Section 54F: సెక్షన్‌ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!

Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 54ఎఫ్‌ చెబుతోంది.

Updated : 30 Apr 2024 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయించగా పొందిన లాభాలపై పన్ను మినహాయింపునకు అనుమతిస్తూ ఇటీవల ‘ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ITAT)’ బెంగళూరు బెంచ్‌ తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 54ఎఫ్‌ (Section 54F) కింద ఓ వ్యక్తి చేసుకున్న క్లెయిమ్‌ను ఐటీ సమీక్షాధికారి తిరస్కరించగా.. ఐటీఏటీ దానిపై విచారణ జరిపింది.

వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగిస్తే.. దానిపై దీర్ఘకాల మూలధన లాభాల (LTCG) పన్ను మినహాయింపు ఉంటుందని ఐటీఏటీ స్పష్టంచేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చిన మొత్తంగా పరిగణించడానికి వీల్లేదని తేల్చింది. పూర్వీకుల నుంచి వచ్చిన దీర్ఘకాల మూలధన ఆస్తిగానే లెక్కలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది.

ఏంటీ సెక్షన్‌ 54ఎఫ్‌..

ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం.. దీర్ఘకాల మూలధన ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇల్లు కొనడానికి ఉపయోగిస్తే దానిపై వచ్చే లాభానికి ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మూలధన ఆస్తులుగా షేర్లు, బాండ్లు, ఆభరణాలు, బంగారాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటిని మాత్రం మూలధన ఆస్తిగా లెక్కించరు.

ఎవరు అర్హులు..

సెక్షన్‌ 54ఎఫ్‌ (Section 54F) కింద వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) మినహాయింపు కోరవచ్చు. అలాగే ఆస్తులు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని కచ్చితంగా ఇంటి కొనుగోలుకే వినియోగించాలి. పైగా కొనుగోలు నాటికి కొత్త ఇల్లు మినహా మరొక నివాస గృహం పన్ను చెల్లింపుదారుడి పేరిట ఉండొద్దు.

ఎంతవరకు మినహాయింపు..

కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తి విలువ.. బంగారం విక్రయించగా వచ్చిన దానికంటే ఎక్కువ లేదా సమానమైతే.. మొత్తం ఆదాయంపై మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొన్న ఇంటి విలువ అమ్మిన బంగారం కంటే తక్కువైతే.. మిగిలిన మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం.. గరిష్ఠంగా రూ.10 కోట్లపై మాత్రమే మినహాయింపు ఉంటుంది.

వెంటనే ఇల్లు దొరక్కపోతే..

కుటుంబసభ్యుల నుంచి వారసత్వంగా వచ్చే బంగారాన్ని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. పన్ను భారం ఉండొద్దనుకుంటే ఇల్లు కొనడమో, నిర్మించడమో చేయాలి. అయితే, బంగారం అమ్మిన వెంటనే ఒక్కోసారి ఇల్లు దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్‌ గడువు సమీపిస్తే తప్పకుండా వచ్చిన ఆదాయాన్ని దాంట్లో చూపించి పన్ను చెల్లించాల్సిందే. దీన్నుంచి మినహాయింపు కోసం తాత్కాలిక వెసులుబాటు ఉంది. అదే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌. వచ్చిన మొత్తాన్ని దీంట్లో డిపాజిట్‌ చేయడం వల్ల ఆ సంవత్సరానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, సంబంధిత పత్రాలు పక్కాగా ఉండాలి. మీ గోల్డ్‌ను కొనుగోలు చేస్తున్నవారిని కూడా దీనిపై అప్రమత్తం చేయాలి.

ఉదాహరణ..

  • సుమన్‌ వాళ్ల నాన్నమ్మ 2000 సంవత్సరంలో రూ.10 లక్షలు పెట్టి బంగారం కొనుగోలు చేసింది. 2018లో అది సుమన్‌ చేతికిరాగా దాన్ని ఆయన 2024లో రూ.50 లక్షలకు విక్రయించారు.
  • క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ లెక్కించడానికి కొనుగోలు చేసిన మొత్తాన్ని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇండెక్సేషన్‌ వర్తింపజేయాల్సి ఉంటుంది. అప్పుడు కొనుగోలు చేసిన మొత్తం విలువ రూ.35 లక్షలకు సమానమవుతుంది.
  • అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.15 లక్షలు.
  • దీనిపై 20 శాతం ఎల్‌టీసీజీ పన్ను వర్తింపజేస్తే రూ.3 లక్షలు చెల్లించాలి.
  • ఒకవేళ వచ్చిన రూ.50 లక్షలను ఇంటి కొనుగోలుకు వినియోగిస్తే మొత్తం రూ.15 లక్షలపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే రూ.3 లక్షలు ఆదా అయినట్లు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని