సర్కారులో జీతం... పార్టీలో సేవాగీతం

ఈ ఫొటోలో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డితోపాటు ఉన్న వ్యక్తి పేరు పి.హేమంత్‌కుమార్‌రెడ్డి.

Updated : 22 Mar 2024 09:00 IST

ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు
కాంట్రాక్టు, పొరుగు సేవల కింద నియామకాలు
ఏనాడూ విధులకు హాజరవని వైనం
పార్టీ కార్యక్రమాల్లో వీరిదే చురుకైన పాత్ర
నాలుగైదేళ్లుగా జీతాలిస్తున్న అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డికి ఇవేవీ తెలియదా?
ఈనాడు - అమరావతి

ఈ ఫొటోలో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డితోపాటు ఉన్న వ్యక్తి పేరు పి.హేమంత్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడాయన. కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి పార్టీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తీరికలేకుండా ఉంటున్నాడు. ఈనెల 2న చిత్తూరులో జరిగిన సమావేశంలో విజయానందరెడ్డితోపాటు కలిసి పాల్గొన్నప్పటి చిత్రమిది. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఏ రోజైనా ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైన దాఖలాల్లేవు. కానీ, నాలుగైదేళ్లుగా నెలకు రూ.70 వేల జీతాన్ని పొందుతున్నాడు. ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు.


ఐదేళ్లలో ఆంధ్రావనిని అయోమయంగా... అర్ధంపర్థంలేని విధంగా ఏలిన జగనన్న సర్కారు పొరుగు సేవల ఉద్యోగానికీ... ఏ నిఘంటువులో లేని కొత్త నిర్వచనం ఇస్తోంది!
జీతం సర్కారులో తీసుకొని... పని మాత్రం సొంతింట్లో చేస్తే దాన్నేమంటారు? మీరేమైనా అనుకోండి... మేం మాత్రం పొరుగు సేవలంటాం అంటోంది!
లక్షల మంది యువత ఐదేళ్లుగా కొలువుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే... అనర్హులకు... అస్మదీయులకు సిఫార్సులపై నిస్సిగ్గుగా... నిర్లజ్జగా... సర్కారు సంస్థలో కొలువులిచ్చి... వైకాపాలో పనిచేయించుకుంటున్న జగనన్న సర్కారు నిర్వాకాన్ని తిలకించండి మరి!

ఈ చిత్రంలో సీఎం జగన్‌ సిద్ధం పోస్టర్‌లో ఉన్నది యారా సాయిప్రశాంత్‌. అతను వైకాపా నేతనో, కార్యకర్తనో అనుకుంటే పొరపడినట్లే. అతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో అసిస్టెంట్‌ మేనేజర్‌. జీతం రూ.30 వేలు, అదనపు భత్యం రూ.30 వేలు, హెచ్‌ఆర్‌ఏ కలిపి ప్రతినెలా రూ.70 వేల వరకు పొందుతున్నాడు. ఇంత జీతమిచ్చి, అసిస్టెంట్‌ మేనేజర్‌గా తీసుకున్నారంటే ఆయన ఎంబీయే, పీజీ చేసుంటారని అనుకునేరు... చదివింది ఇంటర్‌ మాత్రమే. పోనీ, నిత్యం విధులకైనా హాజరవుతాడా అంటే... సంస్థ ప్రధాన కార్యాలయంలో అతన్ని చూసిన వారే లేరు. ఎప్పుడూ సీఎం కార్యాలయంలోనో, వైకాపా రాష్ట్ర కార్యాలయంలోనో ఉంటూ... పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంటాడు. అయినా సరే ఏపీఎండీసీ 2020 మే నుంచి అతన్ని పొరుగు సేవల ఉద్యోగిగా చూపుతూ జీతం ఇస్తోంది.

సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలకు చెందిన తిరుపతి కార్యాలయంలో బీఆర్‌ తేజేష్‌రెడ్డి పనిచేస్తున్నాడు. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో నాలుగైదేళ్ల కిందట మేనేజర్‌గా నియమితుడయ్యాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి... తిరుపతిలో మంత్రి, ఎంపీలకు సంబంధించిన వ్యవహారాలను చూడటమే ఆయన విధి. ఏపీఎండీసీకి పనిచేసిన దాఖలాల్లేవు. అయినా సరే తేజేష్‌రెడ్డికి ఏపీఎండీసీ నుంచి ప్రతినెలా రూ.70 వేల వరకు జీతం అందుతోంది.


ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు పునరావాస కేంద్రంగా మారింది. వీరంతా వివిధ కేడర్లలో పని చేస్తున్నట్లు ఏపీఎండీసీ రికార్డుల్లో ఉంది. వీళ్లు మాత్రం వైకాపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఏపీఎండీసీ ఉద్యోగులుగా చూపించి, సంస్థ నుంచి నాలుగైదేళ్లలో లక్షల రూపాయల జీతాలు చెల్లించారు. దీనికి సంస్థ ఉన్నతాధికారులు సహకరిస్తూ ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్నారు. మొత్తానికి జగన్‌ ప్రభుత్వం   వచ్చాక ఏపీఎండీసీ.. వైకాపా ఎండీసీగా మారిపోయింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే అధికం

మంత్రి, ఎంపీల సిఫార్సులతో చేరిన ఉద్యోగుల్లో 80% ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే. కడప ఎంపీ సిఫార్సుతో మరో 10% మంది వైయస్‌ఆర్‌ జిల్లా వారు వచ్చారు. మిగిలిన పది శాతమే ఇతర జిల్లాల వారు. ఏపీఎండీసీకి అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేటలోని ముగ్గురాయి గనుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. ఈ గనుల కోసం భూములు కోల్పోయిన వారికి, సమీప గ్రామాల్లోని అర్హులకే ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ, ఈ ప్రాంతంతో సంబంధం లేని ఉమ్మడి చిత్తూరు జిల్లా వారికి అత్యధికంగా అవకాశమిచ్చారు. ఇదేమిటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇలా సిఫార్సుల ఆధారంగా నియామకాలు ఎన్నికల కోడ్‌ వచ్చే రోజు వరకు కొనసాగాయి. తాజాగా కాంట్రాక్టు విధానంలో ఈనెల 14, 15 తేదీల్లో ఎనిమిది మందిని... మంగంపేట గనుల్లోకి, ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలోకి తీసుకోవడం గమనార్హం.

సిఫార్సు స్థాయికి అనుగుణంగా జీతం

ఏదైనా సంస్థలోకి ఉద్యోగులను తీసుకున్నప్పుడు వారి విద్యార్హత, చేసే పని స్థాయి, అనుభవాన్ని బట్టి జీతం నిర్ణయిస్తారు. ఏపీఎండీసీలో మాత్రం... సిఫార్సు చేసిన నేత స్థాయికి అనుగుణంగా ఉద్యోగికి జీతభత్యాలు ఖరారు చేయడం గమనార్హం. ఇంటర్‌ అర్హతతో కొందరిని ఆఫీస్‌ సబార్డినేట్లుగా, అటెండర్లుగా తీసుకున్నారు. యారా సాయిప్రశాంత్‌ లాంటి వారికి విద్యార్హత ఇంటర్‌ మాత్రమే అయినప్పటికీ ఏకంగా అసిస్టెంట్‌ మేనేజర్‌గా పోస్టును కట్టబెట్టి రూ.70 వేల వరకు జీతం ఇస్తుండటం విస్తుగొలుపుతోంది.


అధికార పార్టీకి... ద్వివేది, వెంకటరెడ్డి దాసోహం

గనుల శాఖకు ఇన్‌ఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నాలుగున్నరేళ్లుగా ఉన్నారు. మధ్యలో కొంతకాలం ఏపీఎండీసీ ఛైర్మన్‌ హోదాలోనూ కొనసాగారు. ఏపీఎండీసీకి ఇన్‌ఛార్జి ఎండీగా గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి దాదాపు నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నారు. సంస్థలో ఉద్యోగులుగా నమోదై... వైకాపా సేవలో తరిస్తున్న వారి తీరుపై ఈ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, కీలక మంత్రి ఏది చెబితే దానికి తలూపుతూ సంస్థకు ఆర్థికంగా నష్టం కలిగేలా ఈ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు... ఎంతకాలం నుంచి, ఏ హోదాలో, ఏం చేస్తున్నారు... ఉద్యోగానికి రాకున్నా విధులకు హాజరైనట్లు ఎలా నమోదు అవుతోందనే అనేక ప్రశ్నలకు సమాధానాలు జగనెరిగిన... జగమెరిగిన సత్యాలే కదా...!


మంత్రి, ఎంపీ సిఫార్సులతో 400 మందికి చోటు

వైకాపా ప్రభుత్వం ఏర్పడగానే ఏపీఎండీసీని వైకాపా నేతలు, కార్యకర్తలకు పునరావాస కేంద్రంగా మార్చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల సిఫార్సుతో ఈ సంస్థలోకి 400 మందిని కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులుగా తీసుకున్నారు. అసలంత మంది అవసరం లేకపోయినా... మంత్రి సిఫార్సంటూ కొత్త పోస్టులను సృష్టించారు. వీరిలో 200 మంది విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు. చాలామందికి ఎలాంటి పనీ ఉండదు. దాంతో ఒకరు చేయాల్సిన పనిని ముగ్గురు, నలుగురు పంచుకొని తామేదో చేస్తున్నట్లు చూపేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు అసలు కార్యాలయానికే రారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని