Bharati Airtel: వాయిస్‌, SMS ప్లాన్ల ధరల్ని మరోసారి సవరించిన ఎయిర్‌టెల్‌

Eenadu icon
By Business News Team Updated : 25 Jan 2025 13:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Bharati Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) తాజాగా తీసుకొచ్చిన వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ ప్లాన్లను మరోసారి సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో ప్లాన్లను అప్‌డేట్ చేసింది.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ ధర రూ.469. ఈ రీఛార్జితో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇవే ప్రయోజనాలతో ఇంతకుముందు ప్లాన్‌ ధర రూ.499గా ఉండేది. అంటే రూ.30 తగ్గించింది. ఎయిర్‌టెల్ మరో ప్లాన్‌ ధర రూ.1849. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇవే ప్రయోజనాలతో గతంలో తీసుకొచ్చిన రూ.1959 ప్లాన్‌ కంటే దీని ధర రూ.110 తక్కువ. ఈ రెండింటిపై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌ మెంబర్‌షిప్‌, హలో ట్యూన్స్‌ వంటి అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.

ట్రాయ్‌ ఆదేశాల మేరకు..

వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేకంగా ప్లాన్లను తీసుకొచ్చాయి. అయితే, వాటి ధరను మరింత తగ్గించాలని ట్రాయ్‌ సూచించిన నేపథ్యంలో.. ఎయిర్‌టెల్‌ తన ప్లాన్‌ ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర టెలికాం కంపెనీలైన జియో, వొడాఫోన్‌ ఐడియా సైతం ప్లాన్‌ ధరలను తగ్గించొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ట్రాయ్‌ తాజా నిర్ణయం టెలికాం కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :
Published : 25 Jan 2025 13:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు