December deadline: ఆధార్‌ అప్‌డేట్‌.. బ్యాంక్‌ లాకర్‌ అగ్రిమెంట్‌.. డిసెంబర్‌ డెడ్‌లైన్స్‌ ఇవే!

December 2023 money deadlines: 2023 సంవత్సరానికి దాదాపు చివరకు వచ్చేశాం. ఈ ఒక్క నెలా ఆగితే ఏడాది పూర్తవుతుంది. సంవత్సరమే కాదు అనేక పథకాల డెడ్‌లైన్‌ కూడా 31తో ముగియనుంది.

Published : 29 Nov 2023 09:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్రం తీసుకొచ్చిన పథకాల దగ్గర నుంచి ఆధార్‌ అప్‌డేట్‌, డీమ్యాట్‌ ఖాతాల నామినీ జోడించటం వరకు చాలా వాటికి డిసెంబరుతోనే గడువు ముగియనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో మదుపు చేసేందుకు కూడా డిసెంబరే లాస్ట్‌. కాబట్టి నెలాఖరులో మీరు ఈ పనులు పూర్తి చేయకుంటే కొన్ని ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

అమృత్‌ కలశ్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) పథకం గడువు డిసెంబర్‌తో ముగియనుంది. ఈ స్కీమ్‌ కింద అందించే టర్మ్‌ డిపాజిట్లకు 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తోంది. ఈ పథకం గడువు డిసెంబర్‌ 31తో ముగియనుంది.

లాకర్‌ అగ్రిమెంట్‌: బ్యాంక్‌ లాకర్లకు సంబంధించి అగ్రిమెంట్‌ (Locker Agreement) పునరుద్ధరణ గడువు కూడా డిసెంబర్‌తోనే ముగుస్తోంది. 2022 డిసెంబరు 31 కంటే ముందు లాకర్‌ అగ్రిమెంట్‌ను సమర్పించినవారు.. 2023 డిసెంబరు 31లోగా మరోసారి బ్యాంకులతో తమ లాకర్‌ అగ్రిమెంట్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌: పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారి కోసం ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 14 నాటికి ఆ గడువు ముగియనుంది. గడువు ముగిశాక ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ హోమ్‌లోన్‌ ఆఫర్‌: గృహ రుణం తీసుకోవాలనుకొనే కస్టమర్ల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. హోమ్‌లోన్‌పై గరిష్ఠంగా 65 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ కల్పించింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 నాటికి ముగియనుంది.

నామినీ జత చేశారా?: మ్యూచువల్‌ ఫండ్‌, డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ జత చేయడానికి సెబీ ఇచ్చిన గడువు డిసెంబరు 31 నాటికి ముగియనుంది. అలాగే, పాన్‌, నామినీ, బ్యాంక్‌ ఖాతా వివరాలు కూడా డిసెంబరు 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఖాతాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని సెబీ ఇప్పటికే పేర్కొంది.

యూపీఐ ఐడీలు డీయాక్టివేట్‌: ఏడాదికి పైగా వాడని యూపీఐ ఐడీలు, నంబర్లు డీయాక్టివేట్‌ చేయాలని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే, బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ (TPAP), పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (PSP) సదరు యూపీఐ ఐడీలకు డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది.

స్పెషల్‌ ఎఫ్‌డీలు: ఐడీబీఐ అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో 375, 444 రోజుల కాలవ్యవధితో ఎఫ్‌డీ డిపాజిట్ల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ సూపర్‌ 400’, ‘ఇండ్‌ సూపర్‌ 300 డేస్‌’ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల గడువూ అదే రోజు ముగియనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని