EPF auto settlement: పీఎఫ్‌ విత్‌డ్రా.. ఈ క్లెయిమ్స్‌పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!

EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్‌ తీసుకొచ్చిన ఆటో సెటిల్‌మెంట్‌ సదుపాయం గురించి తెలుసా? 

Published : 20 May 2024 11:43 IST

EPF auto settlement | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలో జమ చేసిన మొత్తం పదవీ విరమణ కోసమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం.. ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో వైద్య ఖర్చుల కోసం చేసే ఆటోక్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌లో తాజాగా ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రూల్‌ 68జె కింద ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. దీంతోపాటు రూల్‌ 68కె కింద ఉన్న విద్య, వివాహం, రూల్‌ 68బి కింద ఉన్న గృహనిర్మాణం లాంటి సందర్భాల్లో రూ.లక్ష వరకు ఆటో సెటిల్‌మెంట్‌ కింద పొందొచ్చు. ఇంతకీ ఆటో సెటిల్‌మెంట్ అంటే ఏంటి? ఎలా ప్రయోజనం?

ఏంటీ ఆటో సెటిల్‌మెంట్‌..?

సాధారణ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్‌ను ఈపీఎఫ్‌ తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్‌లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్‌మెంట్‌. వివాహం, ఉన్నత విద్య, ఇంటిని కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్‌ ఆటో- సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో రూ.లక్ష వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్‌ పొందొచ్చు.

వైద్య ఖర్చుల కోసం..

ఈపీఎఫ్‌ చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూల్‌ 68జె కింద ఈపీఎఫ్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా.. శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రూల్‌ 68జె కింద కచ్చితంగా ఇన్ని సంవత్సరాల తర్వాతనే నగదు ఉపసంహరించుకోవాలనే నియమం లేదు. ఉద్యోగి ఆరు నెలల బేసిక్‌ ప్లస్‌ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా).. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. ఈపీఎఫ్‌ ఉపసంహరణ దరఖాస్తు కోసం డాక్టర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

పెళ్లి, విద్య

రూల్‌ 68కె నియమం ప్రకారం.. ఉద్యోగి తన/ కుటుంబసభ్యుల పెళ్లి, పిల్లల విద్య కోసం పీఎఫ్‌లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్‌ఓలో చేరి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాల కోసం కేవలం మూడుసార్లు మాత్రమే తన పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు గరిష్ఠంగా తీసుకోవచ్చు. వివాహం కోసం డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్‌ సభ్యుడు ఆన్‌లైన్‌లో డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. అదే పిల్లల చదువు కోసం అయితే సంబంధిత సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

ఇంటి నిర్మాణం.. 

ఇక రూల్‌ 68బి ప్రకారం చందాదారులు స్థలం కొనుగోలు/ ఇంటి నిర్మాణం కోసం, ఇంటి రిపేర్‌ కోసం పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో పరిమితి మేరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌లో చేరి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. రెండుసార్లు మాత్రమే ఈ కారణంతో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీ అవసరంపై ఉపసంహరించుకొనే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇ-సేవా పోర్టల్‌ ద్వారా ఈ ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించొచ్చు. క్లెయిమ్‌ను ఫైల్‌ చేయడానికి ఫారం 31ని ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి..

ఆటో సెటిల్‌మెంట్‌లో మానవ ప్రమేయం ఉండదు. కాబట్టి రూ.1 లక్ష వరకు ఎలాంటి క్లెయిమ్స్‌ అయినా ఇట్టే పరిష్కారం అవుతాయి. ఆటో సెటిల్‌మెంట్‌ అనేది ఐటీ వ్యవస్థతో పని చేస్తుంది. అర్హత ఉండి.. కేవైసీ, బ్యాంక్‌ వ్యాలిడేషన్‌ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్‌ పేమెంట్‌ను ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమయం అనేది 10 రోజుల నుంచి 3-4 రోజులకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని