Luxury Car: సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?

నాన్‌ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం.

Updated : 22 Apr 2024 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతంగా కారును కొనుగోలు చేసి దానిలో తమ దైనందిన కార్యక్రమాలకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. మరికొందరు ఏదో ఒక కారు అని కాకుండా విలాసవంతమైన కారును సొంతం చేసుకోవడానికి ఇష్టపడతారు. విలాసవంతమైన కారు కొనడం అనేది చాలామందికి ఒక కల. దీంతో చాలామంది సెకండ్‌ హాండ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేసి తమ కలను నెరవేర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్ల మార్కెట్‌ భారత్‌లో ఏటా 15-20% వృద్ధి చెందుతోంది. సగటున సంవత్సరానికి 60 వేలకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు కూడా సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్ల అమ్మకాల నిమిత్తం అనేక షోరూంలను తెరిచి బ్యాంకు లోన్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్లను కొనడం ప్రయోజనమేనా?

తరుగుదల

చాలామంది కారు కొనుగోలు చేయడానికి సిద్ధమైనా దాని ధర చూసి ఆగిపోతారు. లగ్జరీ కారు అయితే ధర ఎక్కువే ఉంటుంది. అయితే, కొత్త కారు షోరూం నుంచి బయటకు వచ్చిన వెంటనే, దాని విలువ మార్కెట్లో తగ్గుతుంది. 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధిలో కారు 15-25 శాతం విలువను కోల్పోతుంది. వాహనం ఐదేళ్ల తర్వాత దాదాపు సగం విలువను కోల్పోతుంది. అదే విధంగా  తరుగుదల రేటు ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇది కొత్త కార్లను కొనుగోలు చేసిన యజమానులకు నష్టం అయినప్పటికీ, వారి నుంచి ఈ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు లాభదాయకం. అంతేకాకుండా, కొత్త కారుతో పోల్చితే సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారు ధరలు చాలా నెమ్మదిగా తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేయడం మంచి ఎంపిక.

తక్కువ ధరలో లగ్జరీ కారు

నాన్‌ లగ్జరీ కారు కొనుగోలు బడ్జెట్ కాస్త పెంచితే సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేయొచ్చు. ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజ్‌, ల్యాండ్‌ రోవర్‌ వంటి బ్రాండ్ల సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారు సగటు ధర రూ.25-40 లక్షలు వరకు ఉంటుంది. ఇవే కొత్తవి అయితే రూ.50-65 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఉదాహరణకు కొత్త BMW 3 సిరీస్‌ 320D లగ్జరీ ఎడిషన్‌ ధర 60.50 లక్షలయితే.. అదే 2015 మోడల్‌ను రూ.21-22 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఇది కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా, లేదా హ్యుందాయ్‌ వెర్నా ఎస్‌ఎక్స్‌ ధరతో సమానంగా ఉంటుంది. కాబట్టి, ప్రీ ఓన్డ్‌ లగ్జరీ కారు లాభదాయకమైన ఆఫర్‌ అని చాలా మంది కొనుగోలుదారులు భావిస్తున్నారు.

అధునాతన ఫీచర్లు

ఎవరైనా సౌకర్యాలు ఆశించి కారును కొనుగోలు చేస్తారు. సాధారణ కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లు చాలా సురక్షితమైనవి. లగ్జరీ కార్లలో సౌకర్యాలు చాలా ఎక్కువే ఉంటాయి. 6/7 ఎయిర్‌ బ్యాగ్‌లు, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, హిల్‌-హోల్డ్‌ అసిస్ట్‌,  క్రూయిజ్‌ కంట్రోల్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌, 360 డిగ్రీ కెమెరా సదుపాయం వంటి యాంటీ-థెఫ్ట్‌ ఫీచర్స్‌తో పాటు బ్లైండ్‌ స్పాట్‌ మానటరింగ్‌ ఎనేబుల్‌ చేయడానికి కార్లు ఆటోమెటిక్‌, అధునాతన సెన్సార్‌లు ఉంటాయి. నాన్‌ లగ్జరీ కార్లలో లేని ఫీచర్లు.. సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్లలో కనిపిస్తాయి. వినియోగదారులు నిరంతరం అధునాతన సాంకేతికతలు, ఫీచర్లు, డిజైన్లు, హై-ఎండ్‌ టెక్నికల్‌ పీచర్లను, భద్రతను కోరుకుంటారు. ఇటువంటి అన్ని అంశాలు గల లగ్జరీ కారును సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయడం వినియోగదారులకు మేలే అని చెప్పవచ్చు.

బీమా

సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు బీమా ఖర్చులపై గణనీయమైన తగ్గింపు ఉంటుంది. కారు వయసును పరిగణనలోకి తీసుకుంటే, బీమా ప్రీమియం మొత్తం స్థిరంగా తగ్గుతుంది. బీమా కోసం చెల్లించాల్సిన మొత్తం సాధారణంగా కారు ప్రస్తుత విలువపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు మరమ్మతులకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడంతో బీమా కంపెనీలు కొత్త వాహనాలకు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల ధరలు తక్కువే ఉంటాయి. కాబట్టి, బీమా ప్రీమియం తక్కువే ఉంటుంది. కారు పై క్లెయిమ్స్ లేకపోతే NCB ప్రయోజనం కూడా పొందొచ్చు.

మెయింటెనెన్స్‌

సాధారణంగా లగ్జరీ కార్లను వాటి యజమానులు తమ సొంత పనులపై బయటకు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కారు నిర్వహణ ఎక్కువ మందికి ఇవ్వకుండా సింగిల్‌ హ్యాండ్‌లో నిర్వహిస్తారు. దీనివల్ల వాహనం త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇటువంటి కార్లను సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసిన వారికి భవిష్యత్‌లో పెద్దగా నిర్వహణ బాధ్యతలు ఉండకపోవచ్చు.

వెయిటింగ్‌ పీరియడ్‌

సరికొత్త లగ్జరీ కారును పొందడానికి వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండడమే కాకుండా పన్నులు కూడా ఎక్కువే ఉంటాయి. సెకండ్‌ హ్యాండ్‌ కారు అయితే ఆయా కంపెనీల షోరూంలలో వెంటనే తీసుకోవచ్చు. అక్కడే నచ్చిన మోడళ్లను ఎంచుకోవచ్చు. ప్రీ-ఓన్డ్‌ షోరూంలు కూడా పాత లగ్జరీ కారు కొనుగోలుపై బ్యాంకు లోన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని ప్రీ-ఓన్డ్‌ కార్ల ఏజెన్సీలు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల నాణ్యతను వీలైనంత వరకు కొత్త కారుతో సమానంగా ఉండేలా చూస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒక ఏడాది నుంచి రెండు ఏళ్ల పాటు వారంటీని కూడా అందిస్తాయి.

నష్టాలు

లగ్జరీ కార్లకు ఫీచర్లు ఎక్కువే ఉంటాయి.. అదే సమయంలో లగ్జరీ కార్లు చాలా ఇంధనాన్ని వినియోగిస్తాయి. సరసమైన ధరలో సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారును పొందినా.. ఇంధన ఖర్చు, నిర్వహణ ఖర్చు ఎక్కువే ఉంటుంది. లగ్జరీ కారు లోపల, వెలుపల అందంగా ఉన్నప్పటికీ, అనేక సంక్లిష్టమైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. సెన్సార్‌లు, కంట్రోలర్స్‌, డ్రైవింగ్‌ మోడ్స్‌, బహుళ డిజిటల్‌ డిస్‌ప్లేస్‌ మొదలైన హై-టెక్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. వీటి నిర్వహణ సరిగ్గా ఉండాలి. వీటిలో సమస్యలుంటే నిర్వహించడం సవాలుగా మారే అవకాశం ఉంది. లగ్జరీ కార్ల నిర్వహణ ఖర్చు సంవత్సరానికి రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. కారును కొనుగోలు చేసేముందు వాహన నిపుణులతో తనిఖీ చేయించాలి. ముఖ్యంగా బ్యాటరీలు, సెంట్రల్‌ కంట్రోల్‌ సిస్టం, హైటెక్‌ ఫీచర్లను తనిఖీ చేయాలి. రిపేర్‌లు వచ్చినప్పుడు, విడిభాగాలకు ఖర్చు ఎక్కువయ్యే అవకాశముంది. ఉదాహరణకు ఈ కార్లలో ఇంధన ఫిల్టర్‌, బ్రేక్‌ ప్యాడ్‌ వంటి భాగాన్ని మార్చాల్సి వస్తే రూ.30-50 వేల దాకా అవుతుంది. పాత కార్లకు రిపేర్లు, సర్వీస్‌లు అవసరం కూడా ఎక్కువే. కాబట్టి, వీటి ఖర్చులు అదనంగా ఉంటాయి.

చివరిగా: సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారును కోనుగోలు చేయడం వల్ల మీ బడ్జెట్‌లో విస్తృత శ్రేణి లగ్జరీ కారు మోడల్స్‌, ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. అయితే, లగ్జరీ కారును కొనుగోలు చేయాలా అనే నిర్ణయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్ల ఎంపికలో లాభాలు, నష్టాలు ఉంటాయి. నిర్ణయం మీ బడ్జెట్‌, అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు