Financial Mistakes: బడ్జెట్, ఖర్చుల విషయంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

చాలా మంది తమ ఖర్చుల విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు. స్వతహాగా చేసే కొన్ని అనవసర (వృథా) ఖర్చుల గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published : 21 Nov 2023 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా అందరూ తమ దైనందిన జీవితంలో అనేక ఖర్చులు చేస్తుంటారు. ఇందులో అవసరమైన ఖర్చులేంటి? అనవసర ఖర్చులేంటి? అనే విషయంలో అనేక మంది తర్జనభర్జన పడుతుంటారు. అనవసర ఖర్చుల విషయంలో సరైన క్లారిటీ లేకపోతే జీవితాంతం అవి మనల్ని వదలిపెట్టవు. డబ్బు నిర్వహణ చిన్నతనం నుంచి సరిగ్గా అలవర్చుకోకపోతే కొంతకాలానికి సంక్లిష్టంగా మారుతుంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికలో చేసే మొదటి తప్పు తమ ఖర్చులను అదుపులో పెట్టకపోవడం. జీవనశైలిలో మార్పులు చేయకుంటే ఈ ఖర్చులను అదుపులో ఉంచడం చాలా కష్టం. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేలా ఇది దీర్ఘకాలంలో సహాయపడుతుంది. ఖర్చులు మితిమీరితే అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించదు. చాలా మంది చేసే ఆర్థిక తప్పులు, నివారణ మార్గాలు ఇక్కడ చూద్దాం..

బడ్జెట్‌

చాలామంది ఇంటి ఖర్చుల విషయంలో బడ్జెట్‌ను తయారు చేసుకోరు. బడ్జెట్ తయారుచేసుకున్న వారు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇందులో బడ్జెట్ రాయకపోవడం అతి పెద్ద తప్పు. బడ్జెట్ రాసిపెట్టుకున్నప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎంత వరకు చేయవచ్చు? అనే వాటిపై మనకి స్పష్టత ఉంటుంది. అలాగే, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయకుండా బడ్జెట్ తయారు చేస్తుంటారు. భవిష్యత్‌ ఖర్చులను కూడా అంచనా వేస్తేనే బడ్జెట్ సరైన విధంగా ఉంటుంది. చాలా మంది ఆసక్తితో బడ్జెట్ రాయడం మొదలు పెడతారు. కానీ 1-2 నెలల్లోనే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం పాటు రాస్తుంటేనే ఖర్చుల మీద అవగాహన వస్తుంది. తప్పులు తెలుసుకోవచ్చు.

అనవసరమైన సబ్‌స్క్రిప్షన్స్‌

కొంత మంది ఏడాది పొడవునా జిమ్‌, క్లబ్‌ ఫీజులు చెల్లించి సక్రమంగా హాజరు అవ్వరు. దీనివల్ల దానిపై చేసిన ఖర్చు వృథా అవుతుంది. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. టీవీలో అనేక ఛానెళ్లను చూడకపోయినా సరే ఎక్కువ ఛానెళ్లకు డబ్బు చెల్లిస్తుంటారు. మీరు రోజూ చూసే ఛానెళ్లను మాత్రమే ఎంచుకుంటే ఖర్చు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. మరికొంత మంది చదవకపోయినా సరే అనేక మ్యాగజైన్స్‌ను ఇంటికి తెప్పిస్తారు. ఇందులో ఎక్కువ చదవగలిగేవే తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.

ఇంటి ఖర్చులు

ఇల్లు అనేది ఎవరికైనా అవసరమే. ప్రాథమిక అవసరాలను తీర్చేది కూడా ఇల్లే. చాలామంది ఎక్కువ అద్దె ఇచ్చి సిటీ మధ్యలో ఇరుకు ఇళ్లలో నివసిస్తుంటారు. దీనికి బదులుగా పట్టణ శివారుకు మారడం మంచిది. దీనివల్ల అద్దె కలిసి వస్తుంది. ఇల్లు సౌకర్యంగా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసినా సరసమైన ధరకు లభించే శివారు ప్రాంతాలకు వెళ్లడం మంచిది. దీనివల్ల కొనుగోలు మొత్తంలో చాలా ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు. మెట్రో లాంటి రవాణా వ్యవస్థ ద్వారా త్వరగా దూర ప్రాంతాలను చేరుకోవచ్చు.

విద్యుత్‌

ప్రస్తుతకాలంలో విద్యుత్‌ వినియోగం అనేది చాలా కామన్‌. అంతేకాకుండా, అవసరాల రీత్యా విద్యుత్‌ ఉపకరణాలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో వాడకం కూడా గణనీయంగా పెరిగింది. వీటిని పొదుపుగా వాడుకుంటే పర్వాలేదు. కానీ, మనుషులు లేని చోట కూడా ఫ్యాన్‌, ఏసీ, లైట్లు వేసేసి ఉంచేస్తారు. అంతేకాకుండా ఇంటికి అనవసర లైటింగ్‌ ఎఫెక్ట్‌లను పెంచేస్తారు. ఇలాంటి అనవసర ఖర్చులను చాలామంది సరిగ్గా గమనించరు. విద్యుత్‌ విషయంలో ఒక యూనిట్‌ను పొదుపుచేస్తే.. అదనపు యూనిట్‌ను ఉత్పత్తి చేసినట్టే. అంతేకాకుండా, విద్యుత్‌ ఛార్జీలు గతంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయాయి. దేశంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ విద్యుత్‌ వినియోగదారుడే. కాబట్టి విద్యుత్‌ను ఆదా చేసి వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. వీలైతే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పానెల్స్ అమర్చుకోవాలి.

క్రెడిట్‌ కార్డులు

క్రెడిట్‌ కార్డు వాడకం ఈ మధ్య బాగా పెరిగింది. ప్రతిరోజూ జేబు నుంచి నగదు ఖర్చు పెట్టడానికి, క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు జరపడానికి చాలా తేడా ఉంటుంది. వెంటనే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. కాబట్టి క్రెడిట్‌ కార్డుతో అనవసరమైన కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది. నగదును ఉపయోగించకుండా క్రెడిట్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తులు సాధారణంగా 12-18% ఎక్కువగా ఖర్చు చేస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు గణనీయంగా పెరిగిపోయాయి. క్రెడిట్‌ కార్డుతో ఈ కొనుగోళ్లు చాలా సులభం. ఆ సమయంలో ఖర్చు గురించి ఆలోచన ఉండదు. ఇది మీ అప్పును పెంచడానికి కారణమవుతుంది. బిల్‌ వచ్చినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. డిఫాల్టయితే క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. జరిమానా కూడా తప్పదు. అంతేకాకుండా ఎక్కువ క్రెడిట్‌ కార్డులను కలిగి ఉండడం వల్ల రుణాలను ట్రాక్‌ చేయడం కష్టమవుతుంది. కాబట్టి, చిన్న చిన్న ఆఫర్లు, డీల్స్‌ కోసం క్రెడిట్‌ కార్డులను ఆశ్రయించొద్దు. క్రెడిట్‌ కార్డులు బాధ్యతాయుతంగా నిర్వహించేవారికి మాత్రమే తగినవి. 

వివాహం, పుట్టిన రోజు వేడుకలు

వివాహం, జీవితంలో ఒక జంట‌కు మ‌ధురమైన ఘ‌ట్టం. పెళ్లి వేడుక‌ ఎప్పుడైతే ఘ‌నంగా కావాల‌ని ఆశిస్తారో.. ఖ‌ర్చులు కూడా అంతే భారీగా అయ్యే అవ‌కాశం ఉంది. పెళ్లి వ్య‌వ‌హారాల్లో ఖ‌ర్చులు ఎలా ఉంటాయో చాలా మందికి అనుభ‌వంగా తెలిసిన విష‌య‌మే. భారత్‌లో వధూవరుల కుటుంబాలు వివాహానికి అడ్డూఅదుపు లేకుండా డబ్బులు ఖర్చు పెడుతుంటాయి. భార‌త్‌లో ఎక్కువ మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారే ఉంటారు. వీరికి పెళ్లి ఖ‌ర్చు ఒక భారీ బ‌డ్జెట్ లాంటిదే అని చెప్పొచ్చు. భారత్‌లో ఒక మధ్య తరగతి వ్యక్తి తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో సంపాదించిన ‘పీఎఫ్‌’ డబ్బును ఈ వేడుకలోనే ఖర్చు పెట్టేస్తున్నారని వివాహ ఖర్చుల గురించి కొన్ని కథనాలు వార్తల్లో కూడా వచ్చాయి. ఇంకొక ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఇంటికి ఖ‌ర్చు పెడితే ఇళ్లు మ‌న క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. చ‌దువుకు పెట్టిన ఖ‌ర్చు ఎక్క‌డికీ పోదు. జీవితాంతం ఆ విద్య.. ఆ వ్య‌క్తినే కాకుండా మొత్తం కుటుంబాన్నే పోషిస్తుంది. కానీ పెళ్లికి పెట్టిన ఖ‌ర్చు మాత్రం ఆ రోజే క‌నిపిస్తుంది. త‌ర్వాత క‌నిపించ‌దు. కాబట్టి, వివాహం, పుట్టిన రోజు వేడుకల ఖర్చుల విషయంలో సంయమనం పాటించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

అనవసర వస్తువులు

చాలా మంది వారికి తగిన స్థోమత లేకపోయినా విలాస వస్తువులపై మొగ్గు చూపుతుంటారు. ఉదాహరణకు రూ.35 వేలు సంపాదించే వ్యక్తి కూడా రూ.80-90 వేలు ఖరీదు చేసే ‘ఐఫోన్‌’ కొనుగోలు చేయాలని ఆశిస్తారు. అద్భుతంగా పనిచేసే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లు రూ.15 వేలకే లభిస్తాయి. ఇవి కూడా ప్రస్తుత కాలంలో అందరికీ ఉపయోగపడే అన్ని సేవలను అందిస్తాయి. కాబట్టి స్థోమతు లేనివారు ఖర్చులకు తగ్గట్టుగా వ్యవహరించడం చాలా మంచిది. కొంతమంది జీవితంలో పూర్తిగా స్థిరపడకుండానే కారు కొనుగోలుకు మొగ్గుచూపుతారు. కారు అవసరం కూడా వీరికి ప్రతి రోజూ ఉండదు. కారుకు బీమా, పార్కింగ్‌ రుసుములు, ఇతర నిర్వహణ ఖర్చులు చాలానే ఉంటాయి. ఇటువంటి అన్ని ఖర్చులతో పాటు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ మొత్తం కూడా వేలల్లో ఉంటుంది. ఇలాంటి అధిక ఖర్చులు చెల్లించే బదులు ఆ డబ్బులను మంచి పొదుపు పథకంలో పొదుపు చేసి రాబడిని పెంచుకోవచ్చు.

చివరిగా: పైన చెప్పినవే కాకుండా ఇంకా మన దైనందిన జీవితంలో వృథాగా చేసే చాలా ఖర్చులను తగ్గించుకుని డబ్బులను ఆదా చేయొచ్చు. ఖర్చుల విషయంలో సమర్థమైన డబ్బు నిర్వహణ మనల్ని ఆర్థికంగా విజయతీరాలకు చేరుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని