Airtel: ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌.. ఎమర్జెన్సీలో వ్యాలిడిటీ లోన్‌!

Airtel Validity Loan: ఇప్పటివరకు డేటాను మాత్రమే అప్పుగా ఇచ్చిన ఎయిర్‌టెల్‌ ఇకపై వ్యాలిడిటీని కూడా లోన్‌గా ఇవ్వనుంది. ప్లాన్‌ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది.

Published : 22 Mar 2024 15:32 IST

Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఈ సంస్థ తాజాగా వ్యాలిడిటీ లోన్‌ను ప్రవేశపెట్టింది. యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అత్యవసరంగా దీన్ని యూజర్లకు అందిస్తుంది. కేవలం ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌లో భాగంగా యూజర్లు 1.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందొచ్చు. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే. బేస్‌ ప్లాన్ కాలపరిమితి ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి అత్యవసర సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఐవీఆర్‌ ప్రీకాల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదా యూఎస్‌ఎస్‌డీ కోడ్‌ *567*2# డయల్‌ చేసి వ్యాలిడిటీ లోన్‌ను పొందొచ్చు. లేదా గడువు ముగియగానే సీఎల్‌ఐ 56323 నుంచి వచ్చే మెసేజ్‌కు ‘1’తో రిప్లయ్‌ ఇచ్చి కూడా లోన్ కోసం అభ్యర్థించొచ్చు.

స్మార్ట్‌ డివైజ్‌తో మీ పనులు ఈజీ..ఇక ఫోన్‌ అక్కర్లేదేమో!

ఈ లోన్‌ను ఎయిర్‌టెల్‌ (Airtel) తర్వాత రీఛార్జ్‌ నుంచి రికవర్‌ చేసుకుంటుంది. కొత్త ప్లాన్‌లో ఒక రోజు గడువును తగ్గించడం ద్వారా రికవరీని చేపడుతుంది. రూ.115 నుంచి మొదలుకొని రూ.3,359 వరకు వివిధ రీఛార్జ్‌ ప్లాన్‌లలో ఈ వ్యాలిడిటీ లోన్‌ ఫెసిలిటీ ఉంటుంది. లోన్‌ తీసుకున్న తర్వాత దాన్ని రికవర్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకోకపోతే.. మరోసారి వ్యాలిడిటీ లోన్‌ తీసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఈ ఆఫర్‌ ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ సర్వీసు ఏరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని