Life Insurance: జీవిత బీమా విషయంలో 5 అపోహలు.. మీకూ ఉన్నాయా?

Life Insurance Myths: ఆపద సమయంలో ఆదుకునే జీవిత బీమా విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. దీంతో ఇప్పటికీ జీవిత బీమా పాలసీలకు దూరంగా ఉంటున్నారు. ఆ అపోహలు మీకూ ఉన్నాయా?

Published : 23 Mar 2023 11:55 IST

Top 5 Myths about Life Insurance | సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే ఇంటిల్లిపాదీ ఆర్థికంగా ఇబ్బంది పడాలి. అప్పటి వరకు ఎంతో హుందాగా జీవితం సాగించిన ఆ కుటుంబం ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు జీవిత బీమా (Life Insurance) ఉపయోగపడుతుంది. అంతేకాదు పిల్లల చదువులు, వివాహాలు వంటి పెద్ద పెద్ద అవసరాలను సైతం తీరుస్తాయి. దురదృష్టవశాత్తూ జీవిత బీమా విషయంలో ప్రజల్లో ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. అలా సమాజంలో జీవిత బీమా పట్ల ఉన్న 5 అపోహల గురించి చర్చిద్దాం..

1. వయసు / అనారోగ్య సమస్యలు

వయసు మీరిందనో, ముందు నుంచీ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయన్న కారణంతో బీమా పాలసీ తీసుకోవడానికి అనర్హులమనే భావనతో చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కొన్ని పాలసీలకు మాత్రమే వయసు అనేది అడ్డంకి. ఒకవేళ మీ వయసు మీరినప్పటికీ యాన్యుటీలను కొనుగోలు చేయొచ్చు. ఇక ముందు నుంచీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సైతం టర్మ్‌ పాలసీలను తీసుకోవచ్చు. వయసు ఆధారంగా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పాలసీలను రూపొందిస్తారు. అందుకు అనుగుణంగానే ప్రీమియం ధర ఉంటుంది. ఒకవేళ హై రిస్క్‌ జబ్బులు ఉంటే అదే స్థాయిలో ప్రీమియం సైతం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిశ్చింతగా బీమా తీసుకోవచ్చు.

2. జీవిత బీమాతో పోలిస్తే ఇతర పెట్టుబడులే నయం!

జీవిత బీమా కంటే ఇతర పెట్టుబడి సాధనాల్లో మదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందన్నది చాలా మంది భావన. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌ను.. దానిలోని విడి భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేసి స్మార్ట్‌ఫోన్‌తో ఎలా పోల్చలేమో జీవిత బీమా విషయంలోనూ అంతే! స్మార్ట్‌ఫోన్‌లో ఎలాగైతే వివిధ రకాల ఫీచర్లు ఉంటాయో.. మరణం, తీవ్ర అనారోగ్యం, రాబడికి హామీ, జీవిత బీమా వంటి రకరకాల ఫీచర్లు జీవిత బీమాలో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క ఫీచర్‌తో బీమాను పోల్చడం సరికాదు. కాబట్టి జీవిత బీమాను ఏ దృష్టితో చేస్తున్నామనేది ముందుగా స్పష్టత ఉండాలి. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే కొన్ని జీవిత బీమా పాలసీలు ట్యాక్స్‌ పరిధిలోకి రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

3.యులిప్‌ ధర చాలా ఎక్కువ!

యూనిట్‌ లింక్డ్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్లను యులిప్‌లుగా వ్యవహరిస్తారు. బీమాతో పాటు దీర్ఘకాలంలో సంపదను కూడగట్టేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. కానీ ఈ తరహా పాలసీలు ఎక్కువ ప్రీమియంతో వస్తున్నాయని చాలా మందిలో ఉన్న భావన. వాస్తవానికి కొత్తగా వస్తున్న యులిప్స్‌ చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. మెచ్యూరిటీ సమయంలో పాలసీ వ్యవధిలో చెల్లించిన ఇతర ఛార్జీలను కూడా వాపసు చేస్తున్నాయి. ఈ పాలసీలను మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకే పాలసీ ద్వారా డెట్‌, ఈక్విటీ ఫండ్లకు మారే వెసులుబాటు ఉంది. పన్ను మినహాయింపుతో వివిధ పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసేందుకు ఈ పాలసీ వీలు కల్పిస్తుంది. లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ముగిశాక పాక్షిక క్యాష్‌ విత్‌డ్రాలకూ అవకాశం ఉంది.

4. పాలసీ ఒక్కరి పేరుమీదే తీసుకోగలం!

ఒక్కరి పేరు మీద మాత్రమే పాలసీ తీసుకోగలరనేది ఇంకో అపోహ. స్థిర ఆదాయం కలిగిన వారు ఎవరైనా జీవిత బీమా పాలసీ తీసుకోవచ్చు. వ్యక్తితో పాటు జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీద కూడా పాలసీ తీసుకోవచ్చు. కొన్ని ఇన్సురెన్స్‌ సంస్థలు జీవిత భాగస్వామితో పాటు, పిల్లలతో కలిసి జాయింట్‌ పాలసీ తీసుకునే సదుపాయాన్నీ కల్పిస్తున్నాయి. ఒకవేళ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం మైనర్లయిన పిల్లల పేరు మీద పాలసీని తీసుకుంటే వారికి 18 ఏళ్లు నిండాక ఆ పాలసీ వారి పేరు మీదకు మారుతుంది.

5. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమయంలో కొర్రీలు!

పాలసీ కట్టడం, ప్రీమియం చెల్లింపు మాట అటుంచితే.. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమయంలో బీమా సంస్థలు కొర్రీలు పెడుతుంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంటాయి. పాలసీ తీసుకునే సమయంలో సరైన వివరాలు ఇవ్వడం, సరైన సమయానికి బీమా చెల్లించడం వంటివి చేస్తే క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా ఇప్పుడు అన్ని సంస్థలూ దాదాపు అన్ని డిజిటల్‌ బాటలో పడుతున్న నేపథ్యంలో సెటిల్‌మెంట్‌ ప్రక్రియ నానాటికీ సులభతరం అవుతోంది.

చివరిగా: సమాజంలోని ఒక్కో కుటుంబ అవసరాలు ఒక్కో రీతిన ఉంటాయి. కాబట్టి వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తీసుకోవాలి. ఒకరికి సూట్‌ అయ్యే పాలసీలు ఇంకొకరికి సూట్‌ కావు. కాబట్టి జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు బీమా సలహాదారును సంప్రదించడం ఉత్తమం. అలాగే, పాలసీ ఎంచుకునే సమయంలో వేర్వేరు సంస్థలు అందించే పాలసీ ప్రీమియం వివరాలను ఆన్‌లైన్‌లో పోల్చుకోవడం మంచి నిర్ణయం. అపోహలు పక్కన పెట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పాలసీని తీసుకోవడం అన్నింటికంటే తెలివైన నిర్ణయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని