ITR filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ఈ తప్పులు చేయొద్దు..!

ITR filing: ఆడిట్‌ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం..

Updated : 10 Jun 2024 16:38 IST

ITR filing | ఇంటర్నెట్‌ డెస్క్‌: పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు (ITR) చేసే సమయం ఆసన్నమైంది. సరైన అవగాహన లేకపోయినా లేదా నిపుణుల సహాయం లేకుండా ఐటీఆర్‌ సమర్పించడం కొంత కష్టమైన విషయమే. చాలామంది జాగ్రత్తగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ, గడువు సమీపిస్తున్న తరుణంలో తొందర్లో ఒక్కోసారి పొరపాట్లు చేసేస్తుంటారు.

ఐటీఆర్‌లో చేసే తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. రివైజ్డ్‌ రిటర్నుల దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ఇది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈనేపథ్యంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకునేందుకు ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

సరైన ఫారం..

కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT) ఇప్పటికే ఏడు రకాల ఐటీ ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో మీకు ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. రూ.50లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ తదితర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్‌-1 దాఖలు చేయొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్‌-4ను ఎంచుకోవచ్చు. ఐటీఆర్‌-2ను రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉండి, ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు దాఖలు చేయాలి. వృత్తి నిపుణులు, ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్‌-3ని ఎంచుకోవచ్చు. షేర్లలో క్రయవిక్రయాలు చేసినప్పుడు మీరు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్‌-2 లేదా ఐటీఆర్‌ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.

బ్యాంకు ఖాతా ధ్రువీకరణ..

పన్ను చెల్లింపుదారులంతా ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ముందుగానే తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ట్యాక్స్‌ పేయర్ల ఖాతా యాక్టివ్‌గానే ఉందని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.

ఇంటి రుణం తొందరగా తీర్చేద్దాం

ఐటీఆర్‌ ఈ-వెరిఫై..

ఐటీఆర్‌ దాఖలు చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్‌ అప్‌లోడ్‌ చేసిన 30 రోజుల్లోగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది.

మినహాయింపులు..

ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్‌ 80సీ ప్రధానం. నిబంధనల ప్రకారం ఈ సెక్షన్‌ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్‌ పరిధిలోకే వస్తాయి. సెక్షన్‌ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. సేవింగ్స్‌ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్‌ఆర్‌ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా కోసం అన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులను రిటర్నులలో సరిగ్గా పేర్కొనాలి.

ఇతర ఆదాయాలు..

చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. వడ్డీ, కమిషన్‌ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్‌ కట్‌ చేసి ఉంటారనే ఉద్దేశంతో అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని పేర్కొనాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఆలస్యం..

ఐటీఆర్‌ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్‌ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

టీడీఎస్‌ జమ..

కొన్నిసార్లు ఆదాయపు పన్ను దగ్గర ఉన్న వివరాలకూ, మీ ఫారం-16కూ సరిపోకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లను పూర్తిగా పరిశీలించండి. ఏదైనా తేడా ఉంటే మీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోండి. పొరపాట్లతో రిటర్నులు సమర్పిస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆదాయాలన్నీ..

ఐటీఆర్‌ దాఖలు చేసేటప్పుడు అన్ని ఆదాయాలనూ తప్పనిసరిగా నివేదించాలి. కొంతమంది కొన్ని ఆదాయాలను పేర్కొనరు. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఆదాయపు పన్ను శాఖ దీన్ని గుర్తిస్తే నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. చాలామంది వ్యక్తులు తమ వేతనాన్ని మాత్రమే నమోదు చేస్తారు. బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీల నుంచి వచ్చిన ఆదాయం, పీపీఎఫ్‌ వడ్డీలను పట్టించుకోరు. మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలనూ రిటర్నులలో చూపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. మైనర్‌ పిల్లల పేరుతో పెట్టుబడులు ఉండి, వాటి ద్వారా ఆదాయం వస్తుంటే.. ఆ మొత్తాన్నీ అసెసీ ఆదాయంలో భాగంగానే పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని