ఆదాయపు పన్ను భారం కాకుండా...

మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టే ఉంటారు.

Published : 24 Mar 2023 00:43 IST

మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టే ఉంటారు. కేవలం పన్ను ఆదా చేసుకోవడమే లక్ష్యం కాకుండా.. ఎంచుకున్న పథకాలు దీర్ఘకాలంలో ఆర్థిక భరోసా కల్పించేలా చూసుకోవాలి. దీనికోసం ఉపయోగపడే మూడు ముఖ్యమైన పథకాల వివరాలు చూద్దాం...

రిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్ను తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలూ ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సెక్షన్‌ 80సీ. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ప్రధానంగా ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌), అయిదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా పాలసీల ప్రీమియం, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), పెద్దల పొదుపు పథకం (ఎస్‌సీఎస్‌ఎస్‌), ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌), గృహరుణం అసలు చెల్లింపు, ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ ఫీజు తదితరాలు ఈ సెక్షన్‌ కింద ఉంటాయి.

స్థిరమైన రాబడిని అందించే పథకాలు ద్రవ్యోల్బణ దృష్టితో చూసినప్పుడు పెద్దగా ఆదాయం ఉండదు. వీటి నుంచి వచ్చిన రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్‌ ఆధారిత పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు కాస్త నష్టభయం ఉంటుందన్నది వాస్తవం. ఇందులో ముఖ్యంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లాంటివి పరిశీలించవచ్చు. దీర్ఘకాలంలో వీటి వల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది. వచ్చిన రాబడిపైనా పన్ను భారం పెద్దగా ఉండదు.

యులిప్‌లు తీసుకుంటే..

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌). పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలం. సాధారణంగా ఇవి 15-20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ఎంత ప్రీమియం చెల్లించగలరు, వ్యవధి, వివిధ దశల్లో మీ అవసరాలు, తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని, వీటిని ఎంపిక చేసుకోవాలి.

* మీరు చెల్లించే ప్రీమియానికి కనీసం 10 రెట్ల వరకూ బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. 15-20 రెట్లు ఉంటే మరీ మంచిది. మీరు కోరుకున్న కవరేజీని అనుసరించి, ప్రీమియాన్ని మీ పెట్టుబడి నుంచి   మినహాయిస్తారు.

* వివిధ లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక యులిప్‌ ఎప్పుడూ మంచిది. పాలసీ వ్యవధి ముగిసే వరకూ ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్‌లు ఈక్విటీ, డెట్‌ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు 5-9 ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా వీటిని పరిశీలించవచ్చు. ఇందులో కొన్ని స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు ఉంటాయి. కొన్నింటిలో మల్టీ క్యాప్‌, థీమాటిక్‌ ఫండ్లూ అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌కు మారేందుకు కొన్ని నిబంధనలకు లోబడి ‘స్విచ్ఛింగ్‌’ అవకాశం ఉంటుంది.

* కనీసం 10-15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్‌లను తీసుకోండి. పెట్టుబడుల్లో డైవర్సిఫైడ్‌ ఫండ్లకే ప్రాధాన్యం ఇవ్వండి. లక్ష్యం సమీపిస్తున్నప్పుడు ఈక్విటీ ఫండ్ల నుంచి పెట్టుబడిని డెట్‌ ఫండ్లలోకి మార్చండి. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధ్యమైనంత వరకూ ఈ వెసులుబాటును వాడుకోవద్దు.

* వ్యవధి తీరిన తర్వాత క్రమానుగతంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మరింత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగేందుకు వీలవుతుంది.


పింఛను పథకంతో..

పన్ను ఆదాతోపాటు, పదవీ విరమణ తర్వాతా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) మంచి ఎంపిక. ఈ పథకాన్ని పింఛన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో ముందుగా పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకునేందుకు వీలవుతుందన్న మాట. ఎంత పింఛను వస్తుందనేది పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకంగా మార్కెట్‌ ఆధారిత పథకమే. కాబట్టి, రాబడికి కచ్చితమైన హామీ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. ఇతర పింఛను పథకాలతో పోలిస్తే ఎన్‌పీఎస్‌ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.

* పదవీ విరమణ వరకూ జమ చేసిన మొత్తంలో నుంచి 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో ఎంపిక చేసిన ఏడు సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవే పింఛనును చెల్లిస్తాయి.

* యాక్టివ్‌ ఛాయిస్‌, ఆటో ఛాయిస్‌ పేరుతో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వయసు, నష్టభయాన్ని భరించే శక్తిని బట్టి, వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ, స్థిరాదాయం అందించే పథకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా ఉంటాయి.

* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సీసీడీ (1బీ) కింద రూ.50వేల వరకూ ప్రత్యేక మినహాయింపు పొందేందుకు   వీలుంటుంది.


తక్కువ లాకిన్‌తో..

పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జిస్తూ, పన్ను ఆదా చేసుకోవాలనుకున వారికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఉపయోగపడతాయి. ఈ ఫండ్లు తమ పోర్ట్‌ఫోలియోలో 80 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెడతాయి.దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన పథకాలివి. పెట్టిన పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాల్సిందే. ఇంకా ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల ఈక్విటీ లాభాలు మెరుగ్గా ఉంటాయి. ఒక వ్యక్తి 30 శాతం శ్లాబులో ఉండి, మొత్తం రూ.1,50,000 ఇందులోనే మదుపు చేస్తే దాదాపు రూ.46,800 (పాత పన్నుల విధానం ప్రకారం) పన్నును ఆదా చేసుకోవచ్చు.

* ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకూ, క్రమానుగత విధానంలో మదుపు చేసేందుకూ అవకాశం ఉంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల లాభాలను స్వీకరించాలంటే.. క్రమానుగత విధానంలో మదుపు చేయడమే ఎప్పుడూ మేలు.

* ఫండ్లను ఎంచుకునేటప్పుడు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే విశ్లేషణను తనిఖీ చేయాలి. ఫండ్‌ పెట్టుబడి లక్ష్యం, పోర్ట్‌ఫోలియో కూర్పు, గత పనితీరు, ఫండ్‌ మేనేజర్‌ అనుభవంలాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.

* మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలన్న నిబంధన వల్ల మీరు మధ్యలోనే వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది.

దీపక్‌ జైన్‌, హెడ్‌-సేల్స్‌, ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు