన పున్నమిని ‘పౌషి పూసమ్‌’, హిమశోధన పూర్ణిమ అని పిలుస్తారు. ఈనాటి సముద్ర స్నానం సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని కొందరి విశ్వాసం. మఘ నక్షత్రయుక్త పూర్ణిమ మాఘ పూర్ణిమ. ‘మహామాఘి’ అనీ పిలుస్తారు. పూర్ణిమలన్నింటిలోనూ ఇది మహిమాన్వితమైందని చెబుతారు. రామకృష్ణ పరమహంస జన్మించింది ఈరోజునే.

ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, హుతాశని పూర్ణిమ, డోలా పూర్ణిమ అన్న పేర్లతో పిలుస్తారు. కల్యాణ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, శయనదాన వ్రతం, శశాంక పూజ... వేర్వేరు ప్రాంతాల్లో జరుపుకొంటారు. ఇలా ప్రతి పున్నమిలో ప్రత్యేకతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమాన్వితమైన పుణ్యప్రద ఫలితాలు తెలుసుకుని తదనుసారం ఆచరించడమే మన విధి, పరమావధి.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని