నత్తకు నేర్పిన నడకలివి!

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో రహదారులకు మహర్దశ రానుంది. రూ.6,400 కోట్లతో దాదాపు 3,100 కి.మీ. మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలగనుంది.

Published : 25 Jul 2023 04:44 IST

ఎన్‌డీబీ ప్రాజెక్టు రహదారులు, వంతెనల పనుల్లో తీవ్ర జాప్యం
రెండోదశకు రెండేళ్లుగా పరిపాలన అనుమతి ఇవ్వని జగన్‌ సర్కారు
రాష్ట్ర వాటా చెల్లించలేకపోవడమే కారణమా?
ఈనాడు - అమరావతి

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో రహదారులకు మహర్దశ రానుంది. రూ.6,400 కోట్లతో దాదాపు 3,100 కి.మీ. మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలగనుంది. ఈ నిధులతో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రహదారుల బాగుకు ప్రాధాన్యమిస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న 676 వంతెనల స్థానంలో కొత్తవి నిర్మిస్తాం.

 2019, నవంబరు 4న ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.


ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం అంటూ ఎన్నికల ప్రచారంలో హామీలపై హామీలు గుప్పించారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల అధికారులతో సమీక్షల్లో అలా చేస్తాం.. ఇలా చేస్తాం అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాను చెప్పిన మాటలనే కాదు.. చేసిన సమీక్షలనూ మర్చిపోతున్నారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఎన్‌డీబీ రుణంపై సమీక్ష జరిగి మూడేళ్ల ఎనిమిది నెలలు గడిచినా పనులు నత్తతో పోటీపడుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చేసిన హడావుడి.. రాష్ట్ర వాటా చెల్లించాల్సిన సమయానికి చల్లబడిపోయింది.


మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడం.. మధ్యలో ఉన్న వంతెనల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం రూ.6,400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) అనే విదేశీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.4,480 కోట్లు (70 శాతం) ఎన్‌డీబీ రుణం కాగా, రూ.1,972 కోట్లు (30 శాతం) రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక రుణం మంజూరైంది. దీంతో ఆయా రహదారులకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. రెండు దశలుగా పనులు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 2021లో చేపట్టిన మొదటి దశలో 1,244 కి.మీ. విస్తరణ, 204 వంతెనల నిర్మాణం ఇప్పటికి 20 శాతం కూడా పూర్తికాలేదు.


పనులకు మోక్షమెప్పుడో!?

రెండో దశ కింద 13 ఉమ్మడి జిల్లాల్లో 1,267.56 కి.మీ.ల రహదారుల విస్తరణ, 253 వంతెనల నిర్మాణ పనులను ప్రతిపాదించారు. వీటికి రూ.3,386.14 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,016 కోట్లు కాగా.. మిగిలింది ఎన్‌డీబీ రుణంగా ఇస్తుంది. ఇందుకోసం ఆర్‌అండ్‌బీ అధికారులు జిల్లాల వారీగా 119 రహదారులను ఎంపిక చేసి, 2021 ఆగస్టులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు పరిపాలన అనుమతి ఇచ్చాకే టెండర్లు నిర్వహించి, గుత్తేదారులకు పనులు అప్పగించే వీలుంటుంది. కానీ దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ దస్త్రంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రవాటా కింద రూ.1,016 కోట్లు సమకూర్చడం కష్టమేనని గతంలో ఆర్థికశాఖ అధికారులు.. ఆర్‌అండ్‌బీ అధికారుల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు ఈ ప్రతిపాదనలు పంపి రెండేళ్లు అవుతుండటంతో.. అంచనా వ్యయాలు పెరిగిపోతాయని, దీంతో రాష్ట్ర వాటా మొత్తం కూడా పెరుగుతుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మొదటి దశ పనులే నత్తనడకన సాగుతుండగా, ఇక రెండో దశకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని