Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

విదేశీ వెకేషన్‌ను ప్లాన్‌ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Published : 25 Mar 2024 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ప్రదేశాలను చూడడం, వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడం, జీవితకాల జ్ఞాపకాలను పొందడం వంటివి ప్రయాణాల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. ప్రయాణం ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది. విదేశీ వెకేషన్‌ను ప్లాన్‌ చేయడం అనేది సాఫీగా, ఆనందించే అనుభవం అయినప్పటికీ దేశం వెలుపల ప్రయాణించే విషయానికొస్తే, మీ పర్యటన సమయంలో ఏదైనా ఆర్థిక, ఇతర సంక్షోభాలను ఎదుర్కోకుండా ఉండడానికి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. ప్రయాణ సమయంలో బయలుదేరినప్పటి నుంచి ఇంటికి తిరిగి వచ్చేవరకు కొన్నిసార్లు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఈ అడ్డంకులను ఎదుర్కోవడంలో మీకు సహాయపడడానికి అవాంతరాలు లేని విదేశీ పర్యటన కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

బడ్జెట్‌

మంచి వాతావరణం, సాంస్కృతిక ఆకర్షణలు, వివిధ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటే యూరప్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ప్రయాణికులకు మంచి ఆప్షన్లు. విదేశాలకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన విషయాల్లో మీ ఆసక్తిని బట్టి మీరు సందర్శించబోయే ప్రదేశాలను ముందే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు బడ్జెట్‌ను సెటప్‌ చేసుకోవడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కచ్చితంగా తెలిస్తే.. విమానాలు, వసతి, భోజనం, కార్యకలాపాలు, ప్రయాణ బీమా, వీసా లాంటి ఖర్చులను కవర్‌చేసే వివరణాత్మక బడ్జెట్‌ను రూపొందించుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఖర్చులు

విదేశాలకు వెళ్లేటప్పుడు ఎక్కువ ఖర్చు అంతర్జాతీయ విమానాల టికెట్లకు అయ్యే అవకాశం ఉంది. దీనికి గాను.. విశ్వసనీయ ట్రావెల్‌ వెబ్‌సైట్‌లను ఉపయోగించి విమానాల కోసం సెర్చ్‌ చేయండి. లేదా ఆకర్షణీయ డీల్స్‌ కోసం ట్రావెల్‌ ఏజెంట్స్‌ను సంప్రదించండి. కొన్ని ప్రయాణ తేదీల్లో విమాన ప్రయాణాల ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత సరసమైన ఎంపికను పొందేందుకు అనువైన తేదీలను ఎంచుకోండి. విమాన ప్రయాణ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకుంటే చౌకగా లభించే అవకాశం ఉంది. చివరి నిమిషంలో బుకింగ్‌ మీకు ఖర్చుతో కూడుకున్నదే కాకుండా టికెట్ల లభ్యత సమస్య కావచ్చు. మీరు కనెక్టింగ్‌ విమానాలను బుక్‌ చేస్తుంటే, లేఓవర్‌ సమయాన్ని తనిఖీ చేయడం మర్చిపోవద్దు. వివిధ విమానయాన సంస్థల ధరలను సరిపోల్చండి.

అంతేకాకుండా, క్రెడిట్‌ కార్డులు మీ ప్రయాణ ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి. విదేశీ లావాదేవీల రుసుములు, అనుకూలమైన కరెన్సీ మార్పిడి రేట్లు లేదా ప్రయాణ రివార్డులు వంటి అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సాహకాలను అందించే క్రెడిట్‌ కార్డుల కోసం ప్రయత్నించండి. మీ ఖర్చుల కోసం రివార్డు క్రెడిట్‌ కార్డును ఉపయోగించండి. విమానాలు, హోటల్‌లో వసతి లేదా ఇతర ప్రయాణ సంబంధిత ఖర్చుల కోసం రిడీం చేయగల పాయింట్లు లేదా మైల్స్‌ను సేకరించండి. వీటివల్ల మొత్తం ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

వసతి, పత్రాల బ్యాకప్‌

హోటల్స్‌, హాస్టల్స్‌, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌ వంటి వాటిలో వసతి ఎంపికలను అన్వేషించండి. ముందస్తుగా బుకింగ్‌ చేసుకుంటే వసతి సరసమైన ధరకు లభిస్తుంది. ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా వసతి ఏర్పాటు చేసుకోండి. పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ రిజర్వేషన్స్‌, ప్రయాణ బీమా వంటి ముఖ్యమైన పత్రాలను స్కాన్‌/ఫోటోలు తీయండి. ఈ డిజిటల్‌ కాపీలను సురక్షిత క్లౌడ్‌లో భద్రపర్చండి. ఒకవేళ ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌ కాపీలు పోయినా లేదా చోరికి గురయినా.. సులభంగా యాక్సెస్‌ చేసుకోవడానికి వీలుంటుంది. మీ విలువైన వస్తువులను భద్రంగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. మీ వీసా, పాస్‌పోర్ట్‌, బ్యాంకు కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను మీ వెంటే తీసుకెళ్లండి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను ప్రదర్శించకుండా ఉండండి. మీరు విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా పాస్‌పోర్ట్‌ను తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇది అత్యంత విలువైన, ముఖ్యమైన పత్రం.

ఆరోగ్యం

మీరు బయలుదేరే ముందు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. ప్రయాణాలు చేసే ముందు టీకాలు, మందులు ఎంత వరకు అవసరమో మీ వైద్యుడిని అడిగి తెలుసుకోండి. మీకు రెగ్యులర్‌గా ఉండే అనారోగ్యాలకు సంబంధించి అవసరమైన మందులను వెంట తీసుకెళ్లండి. ప్రాథమిక ఆరోగ్య చికిత్స వస్తు సామగ్రిని వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. మీరు గ్లోబల్‌ హెల్త్‌ కవరేజ్‌ లేదా విదేశీ వైద్య చికిత్సను కవర్‌చేసే ప్రయాణ బీమాను కలిగి ఉండాలి. ఎందుకంటే విదేశాల్లో చిన్న ఆరోగ్య సమస్యలు కూడా అక్కడ మీ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను మీకు అత్యంత సన్నిహితులతో ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకోండి. అంతర్జాతీయ సిమ్‌ కార్డులు లేదా డేటా రోమింగ్‌ ప్యాకేజీల ద్వారా వారితో కనెక్టయి ఉండండి.

ప్రయాణ బీమా

ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోకుండా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయాణ బీమా తీసుకోవడం చాలా అవసరం. మెడికల్‌ ఎమర్జెన్సీలు, ప్రయాణ ట్రిప్‌ క్యాన్సిలేషన్స్‌ లేదా లగేజీ పోగొట్టుకోవడం వంటి ఊహించని సంఘటనల నుంచి రక్షించుకోవడానికి ఏకైక మార్గం ప్రయాణ బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయడం. మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా లేదా మీ లగేజీ ఆలస్యంగా వచ్చినప్పుడు/పోయినప్పుడు, మీరు ప్రమాదానికి గురయినా, అనారోగ్యం పాలయినా.. ఖర్చులను కవర్‌ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా, విదేశంలో మీ నగదును పోగొట్టుకుంటే ప్రయాణ బీమా అత్యవసర నగదు సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణ బీమా సంస్థలు తమ క్లయింట్లకు 24 గంటల అత్యవసర సేవలను అందిస్తాయి. 

కరెన్సీ ఎక్స్ఛేంజ్‌

మీరు ప్రయాణిస్తున్న దేశం ఏ కరెన్సీని ఉపయోగిస్తుందో చూడాలి. ఆ దేశంలో మీ సొంత కరెన్సీ విలువ ఎక్కువ లేదా తక్కువ ఉందో తెలుసుకోవడానికి మీరు కరెన్సీ మారకపు రేటును తనిఖీ చేయాలి. మీ దగ్గర ఉన్న కరెన్సీతో విదేశాల్లో అవసరమయ్యే కరెన్సీని మార్చుకోండి. మెరుగైన ధరల కోసం ఫారెక్స్‌ కార్డులను ఉపయోగించండి. విదేశాల్లో ఉన్నప్పుడు ఊహించని కార్డు సమస్యలను నివారించడానికి మీ ప్రయాణ ప్రణాళికల గురించి మీ బ్యాంకుకు తెలియజేయండి. ఎందుకంటే స్వదేశంలో ఉన్న బ్యాంకులు విదేశాల నుంచి లావాదేవీలను చూసినట్లయితే వారు మీ కార్డును స్తంభింపజేయవచ్చు. నగదు, కార్డులతో పోలిస్తే ట్రావెలర్స్‌ చెక్‌ అనేది సురక్షితమైన లావాదేవీ విధానం. ప్రయాణంలో ట్రావెలర్‌ చెక్స్‌ను, ట్రావెల్‌ మనీ కార్డులను, తక్కువ నగదు మాత్రమే వెంట ఉంచేందుకు ప్రయత్నించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు