వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!

అధికారంలోకి రావడానికి జగన్‌ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు.

Updated : 28 Apr 2024 06:33 IST

పోలీసుల ‘వీక్లీ ఆఫ్‌’కు జగన్‌ నిరవధిక విశ్రాంతి
హడావుడిగా జీవో ఇచ్చి... అంతే వేగంగా అమలు విస్మరణ
అవసరమైన 12,384 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి మంగళం
పైగా పోలీసులపై అదనపు భారం మోపిన సీఎం
ఈనాడు, అమరావతి

ధికారంలోకి రావడానికి జగన్‌ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. తీరా అధికారం దక్కించుకున్నాక రివర్స్‌ పాలన ప్రారంభించి, నమ్మిన ఓటర్లకు చుక్కలు చూపించారు. అలాంటి బాధిత వర్గంలో పోలీసులూ ఉన్నారు. వారాంతపు సెలవుపై ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీని వారు నమ్మారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో... దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. బిహార్‌లో గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదని, తన పాలనలో వీక్లీ ఆఫ్‌లను కచ్చితంగా కొనసాగిస్తామంటూ ఊదరగొట్టారు.

మూణ్నాళ్ల ముచ్చటే...

కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ వారానికి ఒక రోజు సెలవు కల్పించేలా 2019 జూన్‌ 19 నుంచి వైకాపా ప్రభుత్వం ‘‘వీక్లీ ఆఫ్‌’’ను అమల్లోకి తెచ్చింది. అప్పటి శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానాన్ని 19 రకాలుగా అమలు చేయడం మొదలుపెట్టింది. తమకిచ్చిన హామీ నెరవేర్చారంటూ పోలీసు అధికారుల సంఘాలు జగన్‌కు, ఉన్నతాధికారులకు సన్మానాలు, సత్కారాలు చేశాయి. మొదట్లో నాలుగైదు నెలలపాటు సక్రమంగానే ఈ విధానం అమలైనా... ఆ తర్వాత గాడి తప్పింది. 2020 మార్చిలో కొవిడ్‌ పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు తర్వాత ‘‘వీక్లీ ఆఫ్‌’’ల విధానం నిలిచిపోయింది. ఆ తర్వాతైనా అమలు చేస్తారని పోలీసు సిబ్బంది భావించినప్పటికీ జగన్‌ ప్రభుత్వం దానికి స్వస్తి పలికింది. సీఎం హామీ అమలు తీరును నెలకోసారి సమీక్షిస్తామని చెప్పిన అధికారులు పట్టించుకోవడమే మానేశారు.

చిత్తశుద్ది ఏదీ?

ప్రతిపక్ష నేతలపై, తనకు గిట్టని వారిపై పోలీసులను అదేపనిగా ప్రయోగించే జగన్‌.. వారి ఆరోగ్యాలను కాపాడటానికి విశ్రాంతి సమయం ఇవ్వాలనే విషయాన్ని పూర్తిగా మరచిపోయారు. పోలీసులు, వారి కుటుంబాలపై మొదట్లో కురిపించిన ప్రేమ... ఆ తర్వాత కనిపించలేదు. వారాంతపు సెలవుల విధానంపై నెలల వ్యవధిలోనే చేతులెత్తేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనం. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే పోలీసులకు వారాంతపు సెలవు విధానాన్ని తీసుకొస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. తనకు దక్కాల్సిన సన్మానాలు, పొగడ్తలు వచ్చేశాక... తూచ్‌ అనేశారు. అనంతరం దీనిపై సమీక్షించేందుకు ఆయనకు ఒక్కరోజు కూడా తీరికదొరకలేదు.

ప్రతిపక్ష నేతగా మానవత్వం ఒలకబోత  

పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తాం. పిల్లలతో ఉన్న వారికి వారంలో ఒక్క రోజైనా సెలవు లేకపోతే ఎలా? వాళ్లు కుటుంబంతో ఇంకెప్పుడు గడుపుతారు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? 365 రోజులూ విధి నిర్వహణలోనే ఉంటే కుటుంబం మంచి చెడ్డల పరిస్థితేంటి? మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారంలో ఒకరోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇస్తాం.

పీఠమెక్కాక రివర్స్‌...!

జగన్‌ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వారాంతపు సెలవును మూణ్నాళ్ల ముచ్చటగా చేసి... తన మ్యానిఫెస్టో హామీని అటకెక్కించేశారు. ‘‘కొంచెమైనా మానవత్వంతో ఆలోచించాలి కదా’’ అంటూ ప్రతిపక్ష నేతగా ప్రేమ   ఒలకబోసిన వ్యక్తే... సీఎం పీఠం ఎక్కాక  గజనీలా అన్నీ మర్చిపోయారు. పైగా గత   ప్రభుత్వాలకు భిన్నంగా వారిపై అంతులేని   పని భారాన్ని మోపారు.


నియామకాలను గాలికి వదిలేసి...

పోలీసులకు పూర్తిస్థాయిలో వారాంతపు సెలవులు అమలు కావాలంటే తమ శాఖలో ఖాళీగా ఉన్న 12,384 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని... రవిశంకర్‌ అయ్యన్నార్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాంతో రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని, ఏటా డిసెంబరులో ఖాళీలను గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్‌ విడుదల చేస్తామని 2020 అక్టోబరు 21న అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం జగన్‌ గొప్పగా ప్రకటించారు. కానీ, ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 411 ఎస్సై ఉద్యోగాలు మినహా ఒక్కటంటే ఒక్క పోలీసు కానిస్టేబుల్‌ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో ఖాళీలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడింది. ఒత్తిడి రెండింతలు పెరిగింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, నాయకులపై కాలు కదిపితే కేసు... నిరసన తెలిపితే అరెస్టు అన్నట్లుగా వేధించింది. పోలీసులు నిరంతరం రోడ్లపైనే ఉండేలా చేసింది. ప్రతిపక్ష నేతల గృహనిర్బంధాలు, అణిచివేత చర్యల్లో పోలీసులను తలమునకలు చేసింది. వారిని రోడ్లపై పెట్టిన జగన్‌ వారాంతపు సెలవు హామీని గాలికి వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని