ఎవరి ఆధీనంలో ఎవరు?

ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది.

Updated : 28 Apr 2024 09:22 IST

ఎన్నికల సంఘం చెప్పినట్లు సీఎస్‌ వినాలా?
సీఎస్‌ చెప్పినట్లు ఎన్నికల సంఘం వినాలా?
లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పింఛన్లివ్వాలని ఈసీ సూచన
ఇళ్ల వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలేవి?

ఈనాడు, అమరావతి: ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం, అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. సీఎస్‌ సహా ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. సీఎస్‌ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన ఈసీ చోద్యం చూస్తూ కూర్చుంది. దాంతో ఏప్రిల్‌ మొదటివారంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. అయినా ఈసీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మే నెల దగ్గర పడుతున్నా పింఛన్ల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు లేవు. మే నెలలోనైనా ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఈసీ ఇప్పటికీ ఎందుకు స్పష్టమైన ఆదేశాలివ్వట్లేదు? అంతకుముందు నెల వరకూ కొనసాగిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగించాలని ఎందుకు సీఎస్‌కు చెప్పట్లేదు? ఇలాగే ఉంటే ఈసారి కూడా ఏప్రిల్‌ పరిస్థితులే పునరావృతం కావా?

ఎన్నికల సంఘం నిర్దిష్టంగా ఆదేశాలివ్వలేదా?

‘‘ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన లబ్ధిని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేదా ప్రభుత్వోద్యోగుల ద్వారా పంపిణీచేయాలని మార్చి 30న ఆదేశాలిచ్చాం. అయితే వివిధ పథకాల (పింఛన్లు సహా) పంపిణీ సక్రమంగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, పంపిణీ ప్రక్రియ మారడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టండి’’ అని ఎన్నికల సంఘం ఈ నెల 26న సీఎస్‌కు లేఖ రాసింది. ఏప్రిల్‌ మొదటివారంలో పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం ఈసీ దృష్టిలో ఉంది. అలాంటప్పుడు కచ్చితంగా లబ్ధిదారుల ఇంటివద్దకే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ నిర్దిష్టంగా ఎందుకు సీఎస్‌కు ఆదేశాలివ్వట్లేదు? తమ ఆదేశాలను యథాతథంగా అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరించట్లేదు? ఇంకా చెప్పాలంటే ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌ఓపీ)ని ఖరారు చేసి తదనుగుణంగా పంపిణీచేయాలని కచ్చితమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఏదో సీఎస్‌కు సలహా ఇచ్చినట్లు, సూచించినట్లు చెప్పడమేంటి? అంటే సీఎస్‌ ఆధీనంలో ఈసీ పనిచేయాలా?

ఆదేశాల స్ఫూర్తిని పాటించట్లేదని తేటతెల్లమవుతుంటే.. మళ్లీ అదే మాటలా?

నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించే ఏ అధికారైనా ఈసీ ఆదేశాల స్ఫూర్తిని తీసుకుంటే.. అంతకుముందు నెల వరకూ కొనసాగినట్లే ఇంటివద్దకే పింఛన్లను పంపిణీ చేయించాలి. కానీ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే వెళ్లి పింఛన్లు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. మండుటెండల్లో, వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, వితంతువుల్ని, అభాగ్యుల్ని సచివాలయాల వద్దకు రప్పించారు. దానికి విపక్షాలే కారణమనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా అధికార వైకాపాకు రాజకీయ ప్రయోజనం కలిగించాలనే కుట్రతోనే ఇలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశాయి. కనీసం మే నెల పింఛను అయినా ఇంటి వద్దే అందేలా ఆదేశాలివ్వాలని ప్రతిపక్షాలు వినతులిచ్చాయి. అంటే ఈసీ ఆదేశాల స్ఫూర్తిని సీఎస్‌ పట్టించుకోలేదని తేటతెల్లమైపోతోంది కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని