సమస్యపై ప్రశ్నిస్తే నెట్టేశారు.. వివాదాస్పదమైన మంత్రి నాగార్జున తీరు

సమస్యపై ప్రశ్నించిన వ్యక్తిని చేతితో నెట్టేసిన రాష్ట్ర మంత్రి నాగార్జున తీరు వివాదాస్పదమైంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెంలో ఆదివారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Published : 31 Oct 2023 07:44 IST

చుండూరు, న్యూస్‌టుడే: సమస్యపై ప్రశ్నించిన వ్యక్తిని చేతితో నెట్టేసిన రాష్ట్ర మంత్రి నాగార్జున తీరు వివాదాస్పదమైంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెంలో ఆదివారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఒకటో వార్డులో మంత్రి ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో స్థానికుడు వట్టిప్రోలు మోహన్‌రావు తాను ఇంటిపన్ను రూ.2,500 చెల్లిస్తున్నానని, మురుగునీరు పోయేందుకు డ్రైనేజీ లేకపోవడంతో ఇంటి ముందు నిల్వ ఉంటోందని, ఎత్తిపోసుకోవాల్సి వస్తోందని తెలిపారు. అందుకు పక్కనే ఉన్న ఓ వైకాపా నాయకుడు స్పందిస్తూ.. తెదేపా నేత, మాజీ మంత్రి ఆనందబాబును అడుగు అంటూ వారించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతావేంటని మోహన్‌రావు ఎదురు ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఆనందబాబు రూ.7 కోట్లతో గ్రామంలో 3.5 కిలోమీటర్ల రోడ్లు వేయించారని, మీరు వచ్చాక ఏం చేశారని నిలదీశారు. దీంతో మంత్రి ఆయన్ను చేతితో పక్కకు నెట్టి ముందుకు వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో జి.చంటి, వై.వెంకటస్వామి, బి.వెంకటరెడ్డి తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు పత్రాలిచ్చారని మంత్రిని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని