Buy Property: చిన్న వయసులో ఇల్లు కొనుగోలు లాభమేనా?

ఇల్లు కొనడం అనేది చాలా పెద్ద ఆర్థిక నిర్ణయం. దీనికి సరైన ఆలోచనతో పాటు సిద్ధంగా ఉండడం అవసరం.

Published : 04 Jan 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు పదుల వయసు నిండకముందే ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగింది. ముఖ్యంగా చిన్న వయసులోనే జాబ్‌/కెరీర్‌ ఆశాజనకంగా ఉండడం కూడా దీనికి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. యువత దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంటిని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుని ఉండడాన్ని ఒక విలాసంగా వారు భావించడం లేదు. ఉండడానికి ఒక నివాసం అమర్చుకోవడమే కాకుండా భవిష్యత్‌లో పెరిగే సంపదగా వారు భావిస్తున్నారు. ఇంటి యజమాని కల నెరవేరడమే కాకుండా పన్ను ప్రోత్సాహకాలు, అద్దె నుంచి స్వేచ్ఛ లాంటి ప్రయోజనాలను పొందడానికి ఇల్లు సరైన ఆస్తిగా కూడా చూస్తున్నారు. CBRE చేసిన ఒక సర్వే ప్రకారం.. 44% మంది భారతీయ యువకులు ఇంటి కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఇంటి కొనుగోలుకు ఆసక్తి ఉంటే సరిపోదు. కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.

20 ఏళ్లకే ఇంటి కొనుగోలు

20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆర్థిక బాధ్యతలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఈ వయసులో ఇంటిని కొనుగోలు చేయడం వల్ల మీ హోమ్‌ లోన్‌ను తిరిగి చెల్లించడానికి, మంచి క్రెడిట్‌ హిస్టరీని నిర్మించుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, డౌన్‌ పేమెంట్‌ను చెల్లించడానికి మీ దగ్గర సరిపడా నిధులు ఉండకపోవచ్చు. ఇంటి రుణాన్ని ఆమోదించే ముందు రుణ సంస్థలు మీ నెలవారీ ఆదాయాన్ని, ఇతర అంశాలను పరిశీలిస్తాయి. అంతేకాకుండా ఇల్లు అనేది చాలా పెద్ద ఆస్తి. దీని కొనుగోలుకు మార్కెట్‌ పరిస్థితులపై తగిన అనుభవం, అవగాహన కూడా అవసరమే. కాబట్టి, ఇంటి కొనుగోలుకు ఈ వయసులో ఉన్నవారు సరైన అవకాశం వచ్చేవరకు కొన్ని సంవత్సరాలు వేచి ఉండడం మంచిది.

30 ఏళ్లకే ఆర్థిక స్థిరత్వం

ఇల్లు కొనడానికి సరైన వయసును నిర్ణయించేటప్పుడు ఆర్థిక స్థిరత్వం అనేది ప్రాథమిక పరిశీలనలలో ఒకటి. తగినంత పొదుపు, బలమైన ఆర్థిక పునాది చాలా ముఖ్యం. సొంతంగా కొంత మేరకు నిధులు ఉండడమే కాకుండా, దీర్ఘకాలం పాటు సరైన ఆర్థిక స్థిరత్వం అవసరం. వీటివల్ల బ్యాంకుల వద్ద రుణం వేగంగా పొందొచ్చు. అనుకూలమైన హోమ్‌ లోన్‌ పొందేందుకు డౌన్‌ పేమెంట్‌ కూడా అవసరం. ఇంటి విలువలో కనీసం 20% డౌన్‌ పేమెంట్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలి. అనేక సంవత్సరాల పాటు ఈఎంఐల బాధ్యత కూడా ఉంటుంది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల వయసు ఉన్నవారు స్థిరమైన మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను కలిగి ఉంటున్నారు. యువతకు బాధ్యతలు తక్కువ ఉంటాయి కాబట్టి, డౌన్‌ పేమెంట్‌ను సమకూర్చుకోవడం, ఈఎంఐలు చెల్లించడం వారికి పెద్ద శ్రమగా ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో ఉమ్మడి హోమ్‌లోన్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ దశలో ఇంటిని కొనుగోలు చేయడం వల్ల లోన్‌ను క్లియర్‌ చేయడానికి, రిటైర్‌మెంట్‌ కోసం పొదుపు చేయడానికి చాలా సమయం లభిస్తుంది. 

40 ఏళ్లకు

40 ఏళ్ల వయసులో ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఈ కొనుగోలుకు చాలా కాలం పాటు ప్లాన్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇంటి కొనుగోలుకు అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని సమకూర్చుకోవడానికి సంవత్సరాల పాటు పొదుపు చేసి ఉంటారు. కాబట్టి, తక్కువ మొత్తంలో రుణాన్ని తీసుకోవచ్చు. ఈఎంఐ కాలవ్యవధి కూడా తగ్గుతుంది. అయితే మీ రుణ దరఖాస్తును ఆమోదించేటప్పుడు చాలా ఆర్థిక సంస్థలు రుణగ్రహీత వయసును పరిగణనలోకి తీసుకుంటాయి. అంతేకాకుండా ఈ దశలో పిల్లల విద్య, కారు లోన్‌ మొదలైన ఇతర ముఖ్యమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. అదనంగా ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. 

50 ఏళ్లకు

గతంలో ఈ వయసువారే ఎక్కువగా ఇంటి కొనుగోలుకు మొగ్గుచూపేవారు. ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుతం ఈ వయసులో ఇంటి రుణం తీసుకోవడానికి, ఈఎంఐలు తీర్చడానికి ఇబ్బందులుండొచ్చు. హోమ్‌ లోన్‌ కాలవ్యవధి 10-30 సంవత్సరాల వరకు ఉంటుందని గుర్తుంచుకోవాలి. 50వ ఏట రుణం తీసుకోవడం వల్ల ఈఎంఐల భారం బాగా పెరుగుతుంది. ఈ వయసు వారికి పిల్లల వివాహాల బాధ్యతలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, మీ రిటైర్‌మెంట్‌ ఫండ్‌ను నిర్మించడంలో కూడా ఇబ్బందులుంటాయి. కాబట్టి, ఈ వయసువారు బ్యాంకులు ఇచ్చే రుణాన్ని పెద్దగా ఆశించకుండా సొంత ఆర్థిక వనరుల మీద ఇంటిని నిర్మించుకోవడం చాలా మంచిది.

చివరిగా: హోమ్‌ లోన్‌ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్‌ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. 750 కంటే ఎక్కువ ఉన్న స్కోరు ఉన్నవారికి అనుకూలమైన వడ్డీ రేట్లతో రుణాన్ని పొందేందుకు అవకాశం ఎక్కువ. ఒకవేళ ఏ కారణం చేతనైనా క్రెడిట్‌ స్కోరు తక్కువున్నా సరే సానుకూల క్రెడిట్‌ హిస్టరీ నిర్మించడానికి తగిన సమయం పట్టొచ్చు. యువతకు తగిన సమయం ఉంటుంది. కాబట్టి, సకాలంలో పాత బిల్లులు చెల్లించడం, చిన్న రుణాలు ఉంటే వాటిని వెంటనే తీర్చేయడం లాంటివి చేయాలి. దీంతో స్కోరు మెరుగుపడి రుణ లభ్యతకు లైన్‌ క్లియరవుతుంది. జీవిత ప్రారంభంలో లేదా తర్వాత ఇంటిని కొనుగోలు చేయాలా అనేది వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక సంసిద్ధత, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని