Debt Funds: తక్కువ నష్టభయం.. ఎక్కువ రాబడి కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

పెద్దగా నష్టభయం వద్దనుకునేవారికి డెట్‌ ఫండ్లు మంచి రాబడినిస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చినా వీటిలో రాబడి ఎక్కువే.

Updated : 04 Jan 2023 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మందికి స్టాక్‌ మార్కెట్‌ అనుసంధానిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, ఎక్కడ నష్టం వస్తుందోనని వెనకడుగు వేస్తుంటారు. అలా అని సురక్షితమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి మార్గాల నుంచి వచ్చే రాబడితోనేమో సంతృప్తి ఉండదు. అలాంటి వారికి ‘డెట్‌ ఫండ్లు (Debt Funds)’ సరిగ్గా సరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

డెట్‌ ఫండ్‌ అంటే?

డెట్‌ ఫండ్‌ (Debt Funds) ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. కార్పొరేట్‌, ప్రభుత్వ బాండ్లు; కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీలు; మనీ మార్కెట్‌ సాధనాల వంటి స్థిర ఆదాయ మార్గాల్లో మన నిధులను ఫండ్‌ సంస్థలు మదుపు చేస్తాయి. వీటినే ఆదాయ ఫండ్లు, బాండ్‌ ఫండ్లు అని కూడా పిలుస్తుంటారు.

ఎవరు మదుపు చేయొచ్చు?

నష్టభయం లేకుండా క్రమం తప్పని ఆదాయం కోసం డెట్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటిలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. అందుకే ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే సురక్షితం. ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌డీతో పోలిస్తే అధిక పన్ను ప్రయోజనం, ఎక్కువ రాబడిని పొందొచ్చు.

డెట్‌ ఫండ్లు మన నిధులను కార్పొరేట్‌, ప్రభుత్వ బాండ్ల వంటి మార్కెట్‌లో నమోదైన లేదా నమోదుకాని డెట్‌ సాధనాల్లో ఒక ధర వద్ద మదుపు చేస్తాయి. వాటినే కొంతకాలం తర్వాత కొంత లాభంతో విక్రయిస్తాయి. ఫలితంగా మన ‘ఫండ్‌ నికర విలువ (NAV)’ అంటే మనం పెట్టిన పెట్టుబడి పెరుగుతూ పోతుంది. మరోవైపు నిధులను మదుపు చేసిన సాధనాల నుంచి క్రమం తప్పని వడ్డీరేటు కూడా అందుతుంది. ఇది దాదాపు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీతో సమానంగా ఉంటుంది. దీన్ని ఏరోజుకారోజు మన ఫండ్‌కు జత చేస్తారు. ఆ మేర డెట్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ పెరుగుతుంది. అంటే డెట్‌ ఫండ్‌లో వడ్డీరేటుతో పాటు ఫండ్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ ఆధారంగా కూడా మన పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది.

డెట్‌ సెక్యూరిటీల మార్కెట్‌ ధర వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన డెట్‌ ఫండ్‌ దగ్గర 10 శాతం రాబడినిచ్చే సెక్యూరిటీ ఉందనుకుందాం. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లు పడిపోతే.. కొత్తగా జారీ చేసే సెక్యూరిటీలకు ఆ తగ్గిన వడ్డీరేటే వర్తిస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న అధిక వడ్డీరేటు సెక్యూరిటీకి డిమాండ్‌ పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎగబాకుతుంది. తద్వారా డెట్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ కూడా పెరుగుతుంది.

ఇతర ఫండ్లతో పోలిస్తే తేడా ఏంటి?

పనితీరుపరంగా చూస్తే ఇతర మ్యూచువల్‌ ఫండ్లతో డెట్‌ ఫండ్లకు పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. భద్రతాపరంగా చూస్తే మాత్రం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే డెట్‌ ఫండ్లు సురక్షితం. ఉదాహరణకు మార్కెట్‌లో భారీ దిద్దుబాటు జరిగితే.. అదే స్థాయిలో ఈక్విటీ ఫండ్ల ఎన్‌ఏవీ పడిపోతుంది. కానీ, డెట్‌ ఫండ్లలో మాత్రం ఒకేసారి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. అదే సమయంలో ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే రిటర్నులు కూడా తక్కువే ఉంటాయి.

ఎందుకు మదుపు చేయాలి?

తక్కువ ఖర్చు, స్థిరమైన రాబడి, సరిపడా భద్రతతో కూడిన హెచ్చుతగ్గులు.. ఇవే డెట్‌ ఫండ్లలో మదుపు చేయడానికి మదుపర్లను ఆకర్షించే ముఖ్య కారణాలు. ఒకవేళ డివిడెండ్‌ను ఎప్పటికప్పుడు మదుపర్లు తీసేసుకుంటే దానిపై పన్ను వర్తించదు. అదే ఎన్‌ఏవీకి జత చేస్తూ వెళ్తే.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలైతే 23.325 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాల మూలధన లాభాల కింద ఇండెక్సేషన్‌ లేకుండా 10 శాతం, ఇండెక్సేషన్‌ ఉంటే 20 శాతం పన్ను వర్తిస్తుంది. అదే స్వల్పకాల మూలధన లాభాలపై పన్ను.. ట్యాక్స్‌ శ్లాబును అనుసరించి ఉంటుంది.

గ్రోత్‌ ఆప్షన్‌ V/S డివిడెండ్‌ ఆప్షన్‌..

ముందుగా చెప్పినట్లు మదుపర్లు డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే అంటే ఎప్పటికప్పుడు డివిడెండ్‌ను తీసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు. అదే డివిడెండ్‌ను ఎప్పటికప్పుడు ఎన్‌ఏవీకి జత చేస్తూ వెళ్తే దాన్ని గ్రోత్‌ ఆప్షన్‌గా వ్యవహరిస్తారు. అప్పుడు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా తుది రాబడిలో కొంత తగ్గుతుంది. అయితే, తక్కువ పన్ను శ్లాబు కిందకు వచ్చేవారు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

డెట్‌ ఫండ్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?

డెట్‌ ఫండ్‌ రాబడి పూర్తిగా మన నిధులను ఎలా కేటాయించామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్ల పోర్ట్‌ఫోలియోను నిశితంగా గమనిస్తే.. రిటర్నులు, రిస్క్‌, హెచ్చుతగ్గులపై ఓ అవగాహన వస్తుంది. అందుకే ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు ఈ కింది విషయాలను గమనించాలి..

  • ‘ఫండ్‌ యావరేజ్‌ మెచ్యూరిటీ’ని చెక్‌ చేయాలి. ఈ గడువు ఎంత తక్కువ ఉంటే రాబడి, హెచ్చుతగ్గులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గడువు ఎక్కువ ఉన్నట్లయితే.. హెచ్చుతగ్గులు, రాబడి కూడా ఎక్కువే ఉంటాయి.
  • పోర్ట్‌ఫోలియోలో వీలైనంత మేర ద్రవ్యలభ్యత ఉండేలా చూసుకోవాలి. కార్పొరేట్‌ డెట్‌కు ఎక్కువ కేటాయిస్తే.. స్వల్పకాలంలో మెరుగైన రాబడిని అందుకోలేం. ఒకవేళ రిడెమ్షన్‌ ఒత్తిడి పెరిగితే.. ఈ సెక్యూరిటీలన్నింటినీ తక్కువ ధరతో విక్రయించాల్సి ఉంటుంది. ఫలితంగా రాబడి తగ్గుతుంది. అలాగే అన్‌రేటెడ్‌, అన్‌లిస్టెడ్‌ డెట్‌ ఉన్న ఫండ్లను కూడా ఎంచుకోవద్దు.
  • తక్కువ నిధులు ఉన్న ఫండ్లను ఎంపిక చేసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మదుపర్లు ఒక్కోసారి నిధులను అలాగే ఫండ్ల వద్ద అట్టిపెట్టి ఉంచుతారు. ఈ విషయాన్ని ఫండ్‌ సంస్థలు మనకు వెల్లడించవు. అకస్మాత్తుగా సదరు మదుపరి రీడీమ్‌ చేసుకుంటే మార్కెట్‌ ధర కంటే తక్కువకు సెక్యూరిటీలను విక్రయించాల్సి ఉంటుంది. ఇది మన రాబడిపై కూడా ప్రభావం చూపుతుంది.
  • వడ్డీరేట్ల మార్పు మన డెట్‌ ఫండ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ‘మాడిఫైడ్‌ డ్యురేషన్‌’ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఎక్కువ ఉంటే వడ్డీరేటు హెచ్చుతగ్గుల ప్రభావం మన ఫండ్‌పై అధికంగా ఉంటుందని అర్థం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని