జీవిత బీమా లాభాల్లో వాటా కావాలంటే...

కుటుంబంలో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేది జీవిత బీమా. అందుకే, సరైన అవగాహనతో పాలసీని ఎంచుకోవాలి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌, యులిప్‌, యాన్యుటీవంటి అనేక రకాల్లో దేన్ని ఎంచుకోవాలనేది నిర్ణయించుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

Updated : 06 Dec 2023 14:40 IST

కుటుంబంలో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేది జీవిత బీమా. అందుకే, సరైన అవగాహనతో పాలసీని ఎంచుకోవాలి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌, యులిప్‌, యాన్యుటీవంటి అనేక రకాల్లో దేన్ని ఎంచుకోవాలనేది నిర్ణయించుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వీటితోపాటు పార్టిసిపేటింగ్‌ (భాగస్వామ్య) పాలసీలు అనే మరో రకాన్నీ పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వీటికి ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాలసీ ఏమిటి? అందించే ప్రయోజనాలు, తీసుకునేటప్పుడు చూడాల్సిన అంశాలేమిటో తెలుసుకుందాం.
బీమా సంస్థ తన లాభాల్లో పాలసీదారులకూ కొంత వాటాను ఇస్తుంది. ఇలాంటి పాలసీలనే పార్టిసిపేటింగ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అంటారు. వీటిని పార్‌ పాలసీలుగానూ పేర్కొంటారు. బీమా సంస్థ తన లాభాల్లో కొంత భాగాన్ని పాలసీదారులకు వార్షిక ప్రాతిపదికన బోనస్‌ లేదా డివిడెండుగా చెల్లిస్తుంది. సాధారణ పాలసీలు అందించే ప్రయోజనాలకు ఇది అదనం అని చెప్పొచ్చు.
వ్యక్తులను బట్టి ఆర్థిక ప్రణాళికలు మారుతుంటాయి. లక్ష్యాలూ ప్రత్యేకంగా ఉంటాయి. కొందరు పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీలను తీసుకునేందుకు ఇష్టపడతారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభిస్తుందన్నదే వారికి నచ్చిన అంశం అవుతుంది. కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో టర్మ్‌ పాలసీలు ఎంతో కీలకం. కొందరికి హామీతో కూడిన రాబడిని అందించే పాలసీలు కావాలి. దీర్ఘకాలంలో మంచి రాబడి రావాలని కోరుకునే వారు యులిప్‌లను ఎంచుకుంటారు. రాబడి హామీతోపాటు, బోనస్‌, డివిడెండ్‌ రూపంలోనూ ఆదాయం వస్తే బాగుంటుందని భావించే వారికి పార్‌ పాలసీలు సరిపోతాయి. కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత, జీవిత లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో ఇవి సాయపడతాయి. అదే సమయంలో సాధారణ పాలసీలతో పోలిస్తే కొంత అదనపు ప్రయోజనాలూ ఉంటాయి.

  ఆ హామీ ఉండదు..

లాభాల్లో వాటాతో నిమిత్తం లేకుండా ఉండే నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలతో పోలిస్తే పార్‌ పాలసీలకు ఒకటి రెండు ప్రతికూలతలు ఉన్నాయి. బోనస్‌, డివిడెండ్లను కంపెనీ ఆర్జించే లాభాల నుంచి చెల్లిస్తారు. బీమా సంస్థ ఎప్పుడూ లాభాలనే ఆర్జిస్తుందని చెప్పలేం. కాబట్టి, బోనస్‌, డివిడెండ్‌లకు కచ్చితమైన రాబడి లభించదు. ఇవి పూర్తిగా సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. దీనర్ధం.. కొన్నేళ్లపాటు బోనస్‌లు ఉండకపోవచ్చు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే.. కొన్నేళ్లలోనే అసాధారణ రీతిలో డివిడెండ్‌ లభించే అవకాశమూ ఉంది.

కచ్చితమైన రాబడి..

కంపెనీ లాభాల్లో వాటా విషయంలో హామీ లేకపోయినప్పటికీ.. ఈ రకం జీవిత బీమా పాలసీల్లో ఇతర కచ్చితమైన చెల్లింపులూ కొన్ని ఉంటాయి. పాలసీదారుడు మరణించినప్పుడు చెల్లించే పరిహారం, మెచ్యూరిటీ చెల్లింపులు తదితరాలకు హామీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే పాలసీ విలువను బీమా సంస్థ నామినీకి చెల్లిస్తుంది. పాలసీదారుడు వ్యవధి తీరేంతవరకూ జీవించి ఉంటే.. పాలసీలో పేర్కొన్న మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లిస్తారు. ఈ మొత్తం ఎంత వస్తుందో ముందే తెలుసు కాబట్టి, అందుకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవచ్చు.

 

కాస్త అదనపు ప్రీమియంతో..

భాగస్వామ్య పాలసీలు బీమా కంపెనీల లాభాల్లో మనకు వాటా అందిస్తాయి. కాబట్టి, వీటికి నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలతో పోలిస్తే ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ పాలసీలు అందించే ప్రయోజనాలతో పోలిస్తే ఇది అంత ఎక్కువ కాకపోవచ్చు. కుటుంబ ఆర్థిక భద్రత, జీవిత లక్ష్యాల కోసం హామీ ఇచ్చిన ప్రయోజనాలతోపాటు, కంపెనీ లాభాల్లోనూ భాగం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్తతరం పార్‌ పాలసీలతో కోరుకున్న ఆదాయం, అది ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎంత కాలం అందుకోవాలి అనేది పాలసీదారులు నిర్ణయించుకునే వీలును అందిస్తాయి. కాబట్టి, జీవిత లక్ష్యాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు.
జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకమైన నిర్ణయం. కుటుంబ అవసరాలను అర్థం చేసుకొని, వాటికి తగిన రక్షణ కల్పించేలా పాలసీ ఉండాలి. వ్యక్తిగత జీవిత లక్ష్యాలను నెరవేర్చే ఉత్పత్తులనే ఎప్పుడూ ఎంచుకోవాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు